ఆరేళ్ల తర్వాత ఓయూ స్నాతకోత్సవంజరగనుంది. స్వరాష్ట్రంలో నిర్వహిస్తున్న తొలి స్నాతకోత్సవం ఇది. 2014లోటీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కుఓయూ గౌవర డాక్టరేట్ ఇవ్వాలనిప్రతిపాదించగా... విద్యార్థి సంఘాలువ్యతిరేకించడంతో విరమించుకున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక మహోన్నతమైన విజ్ఞానభూమి. బోధన, పరిశోధనే లక్ష్యంగా ఆవిర్భవించిన విశ్వవిద్యాలయం. వేల ఏళ్ల మానవ ప్రస్థానాన్ని, చరిత్ర గమనాన్ని అధ్యయనం చేస్తూ పరిశోధిస్తూ సరికొత్త ఆవిష్కరణలతో ఒక తరం నుంచి మరో తరానికి విజ్ఞాన వారధిగా నిలిచిన ఈ యూనివర్సిటీ... విద్య, బోధన, పరిశోధన మాత్రమే కాదు, సమాజాన్ని ముందుకు నడిపించడంలో, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించడంలో అగ్రభాగాన నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సముపార్జించిన ఎంతోమంది అతిరథ మహారథులకు గౌరవ డాక్టరేట్‌లను అందజేసి సముచితంగా గౌరవించింది. తన కీర్తి ప్రతిష్ఠలను విశ్వవిఖ్యాతం చేసుకుంది. అయితే ఇదంతా గత వైభవమే. గడిచిన 18 ఏళ్లుగా ఒక్క గౌరవ డాక్టరేట్‌ను కూడా ఇవ్వలేదు. ఇంచుమించు ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. మరెంతో మంది తమ ప్రతిభా పాటవాలతోపరిశోధనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చు. కానీ అలాంటి ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. ఎంపికలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. చరిత్ర, సైన్స్, కళలు, సాహిత్యం, సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలు, రాజకీయ రంగాల్లో గొప్ప కృషి చేసిన వారిని గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇవ్వడమంటే ఆ వ్యక్తులను సమున్నతంగా గౌరవించడమే కాకుండా... ఉస్మానియా విశ్వవిద్యాలయం తనను తాను గౌరవించుకున్నట్లవుతుంది. కానీ ఈ 18 ఏళ్లలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడకపోవడం గమనార్హం.
ఆనాటి వెలుగులేవీ?
ఆరేళ్ల తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 17న వేడుకలను నిర్వహించనున్నారు. ఈ ఆరేళ్లలో పరిశోధనలు పూర్తి చేసిన ఎంతోమంది విద్యార్థులు పట్టాలందుకోనున్నారు. సుమారు 2,800 మందికి పైగా విద్యార్ధులు పీహెచ్‌డీలు పూర్తి చేశారు. వారిలో ఇప్పటికే 1,800 మంది పట్టాలు పొందారు. మరో 1,096 మందికి ఈ స్నాతకోత్సవ వేడుకల్లో పట్టాలందజేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించగా.. ఇప్పటి వరకు సుమారు 680 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ వేడుకల్లో అసమాన ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన 270 మంది టాప్‌మోస్ట్ విద్యార్థులు గోల్డ్‌మెడల్స్‌ను అందుకోనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ అలాంటి స్నాతకోత్సవ సంరంభంలో యూనివర్సిటీ హోదాను, గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను ద్విగుణీకృతం చేసే గౌరవ డాక్టరేట్‌లు మాత్రం లేవు.
ఎందుకిలా?
గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం చేయకపోవడానికి అనేక కారణాలున్నాయి. 2001 నుంచి దశాబ్దానికి పైగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగింది. సమాజంలో ఒక బలమైన ఆందోళన కొనసాగుతున్న సమయంలో వివిధ రంగాల్లో గొప్ప వ్యక్తులను గుర్తించి అవార్డులను అందజేయడం అసాధ్యంగా మారింది. 2014లో కేసీఆర్‌కు ఇవ్వాలనుకున్నప్పటికీ విద్యార్థుల నుంచి వ్యతిరేకత రావడంతో విరమించుకున్నారు. సామాజిక శాస్త్రవేత్తలు, వైజ్ఞానిక, సాహిత్య, రాజకీయ రంగాల్లోని ప్రముఖులను గుర్తించి ఇవ్వడంలో యూనివర్సిటీ పాలకమండలిలో ఏకాభిప్రాయం లేకుండా పోయింది. మరోవైపు రాజకీయ పార్టీల ప్రభావం కారణంగా ఎంపికపై ఎవరికి వారు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులకు ఇవ్వాలనుకున్నా అందరికీ, అన్ని పార్టీలకు ఆమోదయోగ్యుడైన నేతల ఎంపిక కూడా కష్టంగా మారింది. రవీంద్రనాథ్ ఠాగూర్, అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి మహానుభావులకు, ఎంతోమంది వైజ్ఞానిక రంగ ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌లు ఇవ్వడం ద్వారా ఇతర యూనివర్సిటీల కంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంతో వైవిధ్యాన్ని కనబరిచింది. అదేస్థాయి వ్యక్తులను ఎంపిక చేయడంలో ఈ 18 ఏళ్ల కాలంలో సాధ్యం కాలేదు.
ఎందరో మహానువుభావులు...
నిజానికి వర్సిటీ ఆరంభం నుంచే గొప్ప సంస్కృతిని చాటుకుంది. మేధావులను, ఆయా రంగాల్లో అపారమైన సేవలందజేసిన వారిని గుర్తించి డాక్టరేట్‌లతో గౌరవించింది. అలా 1917లోనే అప్పటి అరబిక్ ప్రొఫెసర్, ఆరో నిజాం రాజు మహబూబ్‌అలీకి ఎంతో ప్రియమైన వ్యక్తి అయిన నవాబ్ ఇమాదుల్ ముల్క్ బహదూర్‌కు తొలి గౌరవ డాక్టరేట్ లభించింది. ఈయన ప్రెసిడెన్సీ కాలేజీలో, బెంగాల్, లక్నో కళాశాలల్లోనూ అధ్యాపకులుగా పని చేశారు. నిజాం ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగం డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు 1938 ఫిబ్రవరి 28న గౌరవ డాక్టరేట్ అందజేసింది. చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ‘డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్’ అవార్డును అందుకున్న తొలి సాహితీవేత్త రవీంద్రనాథ్ ఠాగూర్. అదే సంవత్సరం ప్రముఖ కవి ఇక్బాల్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. బికనూర్ ప్రభువు మహారాజ్ ఆదిరాజ్‌కు కూడా గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. ఆ తర్వాత ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల చీఫ్ ఇంజినీర్ అయిన నవాబ్ అలీజంగ్‌కు 1949 మార్చి 19న ‘డాక్టరేట్ ఆఫ్ సైన్స్’ విభాగంలో అందజేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు 1953లో గౌరవ డాక్టరేట్ అందజేసే అరుదైన అవకాశం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దక్కింది. ఈ అపూర్వ ఘట్టంతో ఓయూ కీర్తిప్రతిష్టలు మరింత రెపరెపలాడాయి. అప్పటికే 1952లో కొలంబియా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందజేసి సముచితంగా గౌరవించింది. బెల్ లెబోరేటరీస్ అధినేత, వైజ్ఞానిక రంగ నిపుణులు అయిన డాక్టర్ అరుణ్ నేత్రావలికి 2001 ఆగస్టు 8న గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న 47వ వ్యక్తి ఆయన. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవ్వరికీ ఇవ్వలేదు. 2014లో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. కానీ విద్యార్ధుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు.
ఓయూ గౌరవ డాక్టరేట్ అందుకున్న ప్రముఖులు వీరే...
1. నవాబ్ ఇమాదుల్ ముల్క్ బహదూర్ – 1917
2. నవాబ్ సర్ అమీన్‌జంగ్ బహదూర్ – 1918
3. నవాబ్ మసూద్ జంగ్ బహదూర్ – 1923
4. మహరాజ్ సర్ కిషన్ పరిషద్ బహదూర్ – 1938
5. సర్ తేజ్ బహదూర్ సిప్రూ – 1938
6. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ – 1938
7. సర్ మహ్మద్ ఇక్బాల్ – 1938
8. మహరాజ్ ఆదిరాజ్ బికనూర్ ప్రభువు –1939
9. ప్రిన్స్ ఆజం జాహ్ బహదూర్ – 1939
10. ప్రిన్స్ మోజం జాహ్ బహదూర్ – 1940
11. నవాబ్ అలీ నవాజ్‌జంగ్ బహదూర్ –1943
12. సి.రాజగోపాలాచారి – 1944
13. దివాన్ బహదూర్ సర్ రామస్వామి మొదలియార్ – 1945
14. సర్ జాన్ సర్ గేంట్ – 1947
15. పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ – 1947
16. మేజర్ జనరల్ చౌదరి – 1949
17. బాబు రాజేంద్రప్రసాద్ – 1951
18. టింగ్ సి–లిన్ – 1951
19. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ – 1953
20. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ – 1953
21. ఎంకే వెల్లోడి – 1953
22. కేఎం మున్షీ – 1954
23. వీకే కృష్ణమీనన్ – 1956
24. బూర్గుల రామకృష్ణరావు – 1956
25. ఆలియార్ జంగ్ – 1956
26. షేక్ అహ్మద్ యామనీ – 1975
27. డాక్టర్ జర్‌హర్ట్ హెర్డ్ బెర్గ్ – 1976
28. ప్రొఫెసర్ సయ్యద్ నురుల్ హసన్ – 1977
29. డాక్టర్ కలియంపూడి రాధాకృష్ణ – 1977
30. తాలాహ్ ఈ దైని తరాజీ – 1979
31. యాసర్ హరాఫత్ – 1982
32. డాక్టర్ వై.నాయుడమ్మ – 1982
33. ప్రొఫెసర్ రాంజోషి – 1982
34. జి.పార్థసారథి – 1982
35. డాక్టర్ జహీర్ అహ్మద్ – 1982
36. జస్టిస్ మహ్మద్ బౌడ్జౌయ్ – 1985
37. జస్టిస్ నాగేందర్‌సింగ్ – 1986
38. జస్టిస్ ని ఝంగ్యూ – 1986
39. ఆర్.వెంకట్రామన్ – 1986
40. ప్రొఫెసర్ సీఎస్‌ఆర్ రావు – 1986
41. జస్టిస్ పి.జగన్మోహన్‌రెడ్డి – 1986
42. డాక్టర్ రాజా రామన్న – 1990
43. బీపీఆర్ విఠల్ – 1993
44. ప్రొఫెసర్ జి.రాంరెడ్డి – 1993
45. డాక్టర్ లక్ష్మీ ఎం.సింగ్వీ – 1994
46. డాక్టర్ మన్మోహన్‌సింగ్ – 1996
47. డాక్టర్ అరుణ్ నేత్రావలి – 2001
Comments
Please login to add a commentAdd a comment