మాది అవినీతి రహిత పాలన
వచ్చే నాలుగేళ్లు కూడా నిజాయతీగా ఉంటాం
కార్మికులను ఆదుకుంటాం
కేంద్ర మంత్రి దత్తాత్రేయ
సంగారెడ్డి టౌన్ : నరేంద్ర మోదీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం అవినీతి రహిత పాల నను అందించిందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. వచ్చే నాలుగేళ్లు కూడా నిజాయతీగా పరిపాలిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో ‘సంపర్క్ అభియాన్’ వారోత్సవాలను మంత్రి దత్తాత్రేయ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయకు తమ సంపూర్ణ మద్దతు ఉం టుందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి తమ ప్రభుత్వం చేయూతనందిస్తుందని చెప్పారు.
దేశంలో 48 కోట్ల మంది కార్మికులున్నారని, ప్రతి కార్మికుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని చెప్పారు. అందుకోసం వారికి ప్రత్యేక నంబర్ ఇచ్చామని దాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. సంగారెడ్డిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి కేంద్రం ద్వారా సహాయం చేస్తామన్నారు. నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీమా పథకాలు, పింఛన్ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను పేదలు ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, అమర్‌సింగ్, జగన్ పాల్గొన్నారు.