ప్రియాంక రెడ్డి : అవే చివరి విధులు..! | Own Village People Remembering Priyanka Reddy | Sakshi
Sakshi News home page

ప్రియాంక రెడ్డి : అవే చివరి విధులు..!

Published Fri, Nov 29 2019 8:26 AM | Last Updated on Fri, Nov 29 2019 8:38 AM

Own Village People Remembering Priyanka Reddy - Sakshi

విధి నిర్వహణలో పశువైద్యాధికారిణి ప్రియాంక (ఫైల్‌)

నవాబుపేట (జడ్చర్ల), కోడేరు (కొల్లాపూర్‌): షాద్‌నగర్‌ వద్ద హత్యకు గురైన పశు వైద్యాధికారిణి ప్రియాంక.. మండలంలోని కొల్లూర్‌లో బుధవారం విధులు నిర్వహించి మధ్యాహ్నం 2.30 నిమిషాలకు వెళ్లిపోయారు.. కాగా అవే ఆమె చివరి విధులుగా మిగిలిపోయాయి. నవాబుపేట మండలం కొల్లూర్‌లో గత మూడేళ్లుగా పశువైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న ప్రియాంక సొంత గ్రామం కొల్లాపూర్‌ నియోజకవర్గం కోడేరు మండలం నర్సాయిపల్లి. హత్య విషయం తెలియడంతో కొల్లూర్‌తోపాటు నర్సాయిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె అందించిన ఉత్తమ సేవలను గుర్తుచేసుకుంటూ రైతులు తీవ్రమనోవేదనకు గురయ్యారు. 

చదవండినమ్మించి చంపేశారు!

పదేళ్ల ఇక్కట్లు తీర్చింది..
మండలంలోని కొల్లూర్‌ క్లస్టర్‌లో దాదాపు పదేళ్లుగా పశువైద్యాధికారి లేక పశువులకు వైద్యం అందించేందుకు తాము తీవ్ర ఇక్కట్లు పడ్డామని, ఆ తర్వాత పశువైద్యాధికారిగా ప్రియాంక బాధ్యతలు చేపట్టి మెరుగైన సేవలు అందించడంతో ఇక్కట్లు తప్పాయని గుర్తు చేసుకుంటున్నారు. ఈమేరకు జనవరి 31, 2017లో కొల్లూర్‌లోనే ఆమెకు మొదటి పోస్టింగ్‌ వచ్చింది. చాలా కాలంగా పరిసర గ్రామాల ప్రజలు, రైతులు పశువైద్యాధికారి లేక ఇబ్బందులు పడ్డ తరుణంలో ఆమె ఇక్కడ విధులు చేపట్టి అందరికీ అందుబాటులో ఉందని రైతులు అభిప్రాయపడ్డారు. విధి నిర్వహణలో ముక్కుసూటి అధికారిగా పేరు పొందిన ఆమె పశువులకు సంబందించి ఆనారోగ్యానికి గురైతే సమాచారం రాగానే సిబ్బందిని అప్రమత్తం చేసి అవసరమైతే తాను వచ్చి మందులు, చిక్సిలు చేసేదని వారు గుర్తు చేసుకున్నారు. అలాగే, ప్రభుత్వ పథకాల అమలుకు రాత్రింబవళ్లు కష్టపడేదని సిబ్బంది పేర్కొంటున్నారు. 

బుధవారం చివరిసారి విధులో..
షాద్‌నగర్‌లో నివాసం ఉండే పశువైద్యాధికారిణి ప్రియాంక నిత్యం ఇంటి నుంచి స్కూటీలో బస్టాండ్‌కు వచ్చి అక్కడే స్కూటీ ఉంచి బస్సులో కొల్లూర్‌కు వచ్చేది. ఒక్కోసారి బస్సులు దొరకని సమయంలో ఆటోలో వచ్చి మధ్యలో సిబ్బందికి ఫోన్‌ చేసి వారి ద్విచక్ర వాహనాలపై కొల్లూర్‌కు వచ్చేది. బుధవారం సైతం ఆమె కొల్లూర్‌లో విధులు నిర్వహించి మధ్యాహ్నం 2.30 నిమిషాలకు బయలు దేరినట్లు గ్రామస్తులు తెలిపారు.

నర్సాయిపల్లిలో విషాదఛాయలు
కొల్లాపూర్‌ నియోజకవర్గం కోడేరు మండలంలోని నర్సాయిపల్లికి చెందిన ప్రియాంకరెడ్డి దారుణహత్యకు గురి కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నర్సాయిపల్లికి చెందిన శ్రీధర్‌రెడ్డి, విజయమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉండగా.. అందులో ప్రియాంకరెడ్డి పెద్దకూతురు. వీరు 1వ తరగత నుంచి 4వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఉన్నత చదువుల కోసం శంషాబాద్‌కు మకాం మారారు. అనంతరం అక్కడే వారి మిగతా విద్యాభ్యాసం కొనసాగింది. పెద్ద కూతురు ప్రియాంకరెడ్డి నవాబ్‌పేట మండలం కొల్లూర్‌లో వెటర్నరీ డాక్టర్‌గా విధులు చేపట్టింది.

బుధవారం విధులకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన ప్రియాంక.. తిరిగి ఇంటికి రాకపోవడం, తన సోదరికి ఫోన్‌ చేసి స్కూటీ పంక్చర్‌ అయ్యిందని, తనకు భయంగా ఉందని చెప్పిన కొద్ది సేపట్లోనే ఆమె ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయ్యింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలించగా.. గురువారం తెల్లవారుజామున షాద్‌నగర్‌ సమీపంలో శవమై తేలడంతో వారు బోరుమన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement