
తల తాకట్టు పెట్టయినా..
మహబూబ్నగర్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. అనంతరం కరివెన గ్రామంలో ఏర్పాటుచేసిన పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తల తాకట్టు పెట్టయినా పాలమూరుకు వచ్చే నాలుగేళ్లలో కృష్ణా నీళ్లు తెస్తామన్నారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కింద వీలైనంత తక్కువగా ముంపు ఉండేలా చూస్తామన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులందరికి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ప్రాజెక్టు కింద మూడు తండాలు పోతున్నాయని.. నిర్వాసితుల్లో గిరిజనలు, నిరుపేదలున్నారన్నారు. నిర్వాసితుల కడుపు నింపే ప్రాజెక్ట్ మొదలు పెడతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తక్షణమే కలెక్టర్తో మాట్లాడి ప్రతి ఇంటికో ఉద్యోగం ఇచ్చి, ప్రాజెక్ట్ మొదలయ్యే వరకే నిర్వాసితులకు సర్కార్ జీతం వచ్చేలా చూస్తామన్నారు. నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. 15 రోజులకోసారి ప్రాజెక్ట్ పనులు పర్యవేక్షిస్తానని చెప్పారు.
రూ.35,200 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మూడు జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. దీంతో పాటు హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల నీరు రానుంది.