ఈ ఏడాది తీవ్రవాదుల ప్రభావం
⇔ పంచాంగ పఠనంలో బాచంపల్లి
⇔ ఆగస్టు–అక్టోబర్ మధ్య తెగబడొచ్చు
⇔ ఓ నేతకు ప్రమాదం పొంచి ఉంది
⇔ భద్రత వ్యవస్థ అప్రమత్తంగా పనిచేయాలి
⇔ ఈసారీ వానలు అనుకూలమే.. వరుణ యాగం చేస్తే మంచిది
⇔ తెలంగాణలో రైతులకు అనుకూల వాతావరణం
⇔ సాఫ్ట్‌వేర్‌లో మందగమనం.. ఔషధ కల్తీ.. మీడియాలో ఒడిదుడుకులు..
⇔ దేశఖ్యాతి మరింత ఇనుమడిస్తుంది
⇔ వ్యక్తిగతంగా మోదీ, కేసీఆర్‌కు మంచి యోగం
సాక్షి, హైదరాబాద్: హేవళంబినామ సంవ త్సరంలో తీవ్రవాదుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని శృంగేరీ ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి హెచ్చరిం చారు. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో వారు తెగబడేందుకు అవ కాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర భద్రత వ్యవస్థ అప్రమత్తంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఓ నేతకు ప్రమాదం పొంచిఉందన్నారు. బుధవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో ‘జనహిత’ వేదిక మీదుగా ఆయన కొత్త సంవత్సర పంచాగ పఠనం చేశారు.
గత సంవత్సరం విద్య, వైద్య శాఖల్లో తీవ్ర అవినీతి ఆరోపణలు వెలుగుచూస్తాయని రవీంద్రభారతిలో జరిగిన పంచాంగ పఠనంలో పేర్కొనడం.. చెప్పినట్టే ఈ రెండు శాఖలను అవినీతి ఆరోపణలు కుదిపేశాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏ శాఖలో పరిస్థితి బాగోలేదంటూ పలువురు ఆయన్ను కొద్ది రోజులుగా ప్రశ్నిస్తున్నారు. సంతోష్‌కుమార్ శాస్త్రి ఇదే విషయాన్ని ఉటంకిస్తూ.. ఈసారి హోంశాఖ చాలా అప్రమత్తంగా పని చేయా ల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పంచాంగ పఠనం తర్వాత సీఎం చంద్రశేఖరరావు తన ప్రసంగంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిం చారు. హోంమంత్రి నాయిని, పోలీసులు పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు.
రాష్ట్రంలో రైతు అనుకూల వాతావరణం
గత సంవత్సరం భారీ వర్షాలు కురిసి రైతు కళ్లల్లో ఆనందం నిండినట్టే ఈ ఏడాది కూడా వానలు సమృద్ధిగానే కురుస్తాయని సంతోష్‌కుమార్ శాస్త్రి పేర్కొన్నారు. గత సంవత్సరం భారీ వర్షాలు కురిసినా అవి సరైన సమయంలో కురవలేదని, ఈసారి అవసరమైన సమయంలోనే కురిసే అవకాశం ఉందన్నారు. అయితే ఆషాఢమాసం ప్రారంభంలోనే దేవాదాయ శాఖ వరుణ జపాలు, విరాట పర్వం పారాయణాలు నిర్వహిస్తే మంచి ఫలితాలుంటాయని, అది రైతులకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సంవ త్సరం ఆది దేవుడు అగ్ని రూపంలోని సూర్యభగవానుడని, రాజు స్థానంలో బుధుడు, మంత్రి స్థానంలో శుక్రుడున్నాడని చెప్పారు.
ఇది రాష్ట్రానికి మంచి చేస్తుందని, కొన్నిచోట్ల రాజకీయ అలజడులు, చోరులు, దుర్మార్గుల ఆగడాలు కనిపించినా దైవానుగ్రహంతో సర్దుకుంటాయని పేర్కొన్నారు. ధాన్యాల ధరలు స్థిరంగా ఉండటం రైతులకు ఉపయోగపడుతుందని, ధాన్యాధిపతిగా శని ఉన్నందున మినుములు, నల్ల నువ్వులు, అవిసెలు, ఇతర నల్ల పంటలు బాగా పండుతాయన్నారు. శ్రావణ మాసం వరకు మంచి వానలుంటాయని, అక్టోబర్‌లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయన్నారు. ఆషాఢమాసంలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తుఫాను ప్రభావం కనిపిస్తుందని, దాని వల్ల తెలంగాణకు పెద్దగా ఇబ్బంది ఉండదని చెప్పారు.
దేశ కీర్తి మరింత పెరుగుతుంది
భారత్ కీర్తి ప్రపంచవ్యాప్తంగా మరింత పెరుగుతుందని, సాంకేతికంగా దేశం ముందడుగు వేస్తుందని, కొత్త ఆయుధాలను సొంతంగా రూపొం దించుకుంటుందని సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు. ప్రధాని మోదీకి కూడా మంచి యోగం ఉన్నందున ఈ సంవత్సరం ఆయన ప్రజారంజకంగా వ్యవహæరిస్తారన్నారు.
మందకొడిగా సాఫ్ట్‌వేర్..
ఈ ఏడాది సాఫ్ట్‌వేర్ రంగం మందకొడిగా సాగుతుందని, ఇందులో కుంభకోణం వెలుగుచూసే అవకాశం ఉందని సంతోష్‌కుమార్ శాస్త్రి పేర్కొన్నారు. ఔష ధాల్లో కల్తీలు ఎక్కువవుతాయన్నారు. మీడియా రంగంలోనూ ఒడిదుడుకులు కనిపిస్తాయని, రోగపీడల ప్రభావం ఎక్కువగానే ఉంటుందన్నారు. ఈ సంవ త్సరం పుష్కరుడు కావేరీ నదిలో ఉంటాడని, ఆగస్టు 7న పాక్షిక చంద్ర గ్రహణం, జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటాయన్నారు. అయినా నవ నాయ కుల్లో ఆరుగురికి శుభాధిపత్యం, ఉప నాయకుల్లో 14 మందికి శుభాధిపత్యం ఉన్నందున మొత్తంగా హేవళంబి సంవత్సరం క్షేమకరమేనన్నారు. ప్రజల్లో విలా సాలు, వినోదాలపై కొంత ఆసక్తి పెరుగుతుందన్నారు. నిర్ణయాలు మగవారే తీసుకున్నా తెరవెనుక మహిళల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందన్నారు.
అధికారులపై సీఎం అసంతృప్తి
ఇప్పటి వరకు ఉగాది వేడుకలను రవీంద్రభారతి వేదికగా నిర్వహించగా.. తొలిసారి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. వేదికకు ఒక పక్కన మామిడి చెట్టు సెట్టింగ్ ఏర్పాటు చేసి దాని కిందే పంచాంగ పఠనం కోసం వేదిక రూపొందించారు. అయితే అది దూరంగా ఉండటంతో సీఎం అసంతృప్తి వ్యక్తం చేసి తమ ముందు పీఠం ఏర్పాటు చేయాలని ఆదేశించటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టి సిద్ధం చేశారు. ఆహ్వాన పత్రాలున్నవారికే అవకాశం కల్పించారు. చూసేందుకు వచ్చిన వారిని పోలీసులు రోడ్డుపైనే నిలిపివేయటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాంగ పఠనం అనంతరం వివిధ దేవాలయాలకు చెందిన అర్చకులు, పండితులు, సిద్ధాంతులను వేదికపై సత్కరించారు. అనారోగ్యం కారణంగా ఒకరిని మాత్రమే సీఎం శాలువాతో సత్కరించగా.. మిగతావారిని మంత్రులు సన్మానించారు.
సీఎంకు ఆదాయం 11.. ఖర్చు 8
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పరిస్థితి అనుకూలంగా ఉందని, గత సంవత్సరం కంటే ఇటు ఆదాయం, అటు గౌరవం (రాజపూజ్యం)లో మెరుగ్గా ఉంటుందని సంతోష్‌కుమార్ చెప్పారు. సీఎంది కర్కాటక రాశి అయినందున ఈ సంవత్సరం ఆదాయం 11 ఉంటే ఖర్చు 8 ఉంటుందని, రాజపూజ్యం 5 ఉంటే.. అవమానం 4గా ఉంటుందన్నారు. వృశ్చిక రాశిలో ఉన్న ప్రధాని మోదీకి కూడా ఈ ఫలితాలు 5–5, 3–3గా ఉంటాయన్నారు. విద్యుత్ రంగం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు పరిస్థితి అనుకూలంగా ఉందని తెలిపారు.