సాక్షి, హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పరిమితి బాగా పెరిగింది. సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లుగా పోటీ చేసే వారి ఖర్చులను భారీగా పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎన్నికల ఖర్చు పరిమితిని పెంచినట్లు పేర్కొంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం కల్పించింది. ఇలాంటి గ్రామాల్లో వార్డు సభ్యుడు గరిష్టంగా రూ.50 వేలు ఖర్చు చేయవచ్చు. 5 వేల జనాభా కంటే తక్కువ ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.1.50 లక్షలు.. వార్డు సభ్యుడిగా బరిలో ఉన్న వారు రూ.30 వేల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. గతంలోనూ సర్పంచ్, వార్డు సభ్యుల ఖర్చు గరిష్ట పరిమితి రెండు రకాలుగా ఉండేది. ఐదు వేల జనాభా కంటే ఎక్కువున్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి ఖర్చు పరిమితి రూ.80 వేలు, వార్డు సభ్యుడి పరిమితి రూ.10 వేలు ఉండేది. సాధారణ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.40 వేలు, వార్డు సభ్యుడికి రూ.6 వేలు ఉండేది. తాజా నిర్ణయంతో ఈ పరిమితులన్నీ మారాయి.
లెక్క చెప్పాల్సిందే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా ఖర్చు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ఖర్చు లెక్కలు సమర్పించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు పదవులను, పోటీ చేసే అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం.. పోటీ చేసిన వారు ఎన్నిక ముగిసిన 40 రోజుల్లోపు ఖర్చు వివరాలను అధికారులకు సమర్పించాలి. ఈ గడువులోపు వివరాలను సమర్పించని వారికి రాష్ట్ర ఎన్నికల సంఘం షార్ట్ నోటీసు జారీ చేస్తుంది. 20 రోజుల్లోగా వివరాలు సమర్పించాలి. లేకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటుంది. షార్ట్ నోటీసుకు స్పందించని వారిపై మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తుంది. ఎన్నికల ఖర్చు లెక్కలకు సంబంధించి ప్రతి అభ్యర్థి ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్ ప్రారంభించాలి. నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి రోజువారీగా లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment