నువ్వా..నేనా..!?
డీసీసీబీ చైర్మన్‌గా ముత్తవరపు పాండురంగారావు ఎన్నికైన ఘడియమంచిదికానట్లుంది. యడవెల్లి విజయేందర్‌రెడ్డి, ముత్తవరపు పాండురంగారావులు చెరి రెండున్నరేళ్లు పదవిలో ఉండేలా చేసుకున్న ఒప్పందం అమలులోనే వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. పలు పరిణామాల నేపథ్యంలో ఎన్నిక అనివార్యమైంది. ఎట్టకేలకు పాండురంగారావుకు చైర్మన్‌గిరి దక్కింది. ఆయన ఎన్నిక తీరుపై డెరైక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
నల్లగొండ అగ్రికల్చర్ :జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ పదవికి యడవెల్లి విజయేందర్‌రెడ్డి సెప్టెంబర్‌లో రాజీనామా చేయడంతో ముత్తవరపు పాండురంగారావుకు అవకాశం కల్పించారు. ఏకగ్రీవమవుతుందన్న కాంగ్రెస్ నేతల అంచనాలను తారుమారు చేస్తూ కాంగ్రెస్ పార్టీకే చెందిన డెరైక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ చైర్మన్ బరిలో నిలిచి అధిష్టానానికి చుక్కలు చూపారు. ఆక్టోబర్ 8న నిర్వహించిన చైర్మన్ ఎన్నికలలో పాండురంగారావుకు 12 మంది డెరైక్టర్లు ఓటు వేయగా, పిల్లలమర్రి శ్రీనివాస్‌కు 9 మంది డెరైక్టర్లు ఓటు వేశారు. దీంతో పాండురంగారావు గెలుపొందారు. అయితే పాండురంగారావు ఎన్నిక చెల్లదని పిల్లలమర్రి శ్రీనివాస్ రాష్ట్రసహకార ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నప్పుడు యడవెల్లి విజయేందర్‌రెడ్డి ఆరునెలలపాటు సెలవులోఉండి నాలుగు బోర్డు సమావేశాలకు హాజరుకానందున ఆయన డెరైక్టర్‌గా కొనసాగడానికి అర్హత కోల్పోయారని, అర్హత కోల్పోయిన విజయేందర్‌రెడ్డి బలపర్చిన పాండురంగారావు ఎన్నిక చెల్లదని శ్రీనివాస్ నవంబర్ 6న ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. వరుసగా మూడు బోర్డు సమావేశాలకు హాజరుకాకపోతే డెరైక్టర్‌గా కొనసాగే హక్కును కోల్పోతారని సహకార చట్టం చెబుతుందని ట్రిబ్యునల్‌కు తన వాదనలను వినిపించారు. దీంతో సహకార ట్రిబ్యునల్ ఇటీవల డీసీసీబీ చైర్మన్‌పాండురంగారావు, మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, డీసీఓ తుమ్మ ప్రసాద్, సీఈఓ నర్మద, ఎన్నికల అధికారి, జిల్లా సహకార అడిటర్ లక్ష్మినారాయణలకు నోటీసులను జారీచేసింది.
ఈ నెల 29న స్వయంగా ట్రిబ్యునల్ ఎదుట హాజరై తమ వాదనలు వినిపించాలని నోటీసులో పేర్కొంది. వరుసగా మూడు సమావేశాలకు హాజరుకానట్లయితే అనర్హడుగా ప్రకటించవచ్చని సహకార చట్టంలో ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని సహకార శాఖ అధికారి పేర్కొన్నారు. మొత్తం మీద పాండురంగారావును చైర్మన్ పదవి నుంచి తప్పించడానికి పిల్లల మర్రి శ్రీనివాస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం, న్యాయపరమైన అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ట్రిబ్యునల్ ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఏవిధమైన తుది తీర్పు ఇస్తుందో వేచిచూడాలి.