యూనివర్సిటీల చట్టంలో మార్పులు! | Papi reddy on Educational law | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీల చట్టంలో మార్పులు!

Published Sat, Jul 28 2018 2:38 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM

Papi reddy on Educational law - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కామన్‌ యూనివర్సిటీ విధానం తీసుకొచ్చేందుకు ప్రస్తుతమున్న యూనివర్సిటీల చట్టాన్ని మార్చేందుకు త్వరలో ఉన్నత స్థాయి కమిటీ వేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ.. 1982లో చేసిన విద్యాచట్టం మేరకు రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల చట్టాలను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. సంప్రదాయ యూనివర్సిటీ, సాంకేతిక విద్య యూనివర్సిటీలు, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ యూనివర్సిటీలు, హెల్త్‌ యూనివర్సిటీ వంటి వాటికి ప్రస్తుతం ఒక్కోదానికి ఒక్కో చట్టం ఉందన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే తరహా యూనివర్సిటీలకు ఒకే చట్టం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి, సిఫారసులు చేసేందుకు నాలుగైదు రోజుల్లో చట్టం చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆయా చట్టాల్లోనూ పలు మార్పులు అవసరమని చెప్పారు. తెలుగు యూనివర్సిటీ పరిధిలోని కొన్ని కోర్సులను జేఎన్‌ఏఎఫ్‌ఏయూ పరిధిలోకి తేవడం, ఆర్‌జీయూకేటీకి చాన్స్‌లర్‌గా గవర్నర్‌ ఉండాలా.. మరెవరైనా ఉండాలా.. అన్న అంశాల్లో స్పష్టతతో చట్టాన్ని రూపొందించాల్సి ఉందని తెలిపారు.

మరోవైపు కేంద్రం ఆదేశాల మేరకు ప్రతి యూనివర్సిటీ పరిధిలో 200కు మించి అనుబంధ కాలేజీలు ఉండటానికి వీల్లేదని పేర్కొన్నారు. కొన్ని ప్రముఖ విద్యాలయాలను యూనివర్సిటీలుగా మార్చే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించి, సిఫారసులు చేస్తుందని వివరించారు. కమిటీ నివేదికను నెలరోజుల్లోగా అందజేసేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

స్టడీ సెంటర్లపై కాలేజీలకు లేఖలు
రాష్ట్రంలో ఇతర రాష్ట్ర యూనివర్సిటీల స్టడీ సెంటర్లను నిర్వహించడానికి వీల్లేదని, అలాంటి వాటిపై చర్యలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నట్లు పాపిరెడ్డి తెలిపారు. వాటికి లేఖలు రాయనున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement