దయలేని అమ్మలు | parents have no mercy on children | Sakshi
Sakshi News home page

దయలేని అమ్మలు

Published Wed, Oct 1 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

parents have no mercy on children

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
 అమ్మా నన్ను అమ్మకే.. ఓ యమ్మా...
 నాన్నా నీకు దండ మే...
 నవ మాసాలు నన్ను మోశావమ్మా..
 పురిటి నొప్పుల బాధ పడ్డావమ్మా..
 పేగు తెంచుక నన్ను గన్నావమ్మా..
 పేరు పెట్టకుండ వేరు చేయకమ్మా..
 నిన్ను విడిచి ఉండలేనమ్మా...ఓయమ్మా..!

 నన్ను దూరంజేయబోకమ్మా... అని మెతుకుసీమలో బతుకమ్మ ఆడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
 ప్రకృతిని.. ఆడపిల్లలను ప్రేమించడమే బతుకమ్మ... పర్యావరణాన్ని రక్షించుకోవడం.. అమ్మను, ఆడబిడ్డను బతికించుకోవడమే ‘బతుకమ్మ’కు అర్థం. పరమార్థం. తెలంగాణ సాకారమై బంగారు బతుకమ్మ నిండు పండగ శోభ సంతరించుకున్న వేళ ఇంకా ముళ్ల పొదల్లో పుత్తడి బొమ్మల మృత్యు కేకలు వినిపిస్తున్నాయి.

ఆడపిల్ల పుడితే తప్పు, నట్టిట్లో నడిస్తే ముప్పు.. పెరిగితే అప్పు అనే ధోరణి పల్లెను ఇంకా వదల్లేదు. మెతుకు సీమలో పేదరికం రక్తబంధాన్ని కూడా హేళన చేస్తోంది. అమ్మ వెచ్చని పొత్తిళ్లలో  నిద్రపోవాల్సిన పసికందులు ముళ్ల పొదల్లో.. మురికి కాల్వల్లో పడి కన్ను మూస్తున్నారు. జిల్లాలో నెల రోజులుగా వరుసగా ఆడ శిశువును విసిరేసిన సంఘటనలు అందరినీ కలచివేస్తున్నాయి. కేవలం నెల రోజుల్లోనే 10 మంది శిశువులను అమ్మలు నిర్దయగా వదిలేసుకున్నారు.

గత చేదు సంఘటనలు మరవకముందే బుధవారం గజ్వేల్ ఏరియా ఆస్పత్రిలో మరో సంఘటన చోటుచేసుకుంది. 15 రోజుల ఆడ శిశువులను గజ్వేల్ ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వార్డులో ఎవ్వరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. పాప గుక్కపెట్టి ఏడుస్తుండటంతో ఆస్పత్రి సిబ్బంది గుర్తించి విషయాన్ని పోలీసులు, శిశు సంక్షేమశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఐసీడీఎస్ అధికారి విమల జిల్లా కేంద్రంలోని శిశుగృహ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో శిశు గృహ అధికారులు ఏరియా ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని సురక్షితంగా సంగారెడ్డిలోని శిశు గృహానికి చేర్చారు.

 ఇలాంటి సంఘటనే మంగళవారం జిన్నారం మండలం వావిలాల గ్రామంలోనూ చోటుచేసుకుంది. వావిలాల గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు బతుకమ్మ తయారు చేసేందుకు తంగేడు పూల కోసం అటవీప్రాంతంలోకి వె ళ్లగా అక్కడ పొదల మధ్య పసికందు కనిపించటంతో మాన్పడిపోయారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నెలరోజుల ఆడ శిశువును పొదలమాటున వదిలేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో ఇద్దరు మహిళలు విషయాన్ని గ్రామపెద్దలకు తెలిపారు. చివరకు శిశు సంక్షేమశాఖ అధికారులు ఆడశిశువును సంగారెడ్డిలోని శిశు గృహానికి చేర్చారు.

గత నెల 9వ తేదీన మెదక్-చేగుంట రహదారిపై కొర్విపల్లి శివారులో అప్పుడే పుట్టిన మగశిశువును సైతం న్యూస్‌పేపర్లో చుట్టి మొక్కజొన్న చేనులో వదిలేయగా,  స్థానికుల చొరవతో అధికారులు శిశువును సంగారెడ్డిలోని శిశు గృహానికి తరలించారు. ఇక ఐదు నెలల క్రితం వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామంలోని విఠలేశ్వర ఆలయంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి పోయారు. ఇలా జిల్లాలో ఆడ శిశువులను అటవీ ప్రాంతాల్లో, నిర్జన ప్రదేశాల్లో, ఆస్పత్రుల్లో వదిలేసి వెళ్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అభం శుభం ఎరుగని, లోకం పోకడ తెలియని పసికందులను వదిలించుకుంటూ మాతృత్వానికి మాయని మచ్చలను మిగులుస్తున్నారు.

 ఏదిఏమైనా ఆడ శిశువులను వదిలేసి వెళ్లటం సమాజానికి పట్టిన రోగమని సామాజిక కార్యకర్త యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆడ కూతుళ్లను విక్రయించటం, పొత్తిళ్లలోని ఆడశిశువులను వదిలి వేయటం సమాజంపై దుష్ర్ఫభావం చూపుతుందన్నారు. ఆడ శిశులను వదిలివేసే నీచ సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement