ఒక వ్యక్తి హజ్రత్ జునైద్ బొగ్దాదీ(ర)వద్దకువచ్చి: ‘‘అయ్యా.. నేనొక నిరుపేదను. పేదరికం కారణంగా ఎవరికీ ఏమీ సాయం చేయలేక పోతున్నాను. దీనికి కారణం ఏమిటీ?’ అని ప్రశ్నించాడు. దానికి జునైద్ బొగ్దాదీ, ‘‘నువ్వు దానధర్మాలు చేస్తావా? ఇతరుల పట్ల ఉదారబుద్ధితో వ్యవహరిస్తావా?’’ అని ఎదురు ప్రశ్నించారు. దానికతను చిన్నబుచ్చుకుని‘‘అయ్యా.. నేనే నిరుపేదను. ఆ కారణంగానే ఏమీ చేయలేక పోతున్నానన్నదే నా బాధ. దానధర్మాలు చేయడానికి, ఉదారంగా వ్యవహరించడానికి నా దగ్గరేముందని?’’ అన్నాడా వ్యక్తి.‘‘అదేమిటీ అలా అంటావు? నీ దగ్గర గొప్ప సంపద ఉంది.
పరులతో పంచుకోగల నిధులున్నాయి నీ దగ్గర’ అన్నారు బొగ్దాదీ. ఆ వ్యక్తి ‘‘అయ్యా.. నేను చాలా చిన్నవాణ్ణి. నన్ను ఆట పట్టించకండి.’’ అన్నాడు.‘‘అయ్యయ్యో..! ఆట పట్టించడం కాదు. ఇది నిజం. నేను చెబుతా విను.’’ అంటూ..‘‘నీ దగ్గర ఉన్న గొప్ప సంపద నీ ముఖారవిందం. ఎంత పేదరికమైనా, ఎన్ని కష్టాలొచ్చినా ముఖంపై చిరునవ్వును చెదరనీయకు. ఇతరులను చిరునవ్వుతో పలకరించడం ఆరాధనతో సమానం అన్నారు మన ప్రవక్త. దీనికోసం ధనం అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది.రెండవది కళ్ళు.
ఇవి లక్షలాదిమందిని ప్రభావితం చేస్తాయి.ఆ కళ్ళతో ఒక్కసారి అమ్మ వైపు ప్రేమతో చూస్తే ఒక హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది.’మూడవది నోరు. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది. ధనం లేకపోయినా పరవాలేదు. నోరు బాగుంటే చాలు. అంతేకాదు, నోటితో ఇతరులకు మంచిని బోధించవచ్చు. మంచిని చర్చించవచ్చు. దాన్ని విలువైనదిగా భావించు. ఆనందం, సానుకూలత వ్యాప్తి చెందుతాయి.నీ దగ్గరున్న మరో నిధి నీ మనసు. మంచి ఆలోచనలతో ఉదయాన్ని ప్రారంభిస్తే, ప్రశాంతత నీ సొంతమవుతుంది. మానసిక ప్రశాంతత ప్రాప్తమైతే నీ అంత ధనవంతుడు మరెవరూ ఉండరు.
తద్వారా ఇతరుల ఆనందంలో, కష్టసుఖాల్లో పాలుపంచుకోవచ్చు. వారి జీవితాలను తాకొచ్చు.మరో గొప్ప సంపద నీ శరీరం. దాంతో ఇతరులకు అనేక మంచిపనులు చేయవచ్చు. అవసరమైన వారికి సహాయం అందించవచ్చు. సహాయం చెయ్యడానికి డబ్బులే అవసరం లేదు. మంచి మనసుంటే చాలు. ఇప్పుడు చెప్పు నువ్వు పేదవాడివా?’’ అన్నారు జునైద్ బొగ్దాదీ రహ్మతుల్లా అలై.ఈ మాటలు విన్న ఆ వ్యక్తి పరమానందభరితుడై, ఆత్మ సంతోషంతో, ఆత్మవిశ్వాసంతో పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ ముందుకు సాగిపొయ్యాడు.
– తస్లీమ్
Comments
Please login to add a commentAdd a comment