వేధింపులు భరించలేక.. ఎదురు దాడి చేయడంతో మృతి
జహీరాబాద్ టౌన్: తాగుడుకు బానిసై తరచూ వేధిస్తున్న కొడుకును కడతేర్చారు తల్లిదండ్రులు. తమపై దాడి చేయడానికి వచ్చిన కొడుకుపై ఎదురు దాడి చేయడంతో అతను ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం దిడ్గి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. జహీరాబాద్ రూరల్ ఎస్‌ఐ, శ్రీకాంత్ కథనం ప్రకారం.. దిడ్గి గ్రామానికి చెందిన రాజప్ప, రాచమ్మల కుమారుడు జోగు మల్లేశం(28) తాగుడుకు బానిసయ్యాడు. తరచూ తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. మల్లేశంకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు కూతురు ఉండగా రెండో పెళ్లిచేసుకున్నాడు. మొదటి భార్య కూతురుతో కలిసి అత్తామామల వద్దే ఉంటుంది.
మల్లేశం తన రెండో భార్య లక్ష్మితో కలిసి మునిపల్లి మండలం బుధేరాలో నివాసముంటున్నాడు. మొదటి భార్య కూతురుకు సంబంధించిన వేడుకను శుక్రవారం దిడ్గి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యానికి మల్లేశం వచ్చాడు. రాత్రి మద్యం తాగి తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకుని తండ్రిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఫంక్షన్‌కు వచ్చిన బంధువులు ఆయన్ను పట్టుకున్నారు. ఈ క్రమంలో కొడుకు చేతిలో ఉన్న గొడ్డలిని లాగేసుకున్న తండ్రి రాజప్ప దానితోనే మల్లేశం తలపై బాదాడు. తలకు గాయమై స్పృహతప్పి పడిపోయాడు. ఆగ్రహంతో ఉన్న తల్లి కూడా మల్లేశాన్ని కొట్టింది. దీంతో మల్లేశం అక్కడికక్కడే మృతిచెందాడు. మల్లేశం రెండో భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు తల్లిదండ్రులతోపాటు బంధువులు నవీన్, సుధాకర్‌తోపాటు మరో నలుగురిపై కేసునమోదు చేశామని ఎస్‌ఐ శ్రీకాంత్ వివరించారు.
కొడుకును కడతేర్చిన తల్లిదండ్రులు
Published Sun, May 29 2016 3:58 AM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM
Advertisement
Advertisement