పసివాడిని పోషించలేం
కొనుక్కోండి లేదా పెంచుకొమ్మని వేడుకున్న దంపతులు
ఆత్మకూర్: పదినెలల పసివాడిని పోషించే పరిస్థితి లేదని, ఎవరైనా కొనుక్కున్నా.. లేదా పెంచుకుంటే ఇస్తామని దంపతులు వేడుకుంటుండగా.. పోలీ సులు అడ్డుకున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులోని ఎస్సీ కాలనీకి చెందిన మీసాల కురుమన్న, లచ్చమ్మల కుమార్తె నాగేంద్రమ్మకు, జూరాలకు చెందిన బాల్‌రాజ్‌తో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండేళ్లకు బాబు పుట్టాడు. పది నెలల క్రితం మరో బాబుకు నాగేంద్రమ్మ జన్మనిచ్చి, నెలరోజులు తిరగకముందే మరణించింది.
ఆ పసిబాలుడిని పెంచుకునేందుకు తండ్రి నిరాకరించడంతో అమ్మమ్మ, తాతయ్యలే సంరక్షిస్తున్నారు. కుటుంబ పోషణ భారం కావడంతో అమ్మమ్మ లచ్చమ్మ ఆ బాలుడ్ని అమ్మేస్తానని, లేకపోతే పెంచుకుంటామంటే ఇస్తానని గురువారం ఆత్మకూరులోని ప్రతి దుకాణం తిరిగి వేడుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ సీహెచ్ రాజు బృందం చేరుకుని బాలుడితోపాటు అమ్మమ్మ, తాతయ్యలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించారు. బాలుడిని మహబూబ్‌నగర్‌లోని శిశువిహార్ కేంద్రానికి తీసుకెళ్లి అప్పగించనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.