రోడ్డుపైనే తమ సామ్రగ్రిని పెట్టుకున్న ఇక్బాల్ అలీ కుటుంబం రోడ్డుపైనే తమ చిన్నారికి భోజనం పెడుతున్న ఇక్బాల్ అలీ భార్య
మైలార్‌దేవ్‌పల్లి: కుటుంబ సభ్యులు కాదు పొమ్మన్నారు.. తలదాచుకోవడానికి కాసింత స్థలం ఇమ్మంటే బయటకు గెంటేశారు.. వారసత్వంగా వచ్చే ఇల్లు లేదన్నారు. దీంతో అందరూ ఉన్నా ఆ కుటుంబం అనాథగా మిగిలింది. చేసేది లేక చలికి వణుకుతూ రోడ్డుపైనే జీవనం సాగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్ సర్కిల్ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఉస్మాన్ అలీ, ఖరీమ్‌బీ దంపతులకు ఏడుగురు సంతానం. వీరి కుమారుడిలో ఒకరైన సయ్యద్ ఇక్బాల్ అలీ(52) కుక్‌గా పని చేస్తూ ఆర్డర్లు వచ్చిన చోటుకు వెళ్తూ భార్య పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. ఇక్బాల్ అలీకి పదేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా తండ్రి ఉస్మాన్ అలీకి అంబేడ్కర్‌నగర్‌లో 180 గజాల స్థలంలో ఇల్లు ఉంది.
గత కొన్నేళ్లుగా ఇంటికి దూరంగా ఉన్న ఇక్బాల్ అలీ గత సంవత్సరం తన సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు రాజేంద్రనగర్ అంబేడ్కర్ నగర్‌కు వచ్చి పక్కనే ఉన్న ఇంట్లో అద్దెకు దిగాడు. ఇక్బాల్ అద్దెకుంటున్న ఇంటి యజమానులు ఆ ఇంటిని కూల్చి నూతన ఇల్లు నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. దీంతో ఇక్బాల్ అలీ తండ్రి సంపాదించిన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంట్లో నీకు ప్రవేశం లేదంటూ కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో ఇంటి ఎదుట ఉన్న స్థలంలో భార్యాపిల్లలతో నివసిస్తున్నాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పినప్పటికీ అతడికి ఇంట్లోకి ప్రవేశం లేదంటూ గొడవపడుతున్నారు. తన తండ్రి వారసత్వంగా వచ్చిన స్థలంలో 45 గజాలు తనకు వస్తుందని సంబంధిత అధికారులు తన విషయంలో జోక్యం కలిగించుకొని ఇంట్లోకి ప్రవేశం కల్పించాలని ఇక్బాల్ అలీ గోడును వెల్లబోసుకున్నాడు. సొంత ఇల్లు ఉన్నా తనకు ప్రవేశం లేదని, రోడ్డు పక్కన కుటుంబంతో జీవనం సాగిస్తున్నానని, జీహెచ్‌ఎంసీ వారు అందించే దుప్పట్లతో రాత్రి వేళలో నిద్రిస్తున్నానని ఇక్బాల్ కుటుంబం కన్నీరు పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment