మా కుమారుడిని కాపాడండి
సౌదీలో అక్రమ కేసులో చిక్కుకున్న అనిల్ తల్లిదండ్రుల వేడుకోలు
హైదరాబాద్: సౌదీలో అక్రమ కేసులో చిక్కుకున్న తమ కుమారుడు అనిల్‌ను కాపాడాలని, స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల రాజన్న జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన కరికె లచ్చవ్వ, రాజయ్య విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... సౌదీలో కపిల్ అనే వ్యక్తి చేసిన తప్పును తమ కొడుకుపై రుద్ది జైలుపాలు చేశారన్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా సమాచారం అందించామని, దానికి ఆయన స్పందించి అక్కడి రాయబార కార్యాలయంలో మాట్లాడి రప్పించే ప్రక్రియ వేగవంతం చేశారని తెలిపారు.
కాని, అనిల్‌కు ఈ నెల ఆఖరు వరకు వీసా గడువు ముగుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమను పోషించేందుకు కొడుకు సౌదీ వెళ్లి అక్కడ కేసులో ఇరుక్కుపోవడంతో మరింత కుంగిపోతున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ కుమారుడిని వెంటనే స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని వేడుకున్నారు.