abudhabi
-
ఖరీదైన రెస్టారెంట్.. బిల్లుచూసి కళ్లు తేలేసిన నెటిజన్లు.. ఏకంగా రూ.1.3 కోట్లు!
టర్కీకి చెందిన ప్రముఖ చెఫ్ నుస్రెత్ గోక్సె.. 'సాల్ట్ బే'గా చాలామందికి సుపరిచితమే. రెస్టారెంట్లో ఆహార పదార్థాలపై మోచేతి పైనుంచి ఉప్పుచల్లే ఈయన తీరుతో బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు పలు దేశాల్లో రెస్టారెంట్లు కూడా నిర్వహిస్తున్నారు. వీటిలో ధర కాస్త ఎక్కువే. గతేడాది లండన్‌లో ఈయన రెస్టారెంట్‌లోని ధరలు చూసి అందరూ అవాక్కయ్యారు. మరీ ఇంత ఎక్కువా అని వాపోయారు. ఇప్పుడు అబుధాబిలోని సాల్ట్ బేకు చెందిన నుస్రే-ఈటీ రెస్టారెంట్లో ఓ బిల్లు చూసి నెటిజన్లు కంగుతిన్నారు. ఈ బిల్లు మొత్తం 6,15,065 దిర్హాంలు. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. అక్షరాలా రూ. కోటి 30 లక్షలు. మొత్తం 10 మంది కలిసి అబుధాబిలోని సాల్ట్ బే రెస్టారెంట్‌కు వెళ్లారు. ఎక్కువగా ఆల్కహాలే ఆర్డర్ చేశారు. అందులో చాలా ఫేమస్ అయిన పిట్రస్ వైన్ కూడా ఉంది. 2009 నాటి ఈ వైన్‌కే దాదాపు రూ.కోటి రూపాయల బిల్లు అయింది. ఇతర ఫుడ్, వ్యాట్‌తో కలిపి మొత్తం రూ.1.3 కోట్ల బిల్లు అయింది. ఈ బిల్లు రషీదును స్వయంగా తన ఇన్స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశాడు సాల్ట్ బే. 'నాణ్యత ఎప్పుడూ ఖరీదైనది కాదు'ని రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. మరీ ఆ రేంజ్లో ధరలు ఏంటని సాల్ట్బేను కొందరు ఏకిపారేశారు. కొంతమందైతే అతడ్ని అన్‌ఫాలో కూడా చేశారు. ఎందుకంత ధర..? అయితే ఈ బిల్లులో ఫ్రెంచ్ ఫ్రైస్ ధర 45 డాలర్లు(రూ.3,600)గా ఉంది. దీంతో ఓ నెటిజన్.. బంగాళాదుంపలు ఏమైనా చంద్రుడిపై కాస్తున్నాయా? ఎందుకంత ధర అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. హైన్కీన్ బీరు ధర కూడా 55 డాలర్లుగా ఉంది. ఇది ఒక్క బీరు ధరా? లేక 12 బీర్ల ప్యాక్కా? అని ఓ యూజర్ సెటైర్లు వేశాడు. మరో నెటిజన్ అయితే.. సాల్ట్ బేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నవ్వు పేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి స్వతహాగా ఈ స్థాయికి చేరుకున్నావు. నిన్ను చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. కానీ నీ రెస్టారెంట్లో ధరలు ఇంత ఎక్కువగా ఎందుకున్నాయి. కేవలం సంపన్నుల కోసమేనా. నువ్వు చెఫ్ కాదు చీప్ అంటూ ఫైర్ అయ్యాడు. మరోవైపు సాల్ట్ బే మాత్రం ఈ బిల్లుపై వస్తున్న విమర్శలు అసలు పట్టించుకోలేదు. తన స్టయిల్లోనే ముందుకు సాగుతున్నాడు. ఓ స్టీక్కు(కాల్చిన మాంసం ముద్ద) గోల్డ్ కోట్ చేసి ఉన్న ఫోటో షేర్ చేశాడు. ఫెడరల్ బ్యాంక్ 24 క్యారట్ల బంగారంతో ఈ స్టీక్కు కోటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్లు మరోసారి షాక్ అయ్యారు. చదవండి: కిక్కిరిసిన అభిమానులు.. భయానక పరిస్థితి.. కొంచెం అటు ఇటు అయినా.. -
ఇదేం రూల్ సామీ.. బాల్కనీలో బట్టలు ఆరబెడితే రూ.20 వేలు ఫైన్!
మన ఇంటి బాల్కనీలో లేదా టెర్రస్‌పైన ఉతికిన దుస్తులను ఆరబెట్టడం సహజమే. అయితే ఓ ప్రాంతంలో మాత్రం అలా బాల్కనీలో బట్టలు ఆరబెడితే ఫైన్ కట్టాల్సివస్తుంది. ఎక్కడనుకుంటున్నారా.. ఈ వింత రూల్ యూఏఈలోనిది. అయితే ఇలాంటి నిబంధన తీసుకురావడానికి కారణం ఉందని ఆ ప్రాంత అధికారులు చెప్తున్నారు. అసలు ఆ కథేంటని తెలుసుకుందాం! వివరాల్లోకి వెళితే.. అబుదాబిలోని మున్సిపాలిటీ అధికారులు అపార్ట్మెంట్ల బాల్కనీలు, కిటికీలపై బట్టలు ఆరబెట్టవద్దని ఆ ప్రాంత నివాసితులకు హెచ్చరికలు జారీ చేశారు. ఒక వేళ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1,000 దిర్హామ్‌లు (భారత కరెన్సీ ప్రకారం రూ. 20,000) లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధించే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఓ కారణం ఉందని అంటున్నారు అక్కడి మున్సిపల్ అధికారులు. బాల్కనీలో దుస్తులు ఆరేయడం వల్ల నగర అందం దెబ్బతింటుందని, అందుకే బాల్కనీలో, కిటికీలకు బట్టలు వేలాడదీయవద్దని హెచ్చరించారు. ప్రస్తుతం దీనికి ప్రత్యామ్నాయంగా లాండ్రీ డ్రైయింగ్ గానీ, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ వాడడం లేదా ఇతర మార్గాల ద్వారా బట్టలు ఇంట్లోనే ఆరబెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చదవండి: ‘ఇది కరెక్ట్ కాదు.. రష్యా వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తోంది’ -
ఇదెక్కడి గోస నాయనా! అబుదాబిలో చిక్కుకుపోయిన భారతీయులు
దేశం కాని దేశంలో ప్రయాణం మధ్యలో చిక్కుకుని భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు. లగేజీ లేక ఫోన్లు కలవక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఊహకందని విధంగా మార్గమధ్యలో వచ్చిన కరోనానే అందుకు కారణం. టొరంటో వెళ్తూ హైదరాబాద్‌కి చెందిన సయ్యద్ ఓమర్ అజామ్ అనే వ్యక్తి ఇండియా నుంచి కెనడాలోని టోరంటో నగరానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో అబుదాబి ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోగానే అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు అక్కడున్న గేట్ నంబర్ 28 దగ్గరే అతన్ని గంటల తరబడి ఉంచారు. దీంతో సాయం చేయాలంటూ ట్విట్టర్ వేదికగా అతను కోరాడు. చాలా సేపటి తర్వాత వచ్చిన ఎయిర్పోర్ట్ అధికారులు అతన్ని ఐసోలేషన్‌లో భాగంగా ఆల్ రజీమ్ క్వారంటైన్ ఫెసిలిటీకి తీసుకెళ్లారు. లగేజీ ఇతర ముఖ్యమైన వస్తువులు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయాయి. అక్కడి అధికారులు ఎవరితో పెద్దగా కలవనివ్వడం లేదంటూ మరో ట్వీట్ చేశారు అజామ్ I’m traveling from Hyderabad, India to Toronto, Canada via Abu Dhabi (20-Jan-2022). We are struck at Abu Dhabi airport since 18+ hours as some of the passengers including myself were tested positive for COVID19 (did multiple Rapid RT PCR test at airport facility). pic.twitter.com/Gwzx2DOS5h — Syed Omar Azam (@SyedOmarAzam1) January 20, 2022 మరింత మంది అజామ్ ట్వీట్‌కి క్వారంటైన్ సెంటర్లో ఉన్న మరో భారతీయుడు కూడా స్పందించాడు. మనిద్దరమే కాదు అనేక మంది ఈ క్వారంటైన్ సెంటర్లో ఉన్నారని.. ఇక్కడ సౌకర్యాలు బాగాలేవంటూ తెలిపాడు. చివరకు ఆల్ రజీమ్ క్వారంటైన్ సెంటర్లో ఉన్న తమకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లేదా స్వదేశానికి వచ్చే విధంగా సాయం చేయాలంటూ వారు విదేశాంగ మంత్రి జయ్శంకర్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా సాయం కోరారు. Dear sir i am also in al razeen camp that because you tested positive i know it is very hard to live here i am also living here with 5 people and there are lot of indians here. So dont loose hope and stay strong. Tell your room number and building number. — Voice of hyderabad (@Voiceofhyderab5) January 21, 2022 సాయం చేయండి ఇండియా నుంచి యూరప్, అమెరికాకు వెళ్లే అనేక మంది దుబాయ్, అబుదాబిలో కనెక్టింగ్ ప్లైట్ల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటారు. విమానం ఎక్కే ముందే కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ చూపించే విమాన ప్రయాణాలు చేస్తున్నారు. కానీ మార్గమధ్యంలో చేసే పరీక్షల్లో పాజిటివ్‌గా తేలుతున్నారు. దీంతో అజామ్ తరహాలో అనేక మంది దుబాయ్, అబుదాబిలలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. భారత విదేశాంగ శాఖ ఇలాంటి వారికి అవసరమైన సాయం అందించే విషయంలో ముందుకు రావాలని కోరుతున్నారు. చదవండి: ఎన్నారైలకు ఓటు హక్కు.. పంజాబ్ ఎన్నికల వేళ తెరపైకి కొత్త నినాదం -
అబుదాబి గ్రాండ్‌ప్రి... వెర్‌స్టాపెన్‌దే పోల్ పొజిషన్
ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్ ఎవరిదో తేల్చే అబుదాబి గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్ చివరి రౌండ్లో వెర్స్టాపెన్ ల్యాప్‌ను అందరికంటే వేగంగా ఒక నిమిషం 22.109 సెకన్లలో పూర్తి చేసి పోల్పొజిషన్ను అందుకున్నాడు. చాంపియన్‌షిప్ కోసం పోటీ పడుతున్న హామిల్టన్ (మెర్సిడెస్) క్వాలిఫయింగ్ సెషన్లో రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ ప్రస్తుతం 369.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. నేటి రేసులో ఈ ఇద్దరిలో ఎక్కువ పాయింట్లు నెగ్గిన వారికి టైటిల్ లభిస్తుంది. నేటి సాయంత్రం గం. 6:30 నుంచి జరిగే ప్రధాన రేసును స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2, హాట్స్టార్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. -
అబుదాబిలో ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అబుదాబిలో ప్రవాస భారతీయులకు కేంద్ర బిందువైన ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో, కళా ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వేడుకలను జరుపుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చిందని సంస్థ ప్రధాన కార్యదర్శి జోజో అంబూకెన్ తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మెహ్రా అల్ మెహ్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు జార్తి వరీస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జార్తీ వరీస్ మాట్లాడుతూ.. ఎందరో త్యాగ మూర్తుల బలి దానాల ఫలితమే ఈ రోజు మనమందరము అనుభవిస్తున్న స్వేచ్చ వాయువులని, భావి భారత నిర్మాణం లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతయినా ఉందని తెలియ జేశారు. 75 వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా కోవిడ్ సమయం లో సంస్థ సభ్యులు బీరన్, యూనిస్ వారు చూపిన సమాజ స్పూర్తి కి గౌరవ పురస్కారాన్ని అందజేశామని సంస్థ సంక్షేమ కార్య దర్శి రాజా శ్రీనివాసరావు వెల్లడించారు. భారత ప్రభుత్వ పిలుపు మేరకు సాయంత్రం జరిగిన ఆజాది కి అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశం లోని వివిధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ గాన, నాట్య కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల వారి కళలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చిన్నారుల ప్రదర్శన చూపరులను ఎంతగానో ఆకర్షించింది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ గాన నాట్య కళా ప్రదర్శన జరిగింది. సాయంత్రం జరిగిన కార్యక్రమానికి లూలూ గ్రూపుల సంస్థ చైర్మన్ , ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ చైర్మన్ పద్మశ్రీ డా యూసుఫ్ అలీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో సంస్థ క్రీడా కార్యదర్శి ఫ్రెడీ, ఉప ప్రధాన కార్య దర్శి జార్స్ వర్గీస్, ఉప కోశాధికారి దినేష్, జనరల్ మేనేజర్ రాజు తదితర ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. -
ఆండ్రీ రసెల్ అవుట్..
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో బుధవారం ఆసక్తికర పోరు జరగనుంది. 39వ లీగ్ మ్యాచ్‌లో భాగంగా అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అంచె లీగ్ మ్యాచ్‌లో 82 పరుగులతో ఆర్సీబీ కేకేఆర్‌పై భారీ విజయం సాధించింది. లీగ్ ఆరంభంలో తడబడిన ఆర్సీబీ ఆ తర్వాత విజయాలతో ఫుంజుకుంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. సరిగ్గా అన్నే మ్యాచ్‌లాడిన కేకేఆర్ మాత్రం 5 విజయాలు, 4 ఓటములతో నాలుగో స్థానంలో ఉంది. ఇక లీగ్ ప్రారంభం నుంచి పడుతూ లేస్తూ వస్తున్న కేకేఆర్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ జట్టు విషయానికి వస్తే.. కెప్టెన్ కోహ్లి అంతా తానై నడిపిస్తుండగా... ఏబీ డివిలియర్స్ తన విధ్వంసం కొనసాగిస్తున్నాడు. దేవ్‌దూత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్‌లు కూడా బ్యాట్‌తో రాణిస్తుండడంతో బ్యాటింగ్ విభాగం దుర్బేద్యంగా ఉంది. ఇక కెప్టెన్ కోహ్లి ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 347 పరుగులు చేసి జట్టు తరపున టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. మిస్టర్ 360గా పేరు పొందిన ఏబీ 9మ్యాచ్‌ల్లో 285 పరుగులు చేసి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 55 పరుగులు చేసిన ఏబీ తన విధ్వంసంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక బౌలింగ్‌లో క్రిస్ మోరిస్ తన బౌలింగ్‌తో మోత మోగిస్తుండగా.. చహల్ కీలకంగా మారాడు. చహల్ 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీయగా.. మోరిస్ 4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లతో ఆకట్టుకున్నాడు. కేకేఆర్ జట్టు విషయానికి వస్తే.. ఓపెనర్ శుభమన్ గిల్ 9 మ్యాచ్‌ల్లో 311 రన్స్‌తో జట్టు తరపున టాప్ స్కోరర్‌గా కొనసాగుతుండగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 248 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి 8 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీయగా.. శివమ్ మావి 7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. ఇరు జట్లు ఇప్పటివరకు 25 మ్యాచ్‌ల్లో ముఖాముఖి పోరులో తలపడగా.. కేకేఆర్ 14 విజయాలు.. ఆర్సీబీ 11 విజయాలు సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ షహ్బాజ్ అహ్మద్ స్థానంలో సిరాజ్‌కు అవకాశం ఇవ్వగా.. కేకేఆర్ ఆండ్రీ రసెల్ స్థానంలో టామ్ బాంటన్, శివమ్ మావి స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను బరిలోకి దించింది. ఆర్సీబీ జట్టు : విరాట్ కోహ్లి(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, అరోన్ ఫించ్, దేవదూత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, గుర్కీరత్ మన్, మహ్మద్ సిరాజ్, క్రిస్ మోరిస్, ఇసురు ఉదాన, నవదీప్ సైనీ, చహల్ కేకేఆర్ జట్టు : ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్, నితీష్ రాణా, దినేశ్ కార్తీక్, టామ్ బాంటన్ , ప్యాట్ కమిన్స్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, ఫెర్గ్యూసన్, వరుణ్ చక్రవర్తి -
రిలయన్స్ రిటైల్‌లో ఏడీఐఏకి వాటాలు
సాక్షి,న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)పై ఇన్వెస్టర్ల ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. తాజాగా అబు ధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ) అనుబంధ సంస్థ ఆర్ఆర్వీఎల్లో 1.2 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఏడీఐఏ రూ. 5,512.5 కోట్లు వెచ్చిస్తున్నట్లు రిలయన్స్ వెల్లడించింది. దీనితో కేవలం నాలుగు వారాల కన్నా తక్కువ వ్యవధిలోనే ఆర్ఆర్వీఎల్ అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి రూ. 37,710 కోట్లు సమీకరించినట్లయింది. అబు ధాబికే చెందిన సావరీన్ వెల్త్ ఫండ్ సంస్థ ముబాదలా ఇటీవలే రూ. 6,247.5 కోట్లు వెచ్చించి 1.4 శాతం వాటా కొనుగోలు చేసింది. సిల్వర్ లేక్, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, ముబాదలా, జీఐసీ, టీపీజీ వంటి దిగ్గజ సంస్థలు ఆర్ఆర్వీఎల్లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేశాయి. ఇవన్నీ కూడా రిలయన్స్‌కే చెందిన డిజిటల్ వ్యాపార విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. (రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడుల వెల్లువ) ఆర్ఆర్వీఎల్ విలువ సుమారు రూ. 4.29 లక్షల కోట్లుగా ఉంటుంది. ‘ఏడీఐఏ తాజాగా పెట్టుబడులు పెట్టడం, తన తోడ్పాటును కొనసాగిస్తుండటం సంతోషకర విషయం. రిలయన్స్ రిటైల్ పనితీరుకు, అది అమలు చేస్తున్న కొత్త వ్యాపార విధానంలో అపార అవకాశాలకు ఏడీఐఏ పెట్టుబడులు నిదర్శనం‘ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ‘భారత రిటైల్ రంగంలో రిలయన్స్ రిటైల్ అత్యంత వేగంగా అగ్రస్థాయి సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఫిజికల్, డిజిటల్ సరఫరా వ్యవస్థల ఊతంతో మరింత పటిష్టమైన వృద్ధి సాధించగలదు‘ అని ఏడీఐఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రైవేట్ ఈక్విటీల విభాగం) హమద్ షహ్వన్ అల్దహేరి పేర్కొన్నారు. 1976లో ఏర్పాటైన ఏడీఐఏ.. అబు ధాబి ప్రభుత్వం తరఫున అంతర్జాతీయంగా వివిధ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. విస్తృత నెట్వర్క్... ఆర్ఆర్వీఎల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్‌కు దేశవ్యాప్తంగా 12,000 పైచిలుకు స్టోర్స్ ఉన్నాయి. కరోనా వైరస్‌పరమైన పరిణామాల నేపథ్యంలో నిత్యావసరాల వ్యాపారాన్ని మరింతగా విస్తరించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో పోటీపడే దిశగా జియోమార్ట్‌ను కూడా ఆవిష్కరించింది. 2020 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్ఆర్వీఎల్ కన్సాలిడేటెడ్ టర్నోవరు సుమారు రూ. 1,62,936 కోట్లు కాగా, నికర లాభం రూ. 5,448 కోట్లుగా నమోదైంది. -
భార్యను కాపాడుతూ మంటల్లో చిక్కుకున్న భర్త..
దుబాయ్ : తమ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం నుంచి భార్యను కాపాడే క్రమంలో భారత్‌కు చెందిన 32 సంవత్సరాల వ్యక్తి దుబాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దుబాయ్‌లోని ఉమ్‌అల్ క్విన్‌లోని తమ ఫ్లాట్‌లో కేరళకు చెందిన అనిల్ నినన్, నీను దంపతులు నివసిస్తున్నారు. సోమవారం వారి ఫ్లాట్‌లో మంటలు చెలరేగగా భార్య నీనును రక్షించే క్రమంలో అనిల్‌కు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. స్ధానికులు అనిల్ దంపతులను అబుదాబిలోని మఫ్రాక్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పదిశాతం కాలిన గాయాలైన నీను పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండగా, అనిల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేరళ దంపతులకు నాలుగేళ్ల కుమారుడున్నాడు. వారి అపార్ట్మెంట్లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. ప్రమాదం గురించి తమకు పూర్తి వివరాలు తెలియదని, కారిడార్‌లో ఉన్న నీను తొలుత మంటల్లో చిక్కుకోగా, బెడ్రూమ్లో ఉన్న అనిల్ తన భార్యను కాపాడేందుకు పరిగెత్తుకు వచ్చాడని ఈ క్రమంలో మంటలు అతడికి వ్యాపించాయని స్ధానికంగా నివసించే వికార్ చెప్పినట్టు ఖలీజ్‌టైమ్స్ పత్రిక వెల్లడించింది. చదవండి : ఇదీ లక్ అంటే: కోట్లు గెలుచుకున్నాడు! -
అబుదాబిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్న తెలంగాణకు చెందిన వారందరూ ఘనంగా జరుపుకున్నారు. ఈ బతుకమ్మ సంబరాలను అబుదాబి నగరంలోని ఇండియా సోషల్ సెంటర్ ఆడిటోరియంలో దాదాపు పదిహేను వందల మంది తెలుగువారి సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శరణ్య ముఖ్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డప్పు వాయిద్యాలతో అబుదాబి తెలుగింటి ఆడబిడ్డలు బతుకమ్మ సంబరాల ప్రాంగణానికి చేరుకోగా, ప్రార్ధన గీతంతో కార్యక్రమం మొదలుపెట్టారు. తర్వాత చిన్నారులు వారి ఆటపాటలతో అందరినీ అలరించారు. కార్యక్రమానికి వచ్చిన ఆడపడుచులందరూ ఎంతోభక్తిశ్రద్ధలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ అమ్మవారిని తలచుకున్నారు. కాగా, అందమైన బతుకమ్మలకు, సంప్రదాయబద్ధంగా తయారైన పిల్లలకు బాగా బతుకమ్మ ఆడినవారికి కార్యనిర్వాహకులు బహుమతులు ప్రకటించారు. బతుకమ్మకు పూజచేసిన అనంతరం, సంప్రదాయబద్దంగా బతుకమ్మను నిమజ్జనంచేసి, ప్రసాద వితరణ అనంతరం కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కార్యనిర్వాహకులు రాజశ్రీనివాస్, వంశీ, పృథ్వి, సదానంద్, గంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పావని, రోజా, అర్చన, పద్మజ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. -
మా కుమారుడిని కాపాడండి
సౌదీలో అక్రమ కేసులో చిక్కుకున్న అనిల్ తల్లిదండ్రుల వేడుకోలు హైదరాబాద్: సౌదీలో అక్రమ కేసులో చిక్కుకున్న తమ కుమారుడు అనిల్‌ను కాపాడాలని, స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల రాజన్న జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన కరికె లచ్చవ్వ, రాజయ్య విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... సౌదీలో కపిల్ అనే వ్యక్తి చేసిన తప్పును తమ కొడుకుపై రుద్ది జైలుపాలు చేశారన్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా సమాచారం అందించామని, దానికి ఆయన స్పందించి అక్కడి రాయబార కార్యాలయంలో మాట్లాడి రప్పించే ప్రక్రియ వేగవంతం చేశారని తెలిపారు. కాని, అనిల్‌కు ఈ నెల ఆఖరు వరకు వీసా గడువు ముగుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమను పోషించేందుకు కొడుకు సౌదీ వెళ్లి అక్కడ కేసులో ఇరుక్కుపోవడంతో మరింత కుంగిపోతున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ కుమారుడిని వెంటనే స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని వేడుకున్నారు. -
యూఏఈ వెళ్తున్న బరువైన మహిళ
దుబాయ్: ప్రపంచంలో అత్యంత బరువైన మహిళగా గుర్తింపు పొందిన ఈజిప్టుకు చెందిన ఇమాన్ అబ్దుల్ అట్టి అబుదాబిలోని ఆసుపత్రికి మారనుంది. చికిత్స కోసం అట్టిని ప్రత్యేక కార్గో విమానం ద్వారా ముంబైలోని సైఫీ ఆసుపత్రికి వచ్చిన విషయం తెలిసిందే. అట్టికి పలుమార్లు బెరియాట్రిక్ ఆపరేషన్ నిర్వహించిన సైఫీ ఆసుపత్రి వైద్యులు ఆమె బరువును 500 కేజీల నుంచి 176 కిలోలకు తగ్గించారు. అట్టి కుటుంబసభ్యులకు, ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్ మప్ఫాజల్ లక్డావాలాకు మధ్య విభేదాలు తలెత్తడంతో వైద్యం కోసం అట్టి సోదరి సెలీమ్ అబుదాబీలోని బుర్జీల్ ఆసుపత్రిని సంప్రదించారు. అట్టికి వైద్యం చేసేందుకు వారు అంగీకరించడంతో ఈజిప్టు ఎయిర్‌కు చెందిన ప్రత్యేక విమానం ఎయిర్‌బస్ 300లో అట్టిను అబుదాబి తరలించనున్నారు. ఈ సమయంలో ఐసీయూలో వినియోగించే అన్ని రకాల వస్తువులు, మెడిసన్లను విమానంలో అందుబాటులో ఉంచుకుంటామని బుర్జీల్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. కాగా, వైద్య చికిత్స కోసం వస్తున్న అట్టీ, ఆమె సోదరికి యూఏఈ ప్రభుత్వం 90 రోజుల వీసాను మంజూరు చేసింది. -
ఉగ్ర ఫైనాన్షియర్ చిక్కాడు
అబుదాబిలో దొరికిన ఐఎం ఉగ్రవాది ఇంటర్‌పోల్ అదుపులో అబ్దుల్ వహీద్ విధ్వంసానికి డబ్బు పంపింది ఇతడే భారత్‌కు తెచ్చేందుకు యత్నాలు దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో మరో నిందితుడు చిక్కాడు. ఈ విధ్వంసానికి ఆర్థిక సాయం చేసిన వ్యక్తిగా వహీద్‌ను నిఘా వర్గాలు గుర్తించాయి. అతనిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయి ఉండటంతో ఇంటర్‌పోల్ అబుదాబిలో అదుపులోకి తీసుకుంది. భారత్ తీసుకువచ్చేందుకు జాతీయ నిఘా, దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వహీద్ దిల్సుఖ్నగర్ విధ్వంసం కేసులో ఆరో నిందితుడిగా మారనున్నాడు. - సాక్షి, సిటీబ్యూరో పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న డిఫెన్స్ ఏరియాలో తలదాచుకుంటున్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ 2007లో మాదిరిగానే 2013లోనూ హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లోనే నిర్ణయించుకున్నాడు. దీనికోసం యాసీన్ భత్కల్ ద్వారా అదే ఏడాది సెప్టెంబర్‌లో అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ (ఆజామ్ఘడ్), వఖాస్ (పాకిస్థాన్)లను మంగుళూరుకు పంపి అక్కడ డెన్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆదేశించాడు. అక్కడకు వెళ్లిన ఇద్దరూ హంపన్‌కట్ట ప్రాంతంలోని జఫైర్ హైట్స్ అపార్ట్మెంట్ మూడో అంతస్తులోని 301 ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. అక్కడ ఉంటూనే హడ్డీ ఫల్మిన్ సైబర్ పా యింట్, ఏంజిల్ సైబర్ గ్యాలరీ, సైబర్ ఫాస్ట్ అనే పేర్లతో కూడిన సైబర్ కేఫ్‌ల నుంచి రియాజ్ భత్కల్‌కు చెందిన ఈ-మెయిల్ ఐడీ (ఞ్చ్ట్చట్చటజీజజిఃడ్చజిౌౌ.ఛిౌఝ)తో చాటింగ్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. వహీద్ ద్వారా నగదు సరఫరా రియాజ్ భత్కల్ గత ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో ఈసారి హైదరాబాద్‌ను టార్గెట్ చేశామని హడ్డీకి చాటింగ్‌లో చెప్పాడు. వఖాస్, తెహసీన్ అక్తర్ అలియాస్ మోను (బీహార్‌లోని దర్భంగా వాసి)లతో కలిసి ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని నిర్దేశించాడు. అందుకు అవసరమైన పేలుడు పదార్థాలతో నగదు త్వరలోనే అందుతాయంటూ చెప్పాడు. డబ్బును వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్, హవాలా మార్గాల్లో పంపుతానని రియాజ్ భత్కల్ పేర్కొన్నాడు. ఈ నగదు బదిలీ బాధ్యతల్ని రియాజ్... తనకు నమ్మినబంటు అయిన వహీద్ అబ్దుల్ సిద్ధిబపకు అప్పగించాడు. పేలుళ్లకు అవసరమైన నిధు లు సమీకరించిన వహీద్... దుబాయ్ నుంచి మంగుళూరులోని హంపన్‌కట్టలో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సంస్థ ఔట్లెట్ సుపమ ఫోరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మంగుళూరులోని మార్కెట్ రోడ్డులో హవాలా వ్యాపారం నిర్వహించే డిం గ్ డాంగ్ దుకాణం యజమాని ద్వారా డబ్బు పంపాడు. ఈ మొత్తాన్ని హడ్డీ తీసుకున్నాడు. పేరు బయటపెట్టిన యాసీన్ భత్కల్ అనుకున్న ప్రకారం హడ్డీ, మోను, వఖాస్‌లు హైదరాబాద్ చేరుకోవడం, అబ్దుల్లాపూర్‌మెట్‌లో మకాం వేయడం, గత ఏడాది ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ-1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల్లో పేలుళ్లకు పాల్పడటం జరిగిపోయాయి. ఈ కేసులో రియాజ్, యాసీన్, వఖాస్, హడ్డీ, మోనులను నిందితులుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. గత ఏడాది ఆగస్టు 29న కేంద్ర నిఘా వర్గాలు యాసీన్, అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీల్ని నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నాయి. యాసీన్ భత్కల్ విచారణ నేపథ్యంలోనే ఫైనాన్షియర్ వహీద్ పేరు వెలుగులోకి వచ్చింది. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు నగదు దుబాయ్ నుంచి మనీ ట్రాన్సఫర్, హవాలా ద్వారా పంపింది ఇతడే అని వెల్లడించాడు. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు నిఘా వర్గాలు సైతం ఇతడి కోసం వేట ముమ్మరం చేశాయి. ‘పార్ట్‌టైమ్’ ఉగ్రవాదిగా వహీద్ కర్ణాకటలో భత్కల్ ప్రాంతంలోని మగ్దూం కాలనీకి చెందిన వహీద్ కొన్నేళ్ల క్రితమే వ్యాపారం నిమిత్తం దుబాయ్‌లో స్థిరపడ్డాడు. రియాజ్, ఇక్బాల్, యాసీన్‌లకు సమీప బంధువైన ఇతగాడు సౌదీ దేశాల్లో ఉన్న సానుభూతిపరుల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమీకరిస్తుంటాడు. భత్కల్ బ్రదర్స్ ఆదేశాల మేరకు వాటిని భారత్‌కు పంపిస్తుంటాడు. ఏ పేలుడులోనూ నేరుగా పాల్గొనని, ఆయా సమయాల్లో భారత్‌లో కూడా లేని వహీద్ పార్ట్‌టైమ్‌గా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొం టున్నా... దుబాయ్ మాడ్యుల్లో కీలక వ్యక్తిగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 2006 నాటి ముంబై సీరియల్ బ్లాస్ట్, బెంగళూరు స్టేడియం పేలుళ్లతో పాటు 2010 నాటి ఢిల్లీ వరుస పేలుళ్లలోనూ ఇతడి ‘ఆర్థిక పాత్ర’ ఉన్నట్లు తేలడంతో దర్యాప్తు సంస్థలు ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశాయి. యాసీన్, హడ్డీల అరెస్టు తరవాత గాలింపు మరింత ముమ్మరం చేశాయి. గత వారం దుబాయ్ నుంచి వ్యాపార పనులపై అబుదాబి వచ్చిన వహీద్‌ను ఇంటర్‌పోల్ వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థకూ సమాచారం అందించాయి. ‘గుర్తింపు’ చూపితేనే అప్పగింత వహీద్‌ను భారత్‌కు తీసుకురావడానికి నిఘా, దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలు ప్రారంభిం చాయి. దీనికోసం ప్రత్యేక బృందాలు అబుదాబి చేరుకున్నాయి. అయితే తమకు వాంటెడ్‌గా ఉన్న వహీద్, అబుదాబిలో చిక్కిన వహీద్ ఒకరే అంటూ ఇంటర్‌పోల్‌కు కొన్ని ఆధారాలు, గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే నిందితుడిని భారత్‌కు తరలించేందుకు ఆయా సంస్థలు అంగీకరిస్తాయి. దీంతో నిఘా వర్గాలు ‘గుర్తింపుల్ని’ సేకరించే పనిలో పడ్డాయి. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లకు సూత్రధారిగా ఉండటంతో రియాజ్ భత్కల్ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా (ఏ-1)గా చేర్చిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు నేరుగా ప్రమేయం లేని, పేలుడు పదార్థాలు సరఫరా చేసినట్లు, సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యాసీన్‌ను ఐదో నిందితుడు (ఏ-5)గా చేర్చారు. హడ్డీ, వఖాస్, మోనులను ఏ-2, ఏ-3, ఏ-4గా నిర్థారించారు. ఇప్పుడు వహీద్‌ను అబుదాబి నుంచి తీసుకువచ్చి ఈ కేసులో చేరిస్తే ఆరో నిందితుడిగా మారనున్నాడు.