తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్న తెలంగాణకు చెందిన వారందరూ ఘనంగా జరుపుకున్నారు. ఈ బతుకమ్మ సంబరాలను అబుదాబి నగరంలోని ఇండియా సోషల్ సెంటర్ ఆడిటోరియంలో దాదాపు పదిహేను వందల మంది తెలుగువారి సమక్షంలో నిర‍్వహించారు. ఈ కార‍్యక్రమానికి శరణ్య ముఖ్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
డప్పు వాయిద్యాలతో అబుదాబి తెలుగింటి ఆడబిడ్డలు బతుకమ్మ సంబరాల ప్రాంగణానికి చేరుకోగా, ప్రార్ధన గీతంతో కార్యక్రమం మొదలుపెట్టారు. తర్వాత చిన్నారులు వారి ఆటపాటలతో అందరినీ అలరించారు. కార్యక్రమానికి వచ్చిన ఆడపడుచులందరూ ఎంతోభక్తిశ్రద్ధలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ అమ్మవారిని తలచుకున్నారు. కాగా, అందమైన బతుకమ్మలకు, సంప్రదాయబద‍్ధంగా తయారైన పిల్లలకు బాగా బతుకమ్మ ఆడినవారికి కార్యనిర్వాహకులు బహుమతులు ప్రకటించారు.
బతుకమ్మకు పూజచేసిన అనంతరం, సంప్రదాయబద్దంగా బతుకమ్మను నిమజ్జనంచేసి, ప్రసాద వితరణ అనంతరం కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కార్యనిర్వాహకులు రాజశ్రీనివాస్, వంశీ, పృథ్వి, సదానంద్, గంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పావని, రోజా, అర్చన, పద్మజ తదితరులు కృతజ‍్ఞతలు తెలిపారు.