అబుదాబిలో దొరికిన ఐఎం ఉగ్రవాది
ఇంటర్‌పోల్ అదుపులో అబ్దుల్ వహీద్
విధ్వంసానికి డబ్బు పంపింది ఇతడే
భారత్‌కు తెచ్చేందుకు యత్నాలు
దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో మరో నిందితుడు చిక్కాడు. ఈ విధ్వంసానికి ఆర్థిక సాయం చేసిన వ్యక్తిగా వహీద్‌ను నిఘా వర్గాలు గుర్తించాయి. అతనిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయి ఉండటంతో ఇంటర్‌పోల్ అబుదాబిలో అదుపులోకి తీసుకుంది. భారత్ తీసుకువచ్చేందుకు జాతీయ నిఘా, దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వహీద్ దిల్‌సుఖ్‌నగర్ విధ్వంసం కేసులో ఆరో నిందితుడిగా మారనున్నాడు.
- సాక్షి, సిటీబ్యూరో
పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న డిఫెన్స్ ఏరియాలో తలదాచుకుంటున్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ 2007లో మాదిరిగానే 2013లోనూ హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లోనే నిర్ణయించుకున్నాడు. దీనికోసం యాసీన్ భత్కల్ ద్వారా అదే ఏడాది సెప్టెంబర్‌లో అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ (ఆజామ్‌ఘడ్), వఖాస్ (పాకిస్థాన్)లను మంగుళూరుకు పంపి అక్కడ డెన్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆదేశించాడు. అక్కడకు వెళ్లిన ఇద్దరూ హంపన్‌కట్ట ప్రాంతంలోని జఫైర్ హైట్స్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులోని 301 ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. అక్కడ ఉంటూనే హడ్డీ ఫల్మిన్ సైబర్ పా యింట్, ఏంజిల్ సైబర్ గ్యాలరీ, సైబర్ ఫాస్ట్ అనే పేర్లతో కూడిన సైబర్ కేఫ్‌ల నుంచి రియాజ్ భత్కల్‌కు చెందిన ఈ-మెయిల్ ఐడీ (ఞ్చ్ట్చట్చటజీజజిఃడ్చజిౌౌ.ఛిౌఝ)తో చాటింగ్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు.
వహీద్ ద్వారా నగదు సరఫరా
రియాజ్ భత్కల్ గత ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో ఈసారి హైదరాబాద్‌ను టార్గెట్ చేశామని హడ్డీకి చాటింగ్‌లో చెప్పాడు. వఖాస్, తెహసీన్ అక్తర్ అలియాస్ మోను (బీహార్‌లోని దర్భంగా వాసి)లతో కలిసి ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని నిర్దేశించాడు. అందుకు అవసరమైన పేలుడు పదార్థాలతో నగదు త్వరలోనే అందుతాయంటూ చెప్పాడు. డబ్బును వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్, హవాలా మార్గాల్లో పంపుతానని రియాజ్ భత్కల్ పేర్కొన్నాడు. ఈ నగదు బదిలీ బాధ్యతల్ని రియాజ్... తనకు నమ్మినబంటు అయిన వహీద్ అబ్దుల్ సిద్ధిబపకు అప్పగించాడు. పేలుళ్లకు అవసరమైన నిధు లు సమీకరించిన వహీద్... దుబాయ్ నుంచి మంగుళూరులోని హంపన్‌కట్టలో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్ సంస్థ ఔట్‌లెట్ సుపమ ఫోరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మంగుళూరులోని మార్కెట్ రోడ్డులో హవాలా వ్యాపారం నిర్వహించే డిం గ్ డాంగ్ దుకాణం యజమాని ద్వారా డబ్బు పంపాడు. ఈ మొత్తాన్ని హడ్డీ తీసుకున్నాడు.
పేరు బయటపెట్టిన యాసీన్ భత్కల్
అనుకున్న ప్రకారం హడ్డీ, మోను, వఖాస్‌లు హైదరాబాద్ చేరుకోవడం, అబ్దుల్లాపూర్‌మెట్‌లో మకాం వేయడం, గత ఏడాది ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ-1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల్లో పేలుళ్లకు పాల్పడటం జరిగిపోయాయి. ఈ కేసులో రియాజ్, యాసీన్, వఖాస్, హడ్డీ, మోనులను నిందితులుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. గత ఏడాది ఆగస్టు 29న కేంద్ర నిఘా వర్గాలు యాసీన్, అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీల్ని నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నాయి. యాసీన్ భత్కల్ విచారణ నేపథ్యంలోనే ఫైనాన్షియర్ వహీద్ పేరు వెలుగులోకి వచ్చింది. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు నగదు దుబాయ్ నుంచి మనీ ట్రాన్సఫర్, హవాలా ద్వారా పంపింది ఇతడే అని వెల్లడించాడు. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు నిఘా వర్గాలు సైతం ఇతడి కోసం వేట ముమ్మరం చేశాయి.
‘పార్ట్‌టైమ్’ ఉగ్రవాదిగా వహీద్
కర్ణాకటలో భత్కల్ ప్రాంతంలోని మగ్దూం కాలనీకి చెందిన వహీద్ కొన్నేళ్ల క్రితమే వ్యాపారం నిమిత్తం దుబాయ్‌లో స్థిరపడ్డాడు. రియాజ్, ఇక్బాల్, యాసీన్‌లకు సమీప బంధువైన ఇతగాడు సౌదీ దేశాల్లో ఉన్న సానుభూతిపరుల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమీకరిస్తుంటాడు. భత్కల్ బ్రదర్స్ ఆదేశాల మేరకు వాటిని భారత్‌కు పంపిస్తుంటాడు. ఏ పేలుడులోనూ నేరుగా పాల్గొనని, ఆయా సమయాల్లో భారత్‌లో కూడా లేని వహీద్ పార్ట్‌టైమ్‌గా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొం టున్నా... దుబాయ్ మాడ్యుల్‌లో కీలక వ్యక్తిగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 2006 నాటి ముంబై సీరియల్ బ్లాస్ట్, బెంగళూరు స్టేడియం పేలుళ్లతో పాటు 2010 నాటి ఢిల్లీ వరుస పేలుళ్లలోనూ ఇతడి ‘ఆర్థిక పాత్ర’ ఉన్నట్లు తేలడంతో దర్యాప్తు సంస్థలు ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశాయి. యాసీన్, హడ్డీల అరెస్టు తరవాత గాలింపు మరింత ముమ్మరం చేశాయి. గత వారం దుబాయ్ నుంచి వ్యాపార పనులపై అబుదాబి వచ్చిన వహీద్‌ను ఇంటర్‌పోల్ వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థకూ సమాచారం అందించాయి.
‘గుర్తింపు’ చూపితేనే అప్పగింత
వహీద్‌ను భారత్‌కు తీసుకురావడానికి నిఘా, దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలు ప్రారంభిం చాయి. దీనికోసం ప్రత్యేక బృందాలు అబుదాబి చేరుకున్నాయి. అయితే తమకు వాంటెడ్‌గా ఉన్న వహీద్, అబుదాబిలో చిక్కిన వహీద్ ఒకరే అంటూ ఇంటర్‌పోల్‌కు కొన్ని ఆధారాలు, గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే నిందితుడిని భారత్‌కు తరలించేందుకు ఆయా సంస్థలు అంగీకరిస్తాయి. దీంతో నిఘా వర్గాలు ‘గుర్తింపుల్ని’ సేకరించే పనిలో పడ్డాయి. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లకు సూత్రధారిగా ఉండటంతో రియాజ్ భత్కల్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా (ఏ-1)గా చేర్చిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు నేరుగా ప్రమేయం లేని, పేలుడు పదార్థాలు సరఫరా చేసినట్లు, సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యాసీన్‌ను ఐదో నిందితుడు (ఏ-5)గా చేర్చారు. హడ్డీ, వఖాస్, మోనులను ఏ-2, ఏ-3, ఏ-4గా నిర్థారించారు. ఇప్పుడు వహీద్‌ను అబుదాబి నుంచి తీసుకువచ్చి ఈ కేసులో చేరిస్తే ఆరో నిందితుడిగా మారనున్నాడు.
ఉగ్ర ఫైనాన్షియర్ చిక్కాడు
Published Wed, Feb 5 2014 2:18 AM | Last Updated on Fri, Sep 28 2018 4:46 PM
Advertisement
Advertisement