ముగిసిన ‘పరిషత్‌’ పోరు | Parishad Elections Ended In Telangana | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘పరిషత్‌’ పోరు

Published Wed, May 15 2019 1:11 AM | Last Updated on Wed, May 15 2019 7:44 AM

Parishad Elections Ended In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ సంరంభం ముగిసింది. మంగళవారం జరిగిన తుది విడత ఎన్నికల్లో 77.81% పోలింగ్‌ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 88.40 శాతం, నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా 68.53 శాతం ఓటింగ్‌ రికార్డయింది. దీంతో మూడు విడతలుగా మొత్తం 538 జెడ్పీ టీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు (వాటిలో 4 జెడ్పీటీసీ, 162 ఎంపీటీసీ ఏకగ్రీవమయ్యాయి) పోలింగ్‌ ముగిసినట్లు అయింది. ఓట్ల లెక్కింపు ఈ నెల 27న ఉదయం 8 గంటలకు మొదలుకానుంది. లెక్కింపు పూర్తయ్యాక ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఏడాది జూలై 3, 4 తేదీల్లో ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగుస్తుండ డంతో కొత్తగా ఎన్నికయ్యే స్థానిక ప్రజాప్రతినిధులు ఆ తర్వాతే బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ నెల 6న జరిగిన తొలి దశ పోరులో 76.80%, ఈ నెల 10న జరిగిన రెండో విడతలో 77.63% పోలింగ్‌ నమోదవడం తెలిసిందే. తుది విడత ఎన్నికల్లోనూ గ్రామాల్లో ఓట్ల చైతన్యం వెల్లి విరిసింది. జిల్లాలవారీగా సగటున 75% వరకు

 పోలింగ్‌ నమోదైంది. కొన్ని మండలాలు, గ్రామాల్లో 90 శాతం నుంచి 96 శాతం వరకు పోలింగ్‌ నమోదు కావడం విశేషం. ఆఖరి విడతలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్‌ స్టేషన్ల వద్ద బారులు తీరారు. వర్షం కారణంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో పోలింగ్‌కు కొంతమేర ఇబ్బందులు ఏర్పడినా ఓటర్లు క్యూలో నిరీక్షించి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం మూడు దశల్లో కలిపి వివిధ స్థానాల్లోని బ్యాలెట్‌ పత్రాలు ఒకచోట కలగలిసి పోవడంతో రెండు ఎంపీటీసీ స్థానాల్లో రీ పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఆదేశించింది. 

205 కేంద్రాల్లో గంట ముందే ముగింపు... 
మూడో విడతలో భాగంగా 1,738 ఎంపీటీసీ స్థానాలు, 161 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 30 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమయ్యాయి. దీంతో 1,708 ఎంపీటీసీ స్థానాలతోపాటు తొలి విడుతలో వాయిదా పడిన సిద్దిపేట జిల్లా అల్వాల్, రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్‌ ఎంపీటీసీ స్థానాలు కలుపుకొని మొత్తం 1,710 ఎంపీటీసీలకు పోలింగ్‌ పూర్తయింది. ఇందులో 160 జెడ్పీటీసీ స్థానాలకు 741 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ విడతలో మొత్తం 9,494 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేయగా 654 స్టేషన్లలో ఎస్‌ఈసీ వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించింది. ఐదు జిల్లాల్లోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లోని 205 పోలింగ్‌ కేంద్రాల్లో గంట ముందుగానే పోలింగ్‌ ముగించారు. మిగతా చోట్ల యథావిధిగా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించారు. 

మూడో విడతలో జిల్లాలవారీగా ఓటింగ్‌ శాతం... 
జిల్లా            పోలింగ్‌ శాతం 
ఆదిలాబాద్‌                     74.26     
కుమరం భీం ఆసిఫాబాద్‌    75.65     
మంచిర్యాల                    75.58     
నిర్మల్‌                          78.53             
జగిత్యాల                       73.06             
రాజన్న సిరిసిల్ల              74.99         
భద్రాద్రి కొత్తగూడెం           74.35     
ఖమ్మం                       86.47             
గద్వాల                       77.81             
నాగర్‌కర్నూల్‌               75.41         
వనపర్తి                       74.58         
నారాయణపేట              68.53     
మెదక్‌                        76.89         
సంగారెడ్డి                    78.57             
సిద్దిపేట                      75.76             
కామారెడ్డి                  75.35             
నిజామాబాద్‌              72.01         
నల్లగొండ                  85.50             
సూర్యాపేట               85.04         
యాదాద్రి భువనగిరి     88.40                 
రంగారెడ్డి                  83.28         
వికారాబాద్‌               70.85             
జనగామ                  76.25         
భూపాలపల్లి              70.19         
మహబూబాబాద్‌         79.56     
వరంగల్‌ రూరల్‌          81.73     
ములుగు                   72.31   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement