సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరిశారు. గత ఏడాది కంటే కాస్త మెరుగైన ఫలితాలు సాధించి జిల్లాను మరో మెట్టు పెకైక్కించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను మూడో స్థానంలో నిలిపారు. 2013-14 విద్యా సంవత్సరంలో జిల్లా నుంచి 88,691 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 64,958 మంది పాసై 73.24 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఫలితాల్లో పెరుగుదల..
ఇంటర్ సెకండియర్‌లో గత ఏడాది కంటే ఈసారి ఫలితాల శాతం కాస్త పెరిగింది. గత ఏడాది 72.62శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 73.24శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో 0.61శాతం పెరుగుదల నమోదైంది. ఈ దఫా కూడా బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. 47,984 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 33,588 మంది ఉత్తీర్ణులై 70 శాతం ఫలితాలు సాధించారు. అదేవిధంగా 40,707 మంది బాలికలు పరీక్షలు రాయగా 31,370 మంది పాసై 77 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 7 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు.
ర్యాంకులో ముందుకు..
ఫలితాల్లో పెరుగుదలతో పాటు రాష్ట్రస్థాయి ర్యాంకులోనూ జిల్లా స్థానం మెరుగుపడింది. గత రెండేళ్లుగా నాలుగో స్థానంలో ఉన్న జిల్లా ర్యాంకు ఈసారి మూడోస్థానానికి చేరింది. ఈ ఏడాది వొకేషనల్ కేటగిరీలోనూ ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. 2687 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 1567 మంది పాసై 58 శాతం ఉత్తీర్ణత శాతం సాధించారు. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల నుంచి 2741 మంది పరీక్షలకు హాజరుకాగా వీరిలో 1542 మంది ఉత్తీర్ణులై 56శాతం ఫలితాలు సాధించారు. అదేవిధంగా ఎయిడెడ్ కాలేజీల్లో 60శాతం ఫలితాలు వచ్చాయి.
మెరిశారు
Published Sun, May 4 2014 12:13 AM | Last Updated on Fri, Aug 17 2018 6:08 PM
Advertisement
Advertisement