Intermediate second year results
-
ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఫస్టియర్‌లో 65 శాతం, సెకండియర్‌లో 75 శాతం ఉత్తీర్ణతతో ప్రభంజనం సృష్టించారు. ఇక బాలురు ఫస్టియర్‌లో 58 శాతం, సెకండియర్‌లో 68 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు ఇంటర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విజయవాడలో విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 8,13,033 మంది విద్యార్థులు హాజరుకాగా 5,38,327 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సర విద్యార్థులు 3,79,758 మంది పరీక్షలు రాయగా 72 శాతం (2,72,001) మంది ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా మొదటి సంవత్సరం 4,33,275 మంది పరీక్షలకు హాజరవగా 61 శాతం (2,66,3266) మంది ఉత్తీర్ణులయ్యారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత పెరిగింది. 2022లో ఫస్టియర్‌లో 54 శాతం, సెకండియర్‌లో 61 శాతం ఉత్తీర్ణత నమోదైన సంగతి తెలిసిందే. ఈ లెక్కన ఈ ఏడాది ఫస్టియర్‌లో ఏడు శాతం, సెకండియర్‌లో 11 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఈ నెల 1 నుంచి 18 వరకు పరీక్ష పత్రాల మూల్యాంకనం చేపట్టి కేవలం 8 రోజుల రికార్డు సమయంలోనే œలితాలను ప్రకటించడం విశేషం. కాగా, ఫలితాల కోసం https://examresults. ap.nic.in, www.bie.ap.gov.in చూడొచ్చు. ఫలితాల్లో ఉమ్మడి కృష్ణా టాప్ ఈ విద్యా సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. పశ్చిమ గోదావరి (ఫస్టియర్) రెండో స్థానం, గుంటూరు (ఫస్టియర్) మూడో స్థానంలో నిలిచాయి. ఇక ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో గుంటూరు రెండో స్థానం, పశ్చిమ గోదావరి మూడో స్థానం దక్కించుకున్నాయి. ఒకేషనల్‌లోనూ బాలికలదే పైచేయి.. ఇంటర్ ఒకేషనల్ విభాగంలోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలికలు ఫస్టియర్‌లో 58 శాతం, సెకండియర్‌లో 73 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక బాలురు ఫస్టియర్‌లో 37 శాతం, సెకండియర్‌లో 50 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఒకేషనల్ విభాగంలో ఫస్టియర్ పరీక్షలకు 36,031 మంది హాజరుకాగా 17,507 మంది (49 శాతం) ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ పరీక్షలకు 31,293 మంది హాజరవగా 19,430 మంది (62 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా 72 శాతంతో ప్రథమస్థానంలో నిలవగా, కర్నూలు 50 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. విద్యకు అధిక ప్రాధాన్యం: మంత్రి బొత్స ఇంటర్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా ఫలితాలను సైతం రికార్డు స్థాయిలో వెల్లడించడం పట్ల సంతోషంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. అందుకే విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్నామన్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని తెలిపారు. విద్యపై పెట్టిన ప్రతి పైసా పెట్టుబడితో సమానమని తమ ప్రభుత్వం నమ్ముతోందన్నారు. ఫలితాల వెల్లడి కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, ఇంటర్ విద్య కార్యదర్శి ఎం.వి శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, సర్వశిక్ష ఎస్‌బీడీ శ్రీనివాస్, ఎండీఎం డైరక్టర్ నిధి మీనన్, పాఠ్యపుస్తకాల ముద్రణా సంస్థ డైరెక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి, ఇంటర్ బోర్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 6 వరకు రీకౌంటింగ్‌కు అవకాశం ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 24 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు త్వరలో విడుదల చేస్తుందని తెలిపారు. అదే విధంగా జూన్ 5 నుంచి జూన్ 9 వరకు సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. -
AP Inter Results 2023: ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేస్కోండి
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదల చేసింది విద్యాశాఖ. ఫలితాల వివరాలను మంత్రి బొత్స మీడియాకు వెల్లడించారు. ►ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత ►ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత ►ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్ ►ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 70 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా సెకండ్ ►ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 68 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా థర్డ్ ►ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్ ►ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 78 శాతం ఉత్తీర్ణతతోగుంటూరు జిల్లా సెకండ్ ►ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా థర్డ్ ►ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి ►ఇంటర్ ఫస్టియర్ లో బాలురు 58%, బాలికలు 65 % ఉత్తీర్ణత ►ఇంటర్ సెకండియర్ లో బాలురు 68% , బాలికలు 75% ఉత్తీర్ణత ఫలితాలపై రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలి: మంత్రి బొత్స ►సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి ►ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి ►మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలి ►విజయనగరం జిల్లాలో ఫలితాలు తగ్గడంపై సమీక్షిస్తాం ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు పరీక్షలు జరిగాయి. 4,84,197 మంది విద్యార్ధులు ఇంటర్ ఫస్టియర్, 5,19,793 మంది విద్యార్దులు సెకండియర్ పరీక్షలకు హాజరయ్యారు. అనంతపురం జిల్లా నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి బొత్స పాల్గొన్నారు. అయితే సీఎం హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగా విద్యాశాఖ మంత్రి విజయవాడకు చేరుకోవడం ఆలస్యమైంది. ఈ కారణంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల ఆలస్యమయింది. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.. 1) https://results.sakshieducation.com/ దీనిపై క్లిక్ చేయండి 2) హోం పేజీపై కనపడుతున్న ఏపీ ఇంటర్ రిజల్ట్స్‌పై క్లిక్ చేయండి 3) మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి 4) మీ మార్క్ షీట్ ఓపెన్ అవుతుంది 5) మీ జాబితాను అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు examresults.ap.nic.in, www.bie.ap.gov.in, మనబడి సైట్‌ల్లో కూడా మీ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.. -
సీనియర్ ఇంటర్‌లోనూ బాలికలే టాప్
రాష్ట్రంలో ‘అనంత’కు 10వ స్థానం జిల్లాలో గతేడాదికంటే ఒక శాతం పెరిగిన ఉత్తీర్ణత అనంతపురం ఎడ్యుకేషన్ : సీనియర్ ఇంటర్ ఫలితాల్లోనూ బాలికలే హవా కొనసాగించారు. ఫలితాలు మంగళవారం ఉదయం విడుదలయ్యాయి. మన జిల్లాలో గత ఏడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. గతేడాది 65 శాతం కాగా, ఈ ఏడాది 66 శాతం నమోదైంది. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో మన జిల్లా 9వ స్థానం సాధించగా, ఈసారి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 10వస్థానం దక్కించుకోవడం విశేషం. జిల్లాలో మొత్తం 24,976 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 16,513 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 12,501 మంది బాలురకు 7808 మంది 52 శాతం, 12,475 మంది బాలికలకు గాను 8,705 మంది 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో గతేడాదికంటే తగ్గిన ఉత్తీర్ణత జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 61.28 శాతం ఉత్తీర్ణత సాధించారు. అంటే ఈ ఏడాది 1.28 శాతం తగ్గింది. ఈసారి 5362 మంది విద్యార్థులు రాయగా 3204 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ప్రైవేట్ విద్యార్థులకు సంబంధించి 5764 మందికి గాను 1773 (31 శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 3478 మంది బాలురకు గాను 972 మంది (28 శాతం), 2286 మంది బాలికలకు గాను 801 మంది (35 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఎయిడెడ్ కళాశాలలకు సంబంధించి 1848 మంది విద్యార్థులకు గాను 1130 మంది (45 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 983 మంది బాలురకు గాను 538 (54.73 శాతం) మంది, 867 మంది బాలిలకు గాను 592 (68.44 శాతం) మంది పాస్ అయ్యారు. ఒకేషన్లో 3 శాతం పెరిగిన ఉత్తీర్ణత ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో గతేడాది కంటే ఈసారి 3 శాతం ఉత్తీర్ణత పెరిగింది. జిల్లాలోని ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో 1730 మంది విద్యార్థులకు గాను 1264 మంది విద్యార్థులు 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1161 మంది బాలురకు గాను 825 (71 శాతం) మంది, 569 మంది బాలికలకు గాను 439 మంది (77 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది సీనియర్ఇంటర్ ఫలితాల్లో ఒకేషన్ విద్యార్థులు 70 శాతం ఉత్తీర్ణత సాధించారు. నెట్ సెంటర్ల వద్ద హంగామా! ఫలితాల ప్రకటించగానే అనంతపురం నగరంతో పాటు ప్రధాన కేంద్రాలు, మండలాల్లోని నెట్ కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి బంధువులు హంగామా చేశారు. ఫలితాలు, వచ్చిన మార్కులు తెలుసుకునేందుకు ఆయా కేంద్రాల వద్ద హడావిడి చేశారు. -
ఇంటర్‌లోనూ లాస్ట్ నుంచి ఫస్ట్
► గత ఏడాది కంటే 5 శాతం తగ్గిన ఫలితాలు ► ఒకేషనల్ విభాగంలో 3వ స్థానం ► ఉత్తీర్ణులైన వారిలో బాలికలదే పై చేయి ► ఎంఈసీలో జిల్లా టాపర్ శ్రీ మేధా‘వి’ విద్యార్థిని నాగసాయి తేజ ► ఎంపీసీలో జిల్లా టాపర్ ప్రొద్దుటూరు అభ్యాస్ విద్యార్థి శరత్‌కుమార్ ► బైపీసీలో జిల్లా టాపర్ రాజు విద్యాసంస్థల విద్యార్థిని చందన కడప ఎడ్యుకేషన్/వైవీయూ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వైఎస్ఆర్ జిల్లా రాష్ట్ర స్థాయిలో 13వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 65 శాతం ఫలితాలు సాధించగా, ఈ యేడాది ఐదు శాతం ఫలితాలు కోల్పోయి 60 శాతంతో సరిపెట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా జనరల్ విభాగంలో 19,413 మందికి గాను 11,732 మంది ఉత్తీర్ణత (60శాతం) సాధించారు. బాలుర విభాగంలో 9,747 మందికి గాను 5,328 మంది (55 శాతం) , బాలికల విభాగంలో 9,666 మందికి గాను 6,404 మంది (66 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలదే పైచేయిగా నిలిచింది. ఒకేషనల్ విభాగంలో 649 మందికి గాను 502 మంది (77 శాతం) ఉత్తీర్ణత సాధించి రాష్ర్టంలో 3వ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో 418 మందికి గాను 310 మంది, (74 శాతం), బాలికల విభాగంలో 231 మందికి గాను 192 మంది (83 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో మంచి ఫలితాలు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి 2,919 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 1,910 మంది (65.43 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలుర విభాగంలో 1,068 మందికి గాను 681 మంది (63.76 శాతం), బాలికల విభాగంలో 1,851 మందికి గాను 1,229 మంది (66.04 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరబల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల 91.53 శాతం, రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల 87.88 , పెనగలూరు 87.50 శాతం ఫలితాలతో అగ్ర స్థానంలో నిలిచాయి. జమ్మలమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల 48.41 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఎయిడెడ్ కళాశాలల్లో 2,975 మందికి గాను 1,330 మంది (45 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలుర విభాగంలో 1,769 మందికి 650 మంది (36.74 శాతం), బాలికల విభాగంలో 1,206కు గాను 680 మంది (56.38 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఎయిడెడ్ కళాశాలల్లో లక్కిరెడ్డిపల్లి శ్రీవెంకటేశ్వర ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో 92.63 శాతం, కడప సెయింట్ జోసఫ్ జూనియర్ కళాశాల 70.10 శాతం, ప్రొద్దుటూరు డీఏడబ్లు కళాశాల 69.33 శాతం ఫలితాలు సాధించాయి. పుల్లారెడ్డిపేట ఎయిడెడ్ జూనియర్ కళాశాల 0.94 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. తొండూరు గురుకుల పాఠశాల విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించారు. టాపర్లుగా జిల్లా విద్యార్థులు.. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో రాయచోటి రాజు విద్యా సంస్థల విద్యార్థిని కె. చందన బైపీసీ విభాగంలో 987 మార్కులతో జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది. అదే కళాశాలకు చెందిన రెహమాన్ ఎంపీసీలో 985 మార్కులతో జిల్లాలో రెండవ స్థానంలో నిలిచాడు. ప్రొద్దుటూరు అభ్యాస్ కళాశాలకు చెందిన విద్యార్థి పీవీ శరత్‌కుమార్ రెడ్డి ఎంపీసీ విభాగంలో 986 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచాడు. బైపీసీ విభాగంలో శ్రీలక్ష్మి 983 మార్కులు సాధించింది. ఎంఈసీ విభాగంలో నగరానికి చెందిన శ్రీమేధా‘వి’ కళాశాల విద్యార్థిని సి. నాగసాయి చైతన్య 977 మార్కులతో జిల్లా ఫస్ట్‌గా నిలిచింది. ఈమెతో పాటు తేజశ్విని ఎంఈసీలో 975 మార్కులు సాధించింది.ఎంపీసీ విభాగంలో కడప నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన పి. చంద్రశేఖర్ 985 మార్కులు, వెంకట రూప 984 మార్కులు సాధించారు. ైబైపీసీలో ఎం. నర్మదరెడ్డి 979 మార్కులు, సాయిసింధు 976 మార్కులు సాధించారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు సైతం మంచి ఫలితాలు సాధించారు. శరత్కుమార్రెడ్డికి అభినందన ఎంపీసీ విభాగంలో 986 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచిన పీవీ శరత్‌కుమార్‌రెడ్డిని ప్రొద్దుటూరులోని అభ్యాస్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ బచ్చల వీరప్రతాప్, ప్రిన్సిపాల్ ఎన్.జగదీశ్వరరెడ్డి, అధ్యాపకులు అభినందించారు. కొండాపురం మండలానికి చెందిన విద్యార్థి తండ్రి ప్రతాప్‌రెడ్డి ఆర్టీపీపీలో డోజర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి శివతులశమ్మ గృహిణి. శరత్‌కుమార్ 10వ తరగతి వరకు ఆర్టీపీపీలోని డీఏవీ స్కూల్లో చదివి 9.5 జీపీఏ సాధించాడు. -
శివారు ముందుకు..సిటీ వెనక్కి..
ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో హైదరాబాద్‌కు పదో స్థానం మూడో స్థానానికి చేరిన రంగారెడ్డి జిల్లా ఉత్తీర్ణతలో బాలికలదే హవా ప్రభుత్వ కళాశాలల్లో మరింత అధ్వానం సాక్షి, సిటీబ్యూరో : ఇంటర్ విద్యలో హైదరాబాద్ జిల్లా మరోమారు చతికిలబడింది. శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా మరింత వెనకబడింది. ఏడేళ్లుగా అంతంత మాత్రంగానే ఉన్న జిల్లా ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది మరింత తగ్గింది. గతేడాది ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ జిల్లా 9వ స్థానంలో నిలవగా, తాజా ఫలితాల్లో ఒక మెట్టు దిగి 10వ స్థానానికి దిగజారింది. గతేడాది నాలుగో స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లా ఈ ఏడాది ఒక స్థానం మెరుగుపడి మూడో స్థానానికి ఎగబాకింది. ఉత్తీర్ణత విషయంలో హైదరాబాద్ జిల్లా గతేడాది కన్నా ఒకశాతం తగ్గగా, రంగారెడ్డి జిల్లాలో మాత్రం పరిస్థితి యథాతథంగా ఉంది. రెండు జిల్లాల్లోనూ ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి కావడం విశేషం. దూసుకుపోయిన బాలికలు ఇంటర్ సెకండియర్ ఫలితాల సరళిని చూస్తే.. హైదరాబాద్ జిల్లాలో 64 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 66 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండు జిల్లాల్లోనూ ఉత్తీర్ణత విషయంలో బాలికలే హవా కొనసాగించారు. హైదరాబాద్ జిల్లా నుంచి ఈ ఏడాది 59,377 మంది పరీక్షలు రాయగా 38,322 మంది పాసయ్యారు. పాసైన వారిలో బాలురు 56 శాతం ఉండగా, బాలికలు 73 శాతం ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది మొత్తం 88,691మంది రాయగా 64,958మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలురు 70 శాతం మంది, బాలికలు 77 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు. సర్కారీ కాలేజీల్లో ఉత్తీర్ణత అంతంతే.. జంట జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ఉత్తీర్ణత మరీ అధ్వానంగా తయారైంది. హైదరాబాద్ జిల్లాలో ఈ ఏడాది కేవలం 51 శాతం ఉత్తీర్ణతే లభించింది. రంగారెడ్డి జిల్లాలో లభించిన ఉత్తీర్ణత 56.26 శాతమే. హైదరాబాద్ జిల్లాలోని మైసారం ప్రభుత్వ జూనియర్ కళాశాల 71 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, విద్యానగర్‌లోని వివేకానంద ప్రభుత్వ జూనియర్ కళాశాల కేవలం 12 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ కళాశాలల పరిస్థితి చూస్తే.. సరూర్‌నగర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల 89.39 శాతం ఉత్తీర్ణత సాధించి ముందువరసలో నిలవగా.. హయత్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 41 శాతం ఉత్తీర్ణతతో చివరి వరుసలో నిలిచింది. ఎయిడెడ్ కళాశాలల విషయానికి వస్తే.. హైదరాబాద్ జిల్లాలో 51 శాతం ఉత్తీర్ణత సాధించగా.. రంగారెడ్డి జిల్లాలో 60 శాతం ఉత్తీర్ణత లభించింది. ఒకేషనల్ కోర్సుల్లో మెరుగైన ఫలితాలు వృత్తి విద్యా కోర్సుల్లో మాత్రం గతంలో కన్నా ఈ ఏడాది మెరుగైన ఉత్తీర్ణత లభించింది. హైదరాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3,380మంది పరీక్ష రాయగా 2,197మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 55 శాతం పాసవగా ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 65 శాతానికి పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో 2,687 మంది రాయగా 1,567 మంది పాసయ్యారు. గతేడాది 51 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది ఏకంగా ఏడు శాతం పెరిగి 58 శాతం ఉత్తీర్ణత లభించింది. -
మెరిశారు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరిశారు. గత ఏడాది కంటే కాస్త మెరుగైన ఫలితాలు సాధించి జిల్లాను మరో మెట్టు పెకైక్కించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను మూడో స్థానంలో నిలిపారు. 2013-14 విద్యా సంవత్సరంలో జిల్లా నుంచి 88,691 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 64,958 మంది పాసై 73.24 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో పెరుగుదల.. ఇంటర్ సెకండియర్‌లో గత ఏడాది కంటే ఈసారి ఫలితాల శాతం కాస్త పెరిగింది. గత ఏడాది 72.62శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 73.24శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో 0.61శాతం పెరుగుదల నమోదైంది. ఈ దఫా కూడా బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. 47,984 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 33,588 మంది ఉత్తీర్ణులై 70 శాతం ఫలితాలు సాధించారు. అదేవిధంగా 40,707 మంది బాలికలు పరీక్షలు రాయగా 31,370 మంది పాసై 77 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 7 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ర్యాంకులో ముందుకు.. ఫలితాల్లో పెరుగుదలతో పాటు రాష్ట్రస్థాయి ర్యాంకులోనూ జిల్లా స్థానం మెరుగుపడింది. గత రెండేళ్లుగా నాలుగో స్థానంలో ఉన్న జిల్లా ర్యాంకు ఈసారి మూడోస్థానానికి చేరింది. ఈ ఏడాది వొకేషనల్ కేటగిరీలోనూ ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. 2687 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 1567 మంది పాసై 58 శాతం ఉత్తీర్ణత శాతం సాధించారు. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల నుంచి 2741 మంది పరీక్షలకు హాజరుకాగా వీరిలో 1542 మంది ఉత్తీర్ణులై 56శాతం ఫలితాలు సాధించారు. అదేవిధంగా ఎయిడెడ్ కాలేజీల్లో 60శాతం ఫలితాలు వచ్చాయి. -
నెలాఖరుకు ఇంటర్ ఫలితాలు
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏప్రిల్ నెలాఖరులోగా విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను ఈ నెల 23న లేదా 24న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు దాదాపు 19.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.