సీనియర్ ఇంటర్‌లోనూ బాలికలే టాప్
రాష్ట్రంలో ‘అనంత’కు 10వ స్థానం
జిల్లాలో గతేడాదికంటే ఒక శాతం పెరిగిన ఉత్తీర్ణత
అనంతపురం ఎడ్యుకేషన్ : సీనియర్ ఇంటర్ ఫలితాల్లోనూ బాలికలే హవా కొనసాగించారు. ఫలితాలు మంగళవారం ఉదయం విడుదలయ్యాయి. మన జిల్లాలో గత ఏడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. గతేడాది 65 శాతం కాగా, ఈ ఏడాది 66 శాతం నమోదైంది. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో మన జిల్లా 9వ స్థానం సాధించగా, ఈసారి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 10వస్థానం దక్కించుకోవడం విశేషం. జిల్లాలో మొత్తం 24,976 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 16,513 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 12,501 మంది బాలురకు 7808 మంది 52 శాతం, 12,475 మంది బాలికలకు గాను 8,705 మంది 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ప్రభుత్వ కళాశాలల్లో గతేడాదికంటే తగ్గిన ఉత్తీర్ణత
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 61.28 శాతం ఉత్తీర్ణత సాధించారు. అంటే ఈ ఏడాది 1.28 శాతం తగ్గింది. ఈసారి 5362 మంది విద్యార్థులు రాయగా 3204 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ప్రైవేట్ విద్యార్థులకు సంబంధించి 5764 మందికి గాను 1773 (31 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
వీరిలో 3478 మంది బాలురకు గాను 972 మంది (28 శాతం), 2286 మంది బాలికలకు గాను 801 మంది (35 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఎయిడెడ్ కళాశాలలకు సంబంధించి 1848 మంది విద్యార్థులకు గాను 1130 మంది (45 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 983 మంది బాలురకు గాను 538 (54.73 శాతం) మంది, 867 మంది బాలిలకు గాను 592 (68.44 శాతం) మంది పాస్ అయ్యారు.
ఒకేషన్‌లో 3 శాతం పెరిగిన ఉత్తీర్ణత
ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో గతేడాది కంటే ఈసారి 3 శాతం ఉత్తీర్ణత పెరిగింది. జిల్లాలోని ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో 1730 మంది విద్యార్థులకు గాను 1264 మంది విద్యార్థులు 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1161 మంది బాలురకు గాను 825 (71 శాతం) మంది, 569 మంది బాలికలకు గాను 439 మంది (77 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది సీనియర్‌ఇంటర్ ఫలితాల్లో ఒకేషన్ విద్యార్థులు 70 శాతం ఉత్తీర్ణత సాధించారు.
నెట్ సెంటర్ల వద్ద హంగామా!
ఫలితాల ప్రకటించగానే అనంతపురం నగరంతో పాటు ప్రధాన కేంద్రాలు, మండలాల్లోని నెట్ కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి బంధువులు హంగామా చేశారు. ఫలితాలు, వచ్చిన మార్కులు తెలుసుకునేందుకు ఆయా కేంద్రాల వద్ద హడావిడి చేశారు.