శివారు ముందుకు..సిటీ వెనక్కి.. | Inter Second Year 2014 Highest Marks Toppers | Sakshi
Sakshi News home page

శివారు ముందుకు..సిటీ వెనక్కి..

Published Sun, May 4 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM

శివారు ముందుకు..సిటీ వెనక్కి..

శివారు ముందుకు..సిటీ వెనక్కి..

  • ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో హైదరాబాద్‌కు పదో స్థానం
  • మూడో స్థానానికి చేరిన రంగారెడ్డి జిల్లా
  • ఉత్తీర్ణతలో బాలికలదే హవా
  • ప్రభుత్వ కళాశాలల్లో మరింత అధ్వానం
  •  సాక్షి, సిటీబ్యూరో : ఇంటర్ విద్యలో హైదరాబాద్ జిల్లా మరోమారు చతికిలబడింది. శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా మరింత వెనకబడింది. ఏడేళ్లుగా అంతంత మాత్రంగానే ఉన్న జిల్లా ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది మరింత తగ్గింది. గతేడాది ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ జిల్లా 9వ  స్థానంలో నిలవగా, తాజా ఫలితాల్లో ఒక మెట్టు దిగి 10వ స్థానానికి దిగజారింది. గతేడాది నాలుగో స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లా ఈ ఏడాది ఒక స్థానం మెరుగుపడి మూడో స్థానానికి ఎగబాకింది. ఉత్తీర్ణత విషయంలో హైదరాబాద్ జిల్లా గతేడాది కన్నా ఒకశాతం తగ్గగా, రంగారెడ్డి జిల్లాలో మాత్రం పరిస్థితి యథాతథంగా ఉంది. రెండు జిల్లాల్లోనూ ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి కావడం విశేషం.
     
    దూసుకుపోయిన బాలికలు
     
    ఇంటర్ సెకండియర్ ఫలితాల సరళిని చూస్తే.. హైదరాబాద్ జిల్లాలో 64 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 66 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండు జిల్లాల్లోనూ ఉత్తీర్ణత విషయంలో బాలికలే హవా కొనసాగించారు. హైదరాబాద్ జిల్లా నుంచి ఈ ఏడాది 59,377 మంది పరీక్షలు రాయగా 38,322 మంది పాసయ్యారు. పాసైన వారిలో బాలురు 56 శాతం ఉండగా, బాలికలు 73 శాతం ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది మొత్తం 88,691మంది రాయగా 64,958మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలురు 70 శాతం మంది, బాలికలు 77 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు.
     
    సర్కారీ కాలేజీల్లో ఉత్తీర్ణత అంతంతే..
     
    జంట జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ఉత్తీర్ణత మరీ అధ్వానంగా తయారైంది. హైదరాబాద్ జిల్లాలో ఈ ఏడాది కేవలం 51 శాతం ఉత్తీర్ణతే లభించింది. రంగారెడ్డి జిల్లాలో లభించిన ఉత్తీర్ణత 56.26 శాతమే. హైదరాబాద్ జిల్లాలోని మైసారం ప్రభుత్వ జూనియర్ కళాశాల 71 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, విద్యానగర్‌లోని వివేకానంద ప్రభుత్వ జూనియర్ కళాశాల కేవలం 12 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ కళాశాలల పరిస్థితి  చూస్తే.. సరూర్‌నగర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల 89.39 శాతం ఉత్తీర్ణత సాధించి ముందువరసలో నిలవగా.. హయత్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 41 శాతం ఉత్తీర్ణతతో చివరి వరుసలో నిలిచింది. ఎయిడెడ్ కళాశాలల విషయానికి వస్తే.. హైదరాబాద్ జిల్లాలో 51 శాతం ఉత్తీర్ణత సాధించగా.. రంగారెడ్డి జిల్లాలో 60 శాతం ఉత్తీర్ణత లభించింది.
     
    ఒకేషనల్ కోర్సుల్లో మెరుగైన ఫలితాలు

     
    వృత్తి విద్యా కోర్సుల్లో మాత్రం గతంలో కన్నా ఈ ఏడాది మెరుగైన ఉత్తీర్ణత లభించింది. హైదరాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3,380మంది పరీక్ష రాయగా 2,197మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 55 శాతం పాసవగా ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 65 శాతానికి పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో 2,687 మంది రాయగా 1,567 మంది పాసయ్యారు. గతేడాది 51 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది ఏకంగా ఏడు శాతం పెరిగి 58 శాతం ఉత్తీర్ణత లభించింది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement