సొరకాయలు పండించిన గుడ్ హార్వెస్ట్ స్కూల్ బాలికలు
వాళ్లు... గడ్డివాములో నడుంవాల్చి లెక్కలు నేర్చుకుంటారు..!
మర్రిచెట్టు ఊడల్లో ఉయ్యాలలు ఊగుతూ
సామాజిక శాస్త్రాన్ని అర్థం చేసుకుంటారు....
చిట్టి చేతులతో మట్టి పిసుకుతారు.. విత్తు విత్తుతారు. ఎరువులు చల్లుతారు!
తేనెటీగల పెట్టెలోకి తొంగిచూసి మధు రహస్యాలను ఛేదిస్తారు...
ఎవరు వారు? ఎచటి వారు? ఏం చేస్తున్నారు?
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు కొంచెం దూరంలో ఉంటుంది పశ్చిమ్ గావ్! ప్రపంచంలోనే తొట్టతొలి.. బాలికలకు మాత్రమే పరిమితమైన వ్యవసాయ పాఠశాల ఇక్కడే ఉంది! ఈ ‘గుడ్ హార్వెస్ట్ స్కూల్’లో విద్యార్థినులు ఒకపక్క గణితం, సామాజిక శాస్త్రం, సైన్స్‌లు నేర్చుకుంటూనే... ఇంకోపక్క మట్టి వాసనకు చేరువవుతారు. కార్తెల వివరాలు తెలుసుకుంటారు. విత్తుల సంబరం మొదలుకొని పంట ఇళ్లకు చేరే ఘట్టం వరకూ వ్యవసాయంలోని ప్రతి విషయాన్ని ఔపోసన పట్టేందుకు ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. ఢిల్లీలో అడ్వరై్టజ్‌మెంట్ రంగంలో పదేళ్లుగా పనిచేస్తోన్న అనీష్ నాథ్, స్వచ్ఛంద సంస్థ నడుపుతోన్న ఆశిత ఇద్దరిలోని సామాజిక సేవా దృక్పథం వారి వారి గ్రామాల్లోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజల స్థితి గతులు కదిలించాయి. బాల్య వివాహాలు, బాలికల్లో రక్తహీనత, ఉన్నత విద్యను మానేస్తున్న బాలికలు.. తదితర అంశాలు వీరిని తీవ్రంగా కదిలించాయి. వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తోన్న ఎందరో శ్రామికుల బిడ్డలు నిరక్షరాస్యులుగా మిగిలిపోవడం ఇక ఎంత మాత్రం సహించకూడదనుకున్నారు. కొన్నేళ్లపాటు గ్రామాల్లో రైతులతో పాటే జీవిస్తూ దీనికో పరిష్కార మార్గాన్ని ఆలోచించారు.
ఎందుకొచ్చిందీ ఆలోచన?
2016లో ఈ పాఠశాల స్థాపనకు ముందు అశిత, అనీష్‌లు నాలుగేళ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల కుటుంబాలతో కలసి పనిచేశారు. నాసిరకం విత్తనాలతో పంటలు సరిగా పండక, పండిన పంట కు గిట్టుబాటు ధరలు రాక రైతులు పడుతున్న కష్టాలను దగ్గరినుంచి చూశారు. వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కోవడమెలాగో తెలియక తమ పిల్లలను వ్యవసాయం నుంచి తప్పించి ఉద్యోగాలకోసం వలసెళ్లే లా ప్రోత్సహిస్తున్న పరిస్థితిని చూశారు. మార్పు రావాలంటే వ్యవసాయాన్ని ఉపయోగకరంగా మలుచుకునే అవకాశాలు నేర్పించాలని భావించారు. బడికి దూరమౌతోన్న గ్రామీణ బాలికలకు సరికొత్తగా విద్యాబోధన చేయాలనే తలంపు, తపన ఈ తొలి వ్యవసాయ పాఠశాలకు పునాదులు వేసింది.
ఆచరణతో నేర్చుకుంటారు
అక్కడ పాఠాలు చెపుతారు.. కానీ పుస్తకాల్లోనివే కాదు. అన్నీ ప్రాక్టికల్‌గా నేర్పిస్తారు. వారే స్వయంగా చదువుకున్న విషయాలను ఆచరణతో నేర్చుకుంటారు. చదువే కాదు. వ్యవసాయ పరిజ్ఞానాన్ని ప్రత్యేకించి బోధిస్తారు. విత్తనాలు విత్తడం, రసాయన ఎరువులకు బదులు ప్రాచీన పద్ధతిలో వ్యవసాయం. తేనెటీగల పెంపకం, పశువులకు సంబంధించిన జ్ఞానం అన్నీ ప్రత్యక్షంగా నేర్చుకుంటారు. ఒకరు బోధిస్తే అందరూ వినే మూస పద్ధతిలో కాకుండా.. టీచర్లూ, విద్యార్థులూ అంతా కలసి చదువుతారు. అంతా కలసి నేర్చుకుంటారు. ఈ స్కూల్లో సాయంకాలాలు ఆటలు తప్పనిసరి. సంగీతం, నృత్యం, ఆర్ట్ పిల్లల అభిరుచులకు మెరుగులద్దుతారు. వేలాది పుస్తకాలున్న ఓపెన్ లైబ్రరీ. ఎవ్వరైనా రావొచ్చు. ఎవ్వరైనా చదువుకోవచ్చు. అప్పుడప్పుడూ వర్క్‌షాప్‌లు, సామాజిక విశ్లేషణలూ, కొత్త విషయాలపై పెద్దలకీ, పిల్లలకీ పాఠాలూ.. ఇవన్నీ అక్కడి పెద్దలను అబ్బురపరిచే అంశాలు. వ్యవసాయరంగంలో మెలకువలు గ్రహించగలిగితే, చిన్నప్పటి నుంచి వ్యవసాయ రంగం పట్ల పిల్లలకు ఆసక్తిని రేకెత్తించగలిగితే అదే మా విజయమంటారు అనీష్, అశిత.
దేశంలో 18 ఏళ్లకు ముందే పెళ్లయిపోతున్న బాలికలు 48 శాతం
రక్తహీనతతో బాధపడుతున్న15 – 19 మధ్య వయసు ఆడపిల్లలు. 56 శాతం
ఎనిమిదో తరగతి తరువాత బడి మానేస్తున్న బాలికల సంఖ్య 20 శాతం
ఉన్నత ప్రమాణాలతో..
భారత దేశంలోనే తొలి బాలికల వ్యవసాయ పాఠశాలను నెలకొల్పి రైతు బిడ్డలకు వ్యవసాయాన్ని శాస్త్రీయ విధానాలతో సరికొత్తగా పరిచయం చేస్తున్నారు. పట్టణాల్లో విద్యార్థులకూ, పల్లెల్లో విద్యార్థులకూ ఉన్న అంతరాలను అధిగమించే ఉన్నత ప్రమాణాలతో బాలికలను సమున్నతంగా తీర్చిదిద్దుతున్నారు. భూములు పురుషుల పేరున ఉన్నా కష్టమంతా స్త్రీలదే. అయినా వ్యవసాయరంగాన్ని పురుష ప్రపంచంగానే చూస్తారు. అత్యధిక మంది స్త్రీలు పనిచేసే రంగం వ్యవసాయ రంగం. వ్యవసాయరంగంలో మెలకువలు గ్రహించగలిగితే, చిన్నప్పటి నుంచీ వ్యవసాయ రంగం పట్ల ఆసక్తిని రేకెత్తించగలిగితే అది మా విజయమేనంటారు అనీష్, అశిత.
Comments
Please login to add a commentAdd a comment