అర్ధరాత్రి పూట రైల్వేస్టేషన్ ఎదుట నిద్రిస్తున్న సాధారణ ప్రయాణికులు
సికింద్రాబాద్: రైలులో సాధారణ ప్రయాణమే ఒక నరకం. జనరల్ టికెట్‌కు ‘క్యూ’లో నిల్చోవడం మొదలు.. బోగీలో అడుగుపెట్టే వరకు సర్కస్ ఫీట్లే. ఇక జనరల్ ప్రయాణికుల సంఖ్యకు అందుబాటులో ఉంటున్న బోగీలకు ఎంతమాత్రం సరిపోయే అవకాశాలు లేవు. రెండు, మూడింతల ప్రయాణికులతో జనరల్ బోగీలో కూర్చున్నా.. నిల్చున్నా.. గమ్యం చేరే వరకు నరకయాతనే. జనరల్ ప్రయాణాల సంగతి అలా ఉంచితే.. తెల్లవారుజామున జనరల్ ప్రయాణికులు రాత్రంతా జాగరణ చేయాల్సిన పరిస్థితులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద నెలకొన్నాయి.
తప్పని జాగరణ..
ఉదయం 4 గంటల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతకంటే ముందు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకునేందుకు రవాణా సదుపాయం లేనందున శివారు ప్రాంతాలవారు రాత్రి 11 గంటలలోపే రైల్వేస్టేషన్‌కు చేరుకుంటున్నారు. రాత్రి 11 నుంచి 12 గంటలలోపు స్టేషన్‌కు చేరుకుంటున్న ప్రయాణికులు స్టేషన్ ముందే పడిగాపులు పడుతున్నారు.
ప్రవేశ ద్వారాల మూసివేత..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రాత్రి 11.45 గంటల వరకు మాత్రమే రైళ్ల రాకపోకలు ఉంటున్నాయి. ఆ తర్వాత ఉదయం 4 గంటల నుంచి రైళ్ల రాకపోకలు ఉంటాయి. రైళ్ల రాకపోకలు లేని సమయాల్లో ప్రయాణికులను స్టేషన్‌లోనికి అనుమతించడం లేదు. ఈ కారణంగా జనరల్ వెయిటింగ్ హాల్లో ఉండాల్సిన ప్రయాణికులు స్టేషన్ బయటే ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అన్ని ప్రవేశ ద్వారాలు మూసివేస్తుండడంతో ప్రయాణికులు స్టేషన్ ముందే వేచి ఉంటున్నారు.
సెలవు దినాల్లో..
పండగలు, పర్వదినాలు తదితర సెలవు దినాల్లో జనరల్ ప్రయాణికుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. సెలవు దినాల్లో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతున్నప్పటికీ బోగీల సంఖ్యమాత్రం పెరగడం లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు స్టేషన్‌కు వస్తున్న వీరంతా స్టేషన్ ముందున్న పార్కింగ్ ప్రదేశాలు, ఫుట్‌పాత్‌లపై సేదదీరుతున్నారు. జనరల్ టికెట్ కౌంటర్లు కూడా అరకొరగా ఉండడంతో టికెట్ తీసుకోవడం కోసం గంటల పాటు క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. రైలు వచ్చే సమయంలో క్యూలో తోపులాటలు షరా మామూలవుతున్నాయి.
భద్రత పేరుతో..
ప్రయాణికుల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు స్టేషన్‌లోకి చొరబడకుండా ఉండేందుకు రైళ్ల రాకపోకలు లేని సందర్భాల్లో ప్రయాణికుల ప్రవేశాలను నిలిపివేస్తున్నారు. ఈ కారణంగా సుమారు ఐదు గంటలపాటు ప్రయాణికులు పిల్లలు, మహిళలతో వచ్చి స్టేషన్ ముందు వేచి ఉంటున్నారు. ఇదిలా ఉండగా జనరల్ వెయిటింగ్ హాలులో ప్రవేశించాలంటే ప్రయాణపు టికెట్ లేదా ప్లాట్‌ఫాం టికెట్ కలిగి ఉండాలి. రైళ్ల రాకపోకలు నిలిచిపోగానే రైల్వే అధికారులు జనరల్ కౌంటర్లలో టికెట్లను విక్రయించడం లేదు. ఫలితంగా ఎముకలుకొరికే చలిలో ప్రయాణికులు స్టేషన్ బయటే ఉంటున్నారు.
అనుమతించాలి..
అర్ధరాత్రి దాటిన తర్వాత స్టేషన్‌కు చేరుకుంటున్న ప్రయాణికులను లోనికి అనుమతించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రవేశ మార్గాలు మూసివేస్తుండడంతో పిల్లాపాపలతో చలిలో బయట ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా రైళ్లు స్టేషన్ నుంచి బయలుదేరే గంట ముందు నుంచి కాకుండా జనరల్ ప్రయాణాల కోసం టికెట్లు విక్రయించే కౌంటర్లు 24 గంటలు తెరిచి ఉంచాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment