సాక్షి, మహబూబ్‌నగర్: చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు, బాధితులకు మందులు ఇచ్చేవారు కరువయ్యారు. జిల్లాలో ఒక ప్రధాన ఆస్పత్రితో పాటు నాలుగు ఏరియా ఆస్పత్రులు, ఆరు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లతో పాటు 85 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో మందులు ఇచ్చేందుకు డీసీహెచ్ పరిధిలో 31పోస్టులు, డీఎంహెచ్‌ఓ పరిధిలో 102 ఫార్మసీ పోస్టులు మంజూరయ్యాయి. ఫార్మసీకి సంబంధించిన అన్నివిభాగాల్లో కూడా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామీణప్రాంతాల్లో సేవలందించే ఏడు పీహెచ్‌సీలలో సైతం ఫార్మసిస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఖిల్లాఘనపురం, అయిజ, పెద్దమందడి, తిప్పడంపల్లి, మక్తల్, కొల్లాపూర్, బీచుపల్లి బెటాలియన్ పీహెచ్ సీలలో ఫార్మసిస్టులు లేక మందు బిళ్లలు ఇచ్చేవారు కరువయ్యారు. అంతేకాదు డీసీహెచ్ పరిధిలో కూడా ఈ కొరత ఉంది. సూపర్‌వైజర్, గ్రేడ్-1, గ్రేడ్-2 మూడు స్థాయిల్లో కూడా ఫార్మసిస్టుల కొరత ఉంది.
కాలం ముగిసినా కదలరు!
ఓవైపు జిల్లాలో ఫార్మసిస్టుల కొరత వేధిస్తుంటే.. మరోవైపు జిల్లాకు చెందినవారు మాత్రం ఇక్కడ విధులు నిర్వహించకుండా డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇలా ఐదేళ్లుగా డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. కాలం ముగిసినా రెండేళ్లుగా వారు అక్కడే ఉండటానికి ఇష్టపడుతున్నారు. జిల్లాలోని వివిధ పీహెచ్‌సీల్లో శ్రీహరి, యాదయ్య, శ్రీనివాసులురెడ్డి, పుల్లయ్యలు ఫార్మసిస్టులుగా విధులు నిర్వహించేవారు. అయితే వీరికి ఉన్న ఫలంగా లాభదాయకమైన పోస్టులపై కన్నుపడింది.
అంతే తడువుగా వెంటనే డిప్యూటేషన్ మార్గం కనిపెట్టారు. అలా ఈ నలుగురు కూడా ఐదేళ్లుగా రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, సెంట్రల్ డ్రగ్స్‌స్టోర్, రంగారెడ్డి సెంట్రల్ డ్రగ్స్‌స్టోర్ వంటి చాలా కీలకమైన స్థానాల్లో కొనసాగుతున్నారు. అక్కడ వీరు ఆడిందే ఆట, పాడిందే పాటలా వ్యవహరం సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడవారి డిప్యూటేషన్ కాలపరిమితి ముగిసినా అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడటం లేదు.
కలెక్టర్ చొరవ చూపుతేనే..!
అత్యంత వెనకబడిన పాలమూరు జిల్లాలో వైద్యరంగాన్ని పటిష్టపర్చాలని ప్రయత్నిస్తున్న కలెక్టర్ టీకే శ్రీదేవి ఈ డిప్యూటేషన్ల వ్యవహారంపై చొరవ చూపాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. చాలా ఆస్పత్రుల్లో మందులు ఇచ్చే వారు లేక జనం నానాఅవస్థలు పడుతున్నారు. కావునా ఈ అక్రమ డిప్యూటేషన్లపై కొనసాగుతున్న వారిని వెంటనే జిల్లాకు తీసుకుని ఖాళీస్థానాలను భర్తీచేస్తే జిల్లావాసులకు మేలు జరుగుతుందని కోరుతున్నారు.
విచారణ జరుపుతాం..
ఆ నలుగురు ఫార్మసిస్టులు డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న విషయం నాకు తెలియదు. అయితే వారిని ఎప్పుడు, ఎవరు డిప్యూటేషన్‌పై పంపారనే విషయాన్ని పరిశీలిస్తాం. జిల్లాలో ఫార్మసిస్టుల కొరత అంతగా లేనందున వారిపై దృష్టిసారించలేదు. రికార్డులు పరిశీలించిన తర్వాత వారు నిజం నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటాం.
- గోవింద్ వాగ్మూరే, డీఎంహెచ్‌ఓ
కదలరు.. వదలరు
Published Sat, Apr 25 2015 1:47 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement