
పెన్షన్ కోసం కాగితాల మీద భర్తను చంపేసింది ఒకామే..! 60 ఏళ్ల వయస్సు రాకున్నా, వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న మరొకాయన. మరోచోట భర్తతో కలిసి జీవిస్తూనే.. ఒంటరి మహిళను అంటూ పెన్షన్ పొందుతున్న ఇంకో మహిళ. గీత కార్మికుని పేర పింఛను లాగిస్తున్న మరో కులస్తుడు.. ఏమిటిదంతా అంటే... ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల మంజూరీలో చోటు చేసుకున్న విచిత్రాలు..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అర్హులు పెన్షన్ల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. అనర్హులు మాత్రం దొడ్డిదారిన దర్జాగా లబ్ధి పొందుతున్నారు. కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ ఇవ్వాలి, అది కూడా అర్హులకే ఇవ్వాలి. కానీ అర్హత లేని వారు అడ్డదారిన పెన్షన్లు పొందుతున్నారు. నల్లగొండ మున్సిపాలిటీలోని ఒక ప్రైవేట్ ఉద్యోగి ద్వారా కథంతా నడిపిస్తున్నారు. కొందరు దళారులు, మరికొందరు మాజీ కౌన్సిలర్లు, పైరవీకారుల అవతారం ఎత్తి అక్రమాలకు తెరతీశారు. మున్సిపల్ అధికారులు కానీ, పెన్షన్ విభాగానికి చెందిన ఇతర అధికారులు కానీ పెన్షన్ల దరఖాస్తులను ఏమాత్రం పరిశీలించకుండా పచ్చా జెండా ఊపడం వల్ల జరిగిన అనర్థాలివి. కేవలం ఒక్క నల్ల గొండ పట్టణంలోనే 2వేల పైచిలుకు మంది ఇలా తప్పుడు పద్ధతుల్లో పెన్షన్ల ద్వారా లబ్ధిపొందుతున్నారని సమాచారం. ఇలా, ప్రతి నెలా రూ.20లక్షల వరకు పక్కదారి పడుతోంది. అంటే ఏటా రూ.2.50కోట్లు. ఇది కేవలం ఒక్క మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమం. జిల్లాలో మరికొన్ని మున్సిపాలిటీలు, ఇతర ప్రాంతాల్లోనూ ఇదే రకమైన వ్యవహారాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
ఇదీ ... వరుస
నల్లగొండ మున్సిపాలిటీలో మొత్తం 15,336 మంది వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ , చేనేత, గీతకారిక్మకుల తదితర పెన్షన్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక్కో పెన్షన్‌దారుకు రూ.వెయ్యి చొప్పున నగదు అందుతుండగా వికలాంగులకు మాత్రం రూ.1500 అందిస్తున్నారు. పెన్షన్ కోసం అడ్డదారులు తొక్కుతున్న కొందరు తమ భర్త ఉండగానే చనిపోయాడంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టి వితంతు పెన్షన్ పొందుతున్నారు. మరికొందరు భర్తతో కలిసి జీవిస్తూనే ఒంటరిని అంటూ ఒంటరి మహిళ పెన్షన్ పొందుతున్నారు. ఒక ఇంట్లో భార్యాభర్తల్లో ఒక్కరే పెన్షన్ పొందే వీలుంది. కానీ, కొన్ని చోట్ల ఇద్దరూ పొందుతున్నారు. భర్త వృద్ధాప్య పెన్షన్ పొందుతుంటే... భార్య మాత్రం తన భర్త చనిపోయాడంటూ వితంతు పెన్షన్ పొందుతున్న ఉదంతాలు ఉన్నాయి. గ్రామాల్లో జీవిస్తూ.. నల్లగొండ పట్టణంలో పెన్షన్ పొందుతున్న వారూ ఉన్నారు. వీరికి సంబంధించి ఇంటి చిరునామాలూ సరిగా లేవు. నల్లగొండ పట్టణంలో 2వేలకు పైగానే బోగస్ పెన్షన్లు ఉన్నట్లు సమాచారం. 3, 4, 6, 9, 10, 11, 14, 15, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 32, 33, 35, 37, 39 వార్డుల్లో బోగస్ పెన్షన్లు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
విచారణ ఏదీ...?
ప్రతి ఏటా పెన్షన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయి కానీ వాటి పరిశీలిస్తున్న పాపాన పోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో అనర్హుల సంఖ్య ప్రతిఏటా పెరిగిపోతోంది. ఏ కాగితాలు సరి చూడకుండానే ప్రైవేట్ ఉద్యోగుల సహకారంతో పెన్షన్‌కు అర్హత పొంది, పెన్షన్ స్వాహా చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని రూ.వెయ్యి నుంచి రూ.2016కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ పెరుగుదల అమలులోకి వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో సహజంగానే పక్కదారి పడుతున్న మొత్తం పెరిగే ముప్పు ఉంది.
మచ్చుకు కొన్ని... బోగస్ పెన్షన్లు
పెన్షన్ల జాబితాలో సీరియల్ నంబర్ 14612 పై 39వ వార్డులో ఓ భర్త, భార్య, ఇద్దరూ పెన్షన్ పొందుతున్నారు. భార్య వితంతు పెన్షన్ పొందుతుండగా, భర్త మాత్రం వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నాడు. వీరు ఒక షాప్ కూడా నడుపుతున్నారు. . సీరియల్ నంబర్ 5594పై ఓ అంగన్‌వాడీ టీచర్ పెన్షన్ పొందుతోంది. సీరియల్ నంబర్ 5635, గొల్లగూడ కాలనీలో ఆ కాలనీకి సంబంధం లేకున్నా, వేరే గ్రామస్తులు ఇక్కడ పెన్షన్ పొందుతున్నారు. 5715 సీరియల్ నంబర్ ద్వారా ఓ గీత కార్మికుడు కాని వ్యక్తి గీత కార్మిక పెన్షన్ పొందుతున్నాడు. 14వ వార్డులోనే 5729 సీరియల్ నంబర్‌లో భర్త, భార్యలు పెన్షన్ పొందుతుండగా, భార్య వితంతు పెన్షన్, భర్త వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నాడు. ఇది పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో చోటు చేసుకుంది.
5733 సీరియల్ నంబర్ ద్వారా భర్త, భార్య ఇద్దరూ పెన్షన్ పొందుతున్నారు. భార్య వితంతు పెన్షన్, భర్త వృద్ధాప్య పెన్షన్. ఈ పెన్షన్‌దారు ఇటీవల ఓ గ్రామంలో సర్పంచ్‌గా కూడా పోటీచేసినట్లు సమాచారం. 5734 సీరియల్ నంబర్ ద్వారా పెన్షన్ పొందే మహిళ భర్త ఉండి కూడా వితంతు పెన్షన్ పొందుతుంది. అదే విధంగా 5739, 5742 ïసీరియల్ నంబర్లు ద్వారా చేనేత కార్మికులు కాని ఇద్దరు వ్యక్తులు చేనేత పెన్షన్ పొందుతున్నారు. 5796 íసీరియల్ నంబర్ ద్వారా ఒంటరి మహిళగా పెన్షన్ పొందుతున్న మహిళ భర్తతోనే కలిసి జీవనం సాగిస్తోంది. ఎన్నికల సందర్భంలో కొందరు గ్రామాల నుంచి ఓటు కోసం ఇక్కడ నమోదు చేయించుకొని పెన్షన్లు కూడా ఇప్పించారని ఆరోపణలు ఉండగా, కొందరు పైరవీ కారులు నిత్యం ఇదే పనిలో ఉంటున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment