మునగాల సుధాకర్‌రెడ్డి
నాంపల్లి (మునుగోడు) : 29సంవత్సరాలుగా బోధనావృత్తిలో కొనసాగి రిటైర్డ్ అయిన ఆ ఉపాధ్యాయుడిని ఆ ఊరి ప్రజలు చందాలు వేసుకుని సర్పంచ్‌గా గెలించారు. వివరాల్లోకి వెళితే.. నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌ను ఈ సారి గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఇందుకు తీర్మానాలు సైతం చేశారు. దీంతో 95శాతం మంది గ్రామస్తులు మునగాల సుధాకర్‌రెడ్డికి మద్దతు తెలిపారు. కానీ కొందరు నామినేషన్ వేసిన కారణంగా గ్రామస్తులంతా ముందుకొచ్చి ఎలాగైనా సుధాకర్‌రెడ్డిని సర్పంచ్‌గా గెలిపించుకోవాలని ఇంటికి తమకు తోసినంతా చందాలు వేశారు. మొత్తంగా రూ.లక్ష 7వేలు జమ చేశారు.
వీటిలోనుంచే రూ.2వేలు నామినేషన్, రూ.3,700 పేపర్లు, వాల్ పోస్టర్లకు ఖర్చు చేశారు. గ్రామంలో 1,118 ఓట్లు ఉంటే అందులో 970 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సుధాకర్‌రెడ్డి 880ఓట్లు సాధించారు. దాదాపు 800 ఓట్ల మెజారిటీ వచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటే ఈ గ్రామస్తులు మాత్రం ఓ మంచి వ్యక్తిని సర్పంచ్‌గా నిలబెట్టి తమ సొంతఖర్చుతో గెలి పించుకోవడం గొప్ప విశేషం. సుధాకర్‌రెడ్డి తండ్రి మునగాల రాంరెడ్డి ఉమ్మడి ఆంధ్రాప్రదేశ్ రాష్ట్రంలో 1956లో మొట్ట మొదటిగా ఏర్పడిన గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయ్యి 1978 వరకు సేవలందించారు. ఇప్పుడు ఆయన కొడుకు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో సర్పంచ్‌గా గెలిపించిన గ్రామప్రజల రుణం తీర్చుకుంటా. గ్రామాభివృద్ధికి పాటుపడాను. గ్రామానికి బస్సు వచ్చేలా కృషి చేస్తా. గ్రామాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment