
సాక్షి, మనోహరాబాద్/వెల్దుర్తి : ‘ఇప్పటికే మా గ్రామాలకు పిల్లనివ్వమని చెబుతున్నారు. గర్భిణులు ఊరు వదిలి వెళ్తున్నారు. పుట్టే బిడ్డలు బలహీనంగా పుడుతున్నారు. గాలి, నీరు కలుషితం అవుతున్నాయి. రోగాల బారిన పడుతున్నాం. ప్రాణాలు పోతున్నాయి. ఉన్న పరిశ్రమతోనే చస్తుంటే విస్తరణ పేరిట సభలు పెడతారా.. విస్తరణ చేపడితే బలిదానాలే శరణ్యం’ అంటూ మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం, రంగాయపల్లి గ్రామస్తులు తేల్చి చెప్పారు.
పరిశ్రమ విస్తరణ చేపట్టొద్దని అధికారులకు దరఖాస్తు పెట్టుకోగా గురువారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో పరిశ్రమ సమీపంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జేసీ నాగేష్, పీసీబీ ఈఈ రవికుమార్, ఆర్డీఓ శ్యాంప్రకాష్, పంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ విస్తరణపై ప్రజలు తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పాలన్నారు.
పరిశ్రమతో కలిగే లాభనష్టాలపై ప్రజలు చెప్పిన ప్రతి అంశాన్ని రికార్డ్ చేసి, ప్రతి ఫిర్యాదును కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు నివేదిస్తామన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. పరిశ్రమ ఏర్పాటైన నాటి నుంచి 14 ఏళ్లుగా రోగాల బారిన పడుతున్నారని, ప్రాణాలు విడుస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమను విస్తరిస్తే తమను ఎటైనా పంపండి అని ఆందోళన వ్యక్తం చేశారు.
పరిశ్రమతో మాకెలాంటి ఉపయోగం లేదు..
పరిశ్రమ స్థాపిస్తే గ్రామానికి నిధులు వస్తాయి, ఉపాధి కలుగుతుందని అశగా ఎదురు చూసిన మాకు రోగాలు, మసిబారిన బతుకులు వచ్చాయని, పంచాయతీకి నిధులు వచ్చింది లేదన్నారు. నీటి కాలుష్యంతో సాగు చేయలేక పొరుగు గ్రామాలకు కూలి పనులకు వెళ్తున్నామని, పరిశ్రమ వద్దకు వెళ్తే కేసులు తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. అధికారులు వారం రోజులు స్థానికంగా ఉండి పరిస్థితులు తెలుసుకోవాలని, అప్పుడు తమ బాధలు తెలుస్తాయన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
పిల్లలను ఎలా సాకాలి..
పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యంతో మా ఆయనకు రోగం వచ్చి మరణించారు. ఉన్న సంపాదనంతా ఆసుపత్రి చుట్టూ తిరగడానికే ఖర్చయింది. పిల్లలను ఎలా సాకాలో అర్థం కాని పరిస్థితి ఉంది.
– కుంట లక్ష్మి, రంగాయపల్లి
ప్రజలను చంపడమే..
కాలుష్యం తో పంట లు లేవు. వృద్ధులు శ్వాసకోస వ్యాధులకు గురవుతున్నారు. పరిశ్రమలో డ్యూటీ అడిగితే జాడు కొట్టేది ఉందని చెబుతున్నారు. పరిశ్రమ విస్తరణ అంటే రెండూళ్ల ప్రజలను చంపడమే.
– విఠల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ