
నిరసన తెలుపుతున్న నాయకులు
గోపాల్‌పేట (వనపర్తి): రేవల్లి మండలంలోని బండరాయిపాకులలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏదుల గ్రామస్తులకు పరిహారం అందలేదని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్పీ వనపర్తి జిల్లా అసెంబ్లీ ఇన్‌చార్జ్ మహేష్ మాట్లాడుతూ పాలమూరు– రంగారెడ్డి బ్యాలెన్సింగ్ ఏదుల రిజార్వాయర్ మునకకు గురవుతుందని, ఏదుల గ్రామంలో రిజర్వాయర్ పనులు గత రెండున్నరేళ్లుగా కొనసాగుతున్నా ఇంత వరకు పరిహారం అందలేదన్నారు.
గ్రామంలో ఇంకా 60 ఎకరాలకు పరిహారం రావాల్సి ఉందన్నారు. గ్రామంలో ఇళ్ల సర్వే చేసి దాదాపుగా రెండు నెలలు గడుస్తున్నా ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఆరోపించారు. ఇళ్ల సర్వే చేసినప్పుడు రేవల్లి తహసీల్దార్, వనపర్తి ఆర్డీఓలు 15 రోజుల్లో పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు చిల్లిగవ్వ కూడా చెల్లించలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పరిహారం చెల్లించే దాకా పనులు జరగనివ్వమని తెగేసి చెప్పారు. కార్యక్రమంలో బీఎస్పీ గ్రామ అధ్యక్షుడు దేవేందర్, నాయకులు స్వామి, రాములు, మధు, హుస్సేన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment