స్వచ్ఛభారత్ నిర్వహణ భేష్
- ఎంతటి అభివృద్ధి అయినా ప్రణాళికతో సాధ్యం
- పల్లెల ప్రగతికి ప్రధాని మోదీ ప్రాధాన్యం
- జిల్లాలో పర్యటించిన నీతి ఆయోగ్ జాతీయ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లా ప్రజలు స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ఇస్తున్న ప్రాధాన్యం అందరికీ ఆదర్శమని నీతిఆయోగ్ జాతీయ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా కితాబిచ్చారు. ఎంతటి అభివృద్ధి అయినా ప్రణాళికతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పల్లెల ప్రగతి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు. గురువారం ఆయన జిల్లాలోని వివిధ ప్రాం తాల్లో విసృ్తతంగా పర్యటించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి అబ్బురపడ్డారు. షాద్‌నగర్ మండలంలోని కిసన్‌నగర్‌లో ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించుకున్న తీరును తెలుసుకున్న ఆయన గ్రామస్తులను అభినందించారు.
స్థానిక ఉన్నతపాఠశాలలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. అంతకుముందు ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా జిల్లాలోని కొత్తూరు మండలం నందిగామకు చేరుకున్న అరవింద్ పనగారియాకు రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ టీకే శ్రీదేవి, జేసీ రాంకిషన్ ఘనస్వాగతం పలికారు.
నందిగామలో మిషన్‌కాకతీయ పథకం కింద దాదాపు రూ.86లక్షలతో మరమ్మతు చేపట్టిన చిన్నయ్య చెరువును పరిశీలించారు. ఆయకట్టు వివరాలను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. చెరువులకు మరమ్మతులు చేయడం ద్వారా రైతులకు అవసరమైన సాగునీరు అందుతుందని ఎస్.నిరంజన్‌రెడ్డి వివరించారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాల ప్రయోజనాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు.
షాద్‌నగర్ మండలం రాయికల్‌లో ఉద్యానవన నర్సరీని సందర్శించి.. మొక్కలు పెంచుతున్న తీరును పరిశీలించారు. రైతులకు వస్తున్న లాభాలు, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, మార్కెట్ సౌకర్యం తదితర వాటిపై అధికారులు వివరిస్తున్నంత సేపు ఆసక్తిగా ఆలకించారు. ప్రభుత్వం మంజూరుచేసిన రూ.8లక్షల చెక్కును కిషన్‌నగర్ గ్రామసర్పంచ్‌కు అరవింద్ పనగారియా అందించారు. కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్ బీపీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.