హైదరాబాద్: పాత కక్షలతో ఓ వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి చంపిన సంఘటన చంద్రాయణ గుట్ట పరిధిలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. చంద్రాయన్గుట్ట పరిధిలోని తాళ్లకుంటకు చెందిన చోర్ షకీల్(30) చిన్న చిన్న నేరాలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. బుధవారం రాత్రి తాళ్లకుంట వద్ద నాసర్ అనే వ్యక్తితో భేటీ అయిన షకీల్ అర్ధరాత్రి దాటాక శవమై కనిపించాడు. అతని శరీరంపై 15 కత్తిపోట్లు ఉండటంతో పాత కక్షల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు పలువురు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టింది నాసర్ గ్యాంగ్ అయివుండొచ్చు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.