ఉస్మానియా యూనివర్సిటీ: గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో నెలకొల్పిన ఉస్మానియా విశ్వవిద్యాలయ పీజీ కేంద్రాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఒకవైపు సిబ్బంది, మరోవైపు మౌలిక వసతుల లేమితో కునారిల్లుతున్నాయి. దీంతో పలు పీజీ కోర్సులను సైతం రద్దు చేసిన స్థితికి దిగజారాయంటే ఇవి ఎంతటి దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అధ్యాపకుల కొరత, అసౌకర్యాల కారణంగా కోర్సుల్లో విద్యా ర్థులు చేరడం లేదు. పీజీ కేంద్రాల భవనాల అద్దెలు, సిబ్బంది వేతనాల వ్యయం భరించలేని స్థితిలో ఓయూ ఆర్థిక పరిస్థితి దీనంగా మారింది. దీంతో ఓయూ పరిధిలోని ఐదు పీజీ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
సిబ్బంది విముఖత..
ఓయూ క్యాంపస్, అనుబంధ కాలేజీలు, కార్యాలయాల్లో పని చేస్తున్న అధ్యాపకులు, ఉద్యోగులు బదిలీలపై విముఖత కనబరుస్తున్నారు. ఒకవేళ బదిలీ జరిగినా జంట నగరాల కాలేజీలు, కార్యాలయాలకు మాత్రమే వెళ్లడానికి మాత్రమే వారు ఆసక్తి చూపుతున్నారు. జంట నగరాలు దాటి వెళ్లడానికి ససేమిరా అంటున్నారు. దీంతో వివిధ జిల్లాల్లోని 5 యూనివర్సిటీ పీజీ కేంద్రాలలో పర్మనెంట్ ఉద్యోగులు కొరత కారణంగా కాంట్రాక్టు సిబ్బందిపై పనిభారం పడుతోంది. ఓయూ ఉన్నతాధికారులు సరిపడా టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులను భర్తీ చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలున్నాయి. దీంతో జిల్లాల్లోని పీజీ కేంద్రాలను అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్నారు.
గెస్ట్ ఫ్యాకల్టీయే దిక్కు..
పీజీ కేంద్రాలపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినా అధికారులు మాత్రం సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు పీజీ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారు. ఆయా కేంద్రాల్లో అధ్యాపకులు లేక గెస్ట్ ఫ్యాకల్టీతోనే నెట్టుకొస్తున్నారు. విద్యార్థులు చేరకపోవడం, చేరినా ఫ్యాకల్టీ కొరతతో అడ్మిషన్లు రద్దు చేసుకోవడంతో కొన్ని కోర్సులను తొలగించాల్సి వస్తోంది. ఇటీవలే నర్సాపురం పీజీ కేంద్రంలో లైబ్రరీ సైన్స్ కోర్సును ర ద్దు చేశారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉండటం, నాన్ టీచింగ్ సిబ్బంది లేకపోవడం వెరసీ పీజీ కేంద్రాల్లో చేరే విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఓయూ అధికారులు పీజీ కేంద్రాలపై దృష్టి సారించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, సొంత భవనాలను నిర్మించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అన్నీ సమస్యలే..
ఓయూ పరిధిలోని సిద్దిపేట, మీర్జాపూర్, నర్సాపూర్, జోగిపేట, వికారాబాద్‌లలో పీజీ కోర్సులతో జిల్లా పీజీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ (ఇంగ్లిష్), ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), ఎంఏ జర్నలిజంతో పాటు లైబ్రరీ సైన్స్ కోర్సులు అందిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో ఉద్యోగుల కొరతతో పాటు సొంత భవనాలు, మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. పర్మనెంట్ ఉద్యోగులు వీటిలో పని చేసేందుకు అంతగా ఆసక్తి చూపడంలేదు. ఉద్యోగులు వివిధ అవసరాలు, సౌకర్యాల కోసం నగరంలోనే తిష్టవేస్తున్నారు. దీన్ని ఓయూ వీసీ కూడా సీరియస్‌గా తీసుకోకపోవడంతో సిబ్బంది కొరతతో పీజీ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వీటిని ప్రారంభించి ఏడేళ్లవుతున్నా ఇప్పటివరకూ వాటికి సొంత భవనాలే లేకుండాపోయాయి. విద్యార్థులకు కనీసం హాస్టల్ సౌకర్యం కూడా లేకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment