రాజమణికే రాజదండం | Picked up the majority of hospitals across predictably | Sakshi
Sakshi News home page

రాజమణికే రాజదండం

Published Sun, Jul 6 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

రాజమణికే రాజదండం

రాజమణికే రాజదండం

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఊహించినట్లుగానే జెడ్పీ చైర్మన్ పీఠాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజార్టీలేనప్పటికీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వెస్ చైర్మన్ పదవులతోపాటు రెండు కోఆప్షన్ పదవులను టీఆర్‌ఎస్ దక్కించుకుంది. ఊహించినట్లుగానే టీఆర్‌ఎస్ నర్సాపూర్ జెడ్పీటీసీ ఎర్రగొల్ల రాజమణి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ ఆధ్వర్యంలో శనివారం జెడ్పీ సమావేశమందిరంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీతాపాటిల్‌పై 12 ఓట్ల మెజార్టీతో రాజమణి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా నంగునూరు జెడ్పీటీసీ రాగుల సారయ్య ఎన్నికయ్యారు.
 
 కాంగ్రెస్ అభ్యర్థి సంగమేశ్వర్‌పై 12 ఓట్ల మెజార్టీతో సారయ్య వైస్ చైర్మన్‌గా గెలుపొందారు. కోఆప్షన్ సభ్యులుగా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎం.డి.అమీనుద్దీన్, ఎస్.డి.మొయిజుద్దీన్‌లు ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్‌లో స్పష్టమైన మెజార్టీ లేనప్పటికీ  కాంగ్రెస్, టీడీపీ జెడ్పీటీసీలు కూడా టీఆర్‌ఎస్‌కే మద్దతు తెలపడంతో అన్ని పదవులనూ అధికార పార్టీ సొంతం చేసుకుంది. మంత్రి హరీష్‌రావు వ్యూహాత్మక ఎత్తుగడల వల్లే ఎన్నిక ఏకపక్షంగా సాగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, టీడీపీకి చెందిన  నలుగురు జెడ్పీటీసీలను తమవైపు తిప్పుకోవటంలో హరీష్‌రావు సఫలీకృతులయ్యారు. దీనికితోడు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయకపోవటం, టీడీపీ కూడా చైర్‌పర్సన్,  వైస్ చైర్మన్ ఓటింగ్‌పై విప్ జారీ చేయకపోవడం టీఆర్‌ఎస్‌కు కలిసివచ్చింది.
 
 మొదట ప్రమాణస్వీకారం..
 అనంతరం కోఆప్షన్ ఎన్నిక
 జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఎలాంటి ఉత్కంఠ లేకుండా అంతా ఏకపక్షంగా సాగింది. ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 1 గంటకు జెడ్పీలో పరోక్ష విధానంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొదట టీఆర్‌ఎస్ జెడ్పీటీసీలు సమావేశమందిరంలోకి రాగా తర్వాత కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఇలా మొత్తం 46 మంది జెడ్పీటీసీలు హాజరయ్యారు.

 మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి, గీతారెడ్డిలు సమావేశానికి వచ్చారు. తొలుత ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తర్వాత కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది. కోఆప్షన్ సభ్యులుగా టీఆర్‌ఎస్ పార్టీ నుంచి కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ఎం.అమీనుద్దీన్, కోహీర్ మండలం కవేలి గ్రామానికి చెందిన ఎస్.డీ మొయిజుద్దీన్ నామినేషన్ వేశారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున ముర్తుజా అలీ, ఎం.ఎ.రశీద్ పోటీలో నిలిచారు. కోఆప్షన్ పదవులకు ఎన్నికలు నిర్వహించగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు అమనుద్దీన్, మొయిజుద్దీన్‌లకు మద్దతుగా 29 మంది జెడ్పీటీసీలు చేతులు ఎత్తారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థులు ముర్తుజాఅలీ, ఎం.ఎ.రషీద్‌లకు మద్దతుగా కేవలం 17 మంది జెడ్పీటీసీలు చేతులెత్తారు. దీంతో ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎం.డి అమీనుద్దీన్, ఎస్.డి.మొయిజుద్దీన్‌లు కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనట్లు ప్రకటించారు.  టీఆర్‌ఎస్ కోఆప్షన్ అభ్యర్థులకు  కాంగ్రెస్ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు జెడ్పీటీసీలు మద్దతు పలికారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ రెండు కోఆప్షన్ పదవులు కైవసం చేసుకుంది.
 
 ఏకపక్షంగా సాగిన ఎన్నిక  
 జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక ఏకపక్షంగా సాగింది. టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఆ పార్టీకి చెందిన రాజమణి చైర్‌పర్సన్‌గా, సారయ్య వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించగా, టీఆర్‌ఎస్ నుంచి చైర్‌పర్సన్ అభ్యర్థిగా నర్సాపూర్ జెడ్పీటీసీ రాజమణి పేరును మెదక్ జెడ్పీటీసీ లావణ్య ప్రతిపాదించగా, చేగుంట జెడ్పీటీసీ శోభారాణి బలపర్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా సునీతాపాటిల్ పేరును జహీరాబాద్ జెడ్పీటీసీ కిషన్‌రావు పవార్ ప్రతిపాదించగా, మునిపల్లి జెడ్పీటీసీ రజియుద్దీన్ బలపర్చారు.
 
దీంతో అధికారులు చైర్‌పర్సన్ పదవికి ఎన్నిక నిర్వహించగా రాజమణికి మద్దతుగా 29 మంది జెడ్పీటీసీలు చేతులు పెకైత్తి మద్దతు పలికారు. టీఆర్‌ఎస్‌కు చెందిన 21 మంది జెడ్పీటీసీలతోపాటు కాంగ్రెస్‌కు చెందిన జెడ్పీటీసీలు చిట్టిమాధురి(కొండపాక), జి.సుమన(తూప్రాన్), స్వప్న(పాపన్నపేట), సత్తయ్య(ములుగు), టీడీపీ జెడ్పీటీసీలు రామచంద్రం(జగదేవ్‌పూర్), పోచయ్య(వర్గల్), వెంకటేశ్‌గౌడ్(గజ్వేల్), శ్రీకాంత్‌గౌడ్(పటాన్‌చెరు) రాజమణి అభ్యర్థిత్వానికి మద్దతుగా చేతులు పైకి ఎత్తారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సునీతాపాటిల్‌కు కేవలం 17 మంది కాంగ్రెస్ జెడ్పీటీసీలు మాత్రమే చేతులు ఎత్తి మద్దతు పలికారు.
 
 దీంతో 12 ఓట్ల మెజార్టీతో రాజమణి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇక వైస్ చైర్మన్ పదవికి టీఆర్‌ఎస్ నుంచి నంగునూరు జెడ్పీటీసీ రాగుల సారయ్య, కాంగ్రెస్ నుంచి సదాశివపేట జెడ్పీటీసీ సంగమేశ్వర్ పోటీ పడ్డారు. సారయ్యకు 29 మంది మద్దతు తెలపగా, సంగమేశ్వర్‌ను 17 మంది జెడ్పీటీసీలు బలపర్చారు. దీంతో 12 ఓట్ల మెజార్టీతో రాగుల సారయ్య వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులు దక్కటంతో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాబూమోహన్, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డిలు చైర్‌పర్సన్ రాజమణి, వైస్ చైర్మన్ సారయ్యను అభినందించారు. చైర్‌పర్సన్ ఎన్నిక ముగిసిన వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, కిష్టారెడ్డి, జెడ్పీటీసీలు ప్రత్యేక సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement