
సాక్షి, మహబూబ్‌నగర్: పిల్లలమర్రి ఆవరణలోని జిల్లా పురావస్తుశాల పర్యాటకులను విశేషంగా ఆకర్శిస్తోంది. ఇటీవలే కొత్త భవనంలోకి శిల్పాలు, శిలలను తరలించారు. ఈ పురావస్తు ప్రదర్శనశాల నూతన శోభతో ఉట్టిపడుతోంది. ఇక్కడ అద్భుతమైన శిల్ప సంపదను భద్రపరిచారు. ఇందులో పూర్వపు రాజులు, రాణులు వాడిన వస్తువులతో పాటు పలు రకాల చారిత్రక ఆనవాళ్లుగా చెప్పబడే రాతి విగ్రహాలను భద్రపర్చారు. పది వేల ఏళ్ల కిందటి రాతివిగ్రహాలు ఉన్నాయి.
బౌద్ధ, జైన మతాలకు చెందిన బుద్ధుడు, వర్తమాన మహావీరుడి వంటి ఎన్నో విగ్రహాలు సందర్శకుల కోసం ఉంచారు. శాతవాహనుల కాలంలో వాడుకల్లో ఉన్న నాణేలను మ్యూజియంలో ఉంచారు. క్రీస్తుశకం 7వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దంలో రాష్ట్రకూటాలు, కల్యాణి చౌకాస్, కాకతీయ, కందూరి చోళుల కాలంలో నాటి శిల్పాలు అందుబాటులో ఉంచారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు ముంపులో బయటపడిన శిలాలను ఇక్కడే భద్రపరిచారు. ప్రత్యేకంగా విద్యుత్ వెలుగులో శిల్ప సంపద అద్భుతంగా కనిపిస్తోంది. జిల్లా పురావస్తు ప్రదర్శనశాల రూపురేఖలు మారడంతో పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
