pillalamarri
-
'700 ఏళ్ల పిల్లలమర్రి' చిగురించింది
-
పిల్లలమర్రికి పూర్వవైభవం
స్టేషన్ మహబూబ్‌నగర్: పురాతన పిల్లలమర్రి పూర్వస్థితికి తిరిగొచ్చేలా అటవీ శాఖ చేసిన కృషి ఫలించింది. సుమారు 700 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ చెట్టు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటోంది. నాడు 60 శాతం వరకు ఎండిపోయి నిలువ నీడనిచ్చే పరిస్థితి లేకుండా పోయిన మహావృక్షం ప్రస్తుతం 90 శాతం వరకు చిగురించిన ఆకులతో మళ్లీ కనులకు విందు చేస్తోంది. ఇదీ చరిత్ర: 700 ఏళ్ల క్రితం మొలకెత్తిన మర్రి మొలక క్రమేణా శాఖోపశాఖలుగా విస్తరించి క్రమేణా మొద లñæక్కడో అంతు చిక్కని మహా వృక్షంగా ఎదిగింది. జిల్లా కేంద్రం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మర్రి చెట్టును పర్యాటకులను అలరించేంది. దాని చల్లని నీడన ప్రజలు సేద తీరేవారు. పిల్లలతో పాటు యువత ఊడల్ని పట్టుకుని ఊగేవారు. మొత్తం మీద ఓ పర్యాటక ప్రదేశంగా ఈ చెట్టు దేశ, విదేశీయుల్ని ఆకర్షించింది. అయితే సుమారు ఏడేళ్ల క్రితం (2017న డిసెంబర్ 16)ఈ మహా వృక్షానికి సంబంధించిన భారీ కొమ్మ ఒకటి విరిగిపడింది. ఆ తర్వాత క్రమంగా మరికొన్ని కొమ్మలు విరిగిపడే దశకు చేరుకున్నాయి. దీంతో అటవీ అధికారులు దీనిపై దృష్టి సారించారు. ప్రత్యేక ట్రీట్మెంట్తో.. భారీ కొమ్మ విరిగిపడిన నేపథ్యంలో పిల్లలమర్రి పునరుజ్జీవం కోసం మెరుగైన చికిత్స అందించే బాధ్యతను అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోస్ అటవీ శాఖకు అప్పగించారు. 2017న డిసెంబర్ 20నే పర్యాటకులు ఊడలపై కూర్చోకుండా, వాటికి వేలాడకుండా ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. అటవీ శాఖ పరిశోధనా నిపుణుల సలహాలు, సూచనలతో ప్రత్యేక ట్రీట్మెంట్ను ప్రారంభించారు.పిల్లర్ల రక్షణలో పిల్లల మర్రికొమ్మలు, ఊడలు విరిగిపోకుండా, కిందికి పడకుండా అధికారులు వాటికి సహాయంగా పిల్లర్లు నిర్మించారు. 2018 ఫిబ్రవరి నుంచి సెలైన్ బాటిళ్లతో పిల్లలమర్రికి ప్రాణం పోసే చర్యలకు ఉపక్రమించారు. ఒక బాటిల్ నీళ్లలో 20 ఎంఎల్ క్లోరోపైరిపస్ మందును కలిపి పడిపోతున్న ఊడలకు కట్టారు. లీటర్ నీళ్లలో 5 ఎంఎల్ క్లోరోపైరిపస్ మందును కలిపి ఊడల కింది భాగంలో పిచికారీ చేశారు. చెదలు పట్టిన భాగాన్ని తీసివేసి సల్ఫర్ ఫాస్పేట్ చల్లారు. ప్రతి 15 రోజులకోసారి పంచగవ్వ, హ్యుబ్రిక్ యాసిడ్ కూడా పిచికారీ చేశారు. ఈ నేపథ్యంలో చిగురిస్తున్న ఊడలు త్వరగా పెరిగి చెట్లకు ఆధారంగా నిలిచేలా ఊడలకు ప్లాస్టిక్ పైపులు (రూట్ ట్రైనర్) బిగించారు. అందులో ఎర్రమట్టి, వర్మీ కంపోస్టు, కోకోపెట్, మాస్ (నాచు) నింపారు. దీంతో చెట్టుకు కొత్త ఊడలు వచ్చాయి.అయిదడుగుల కంచె.. సీసీ కెమెరాలుపిల్లలమర్రి మహావృక్షాన్ని సంరక్షించేందుకు అధికారులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. చెట్టు వద్దకు ఎవరూ వెళ్లకుండా, తాకకుండా చుట్టూ దాదాపు ఐదు అడుగుల ఎత్తున కంచె ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వాచర్లను నియమించారు. ఎవరైనా ఫెన్సింగ్ దూకి చెట్టు వద్దకు వెళ్లి తాకినా, ఆకులను తెంపినా ఫైన్ వేయనున్నారు. 2017 డిసెంబర్ తర్వాత మళ్లీ ఈ వారంలో పర్యాటకులను అనుమతించనున్నారు.రూ.40 లక్షల వ్యయంపిల్లలమర్రి చెట్టు ట్రీట్మెంట్కు, చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.40 లక్షలు వ్యయం చేశాం. సందర్శనకు వచ్చేవారు పిల్లలమర్రి చెట్టును ఫెన్సింగ్ అవతలి నుంచే చూడాలి. చెట్టును తాకడానికి వీల్లేదు. ఎవరైనా తాకితే జరిమానా విధిస్తాం. – సత్యనారాయణ, డీఎఫ్ఓ -
Pillalamarri: ఆసియాలోనే రెండో పెద్ద వృక్షం
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌లో ఉన్న పిల్లలమర్రి ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద వృక్షం అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని పిల్లలమర్రిని ఆయన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ కార్యక్రమం ప్రారంభం తర్వాత రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో హరితహారం విజయవంతమైనందుకే సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. ఈ మంచి కార్యంలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రోత్సహిస్తున్నారన్నారు. వివిధ కారణాల వల్ల మర్రి వృక్షం చనిపోయే దశకు రాగా కలెక్టర్లు, అటవీశాఖ తదితర శాఖల సహకారంతో పునర్జీవం ఇచ్చారన్నారు. జిల్లాలో గతేడాది 2 కోట్ల విత్తన బంతులను తయారు చేసి డ్రోన్ ద్వారా గుట్టలు, కొండలలో, బంజరు భూములలో చల్లించామన్నారు. అంతే కాక విత్తన బంతులతో అతిపెద్ద వాక్యాన్ని రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించామని, ఈ సంవత్సరం కూడా చల్లుతున్నామని తెలిపారు. అపురూపంగా చూసుకోవడం సంతోషం గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ పిల్లలమర్రి అభివృద్ధికి తనవంతుగా ఎంపీ నిధుల నుంచి రూ.2 కోట్లు మంజూరు చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని తన ట్విటర్లో సైతం పేర్కొన్నారు. 800 ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రిని అపురూపంగా చూసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మంత్రితో కలిసి పిల్లలమర్రి చెట్లు ఎక్కిన ఫొటోను ట్విటర్‌కు ట్యాగ్ చేశారు. వివిధ కారణాలతో పూర్తిగా పాడైపోయే దశకు చేరుకున్న పిల్లలమర్రి వృక్షానికి సెలైన్లు ఎక్కించి బతికించడమే కాక ప్రతి వేరును అభివృద్ధి చేస్తున్న మంత్రిని, అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర క్రీడా అధికార సంస్థ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమకు గుర్తుగా పుస్తకం రాసినా పట్టించుకోలేదని..
సాక్షి, సూర్యాపేట: ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి నిరాకరించిందని యువకుడు పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సూర్యపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ తర్వాత సదరు యువకుడు అపస్మారక స్థితిలో సూర్యపేట పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. వివరాలు.. సూర్యాపేటకు చెందిన ఇరుగు రామన్ హైదరాబాద్‌లో మల్టీ మీడియా రంగంలో వెబ్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. మునగాల మండలానికి చెందిన అనూష అనే యువతితో పరిచయం ఏర్పడింది. 10 సంవత్సరాల నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. కాగా అనూష సూర్యపేట జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తుంది. అయితే ఉద్యోగం వచ్చిన తరువాత అనూష తనను పట్టించుకోవడం లేదని రామన్ మనస్తాపానికి గురయ్యాడు. అయితే అనూషతో 10 సంవత్సరాల ప్రేమకు గుర్తుగా ఒక పుస్తకాన్ని రాసి దానిని తన మిత్రులకు పంచిపెట్టాడు. పుస్తకాలు పంచి పెట్టి, కాల్ రికార్డింగ్‌లు వెబ్ సైట్ లో పెట్టి తన పరువుకు భంగం కలిగిస్తున్నాడని అనూష రామన్‌పై చివ్వేంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న రామన్ మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో సూర్యపేట పట్టణ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అయితే వెంటనే స్పందించిన పట్టణ పోలీసులు రామన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
మరో పిల్లల మర్రి!
పాలమూర్ జిల్లా, నవాబుపేట: పాలమూర్ జిల్లాలో మరో పిల్లలమర్రి వెలుగులోకి వచ్చింది. వందల ఏళ్ల క్రితం ఏర్పడ్డ మర్రి చెట్టు ఉన్న కొత్తపల్లి అప్పట్లో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండటం, జిల్లాకేంద్రానికి దూరం కావటంతో మరుగునపడింది. కొత్త జిల్లాల ఏర్పాటులో ఈ గ్రామం నవాబుపేట మండలంలోకి వచ్చింది. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అందంగా కనిపిస్తోంది. మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్లు, జిల్లాకేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ మహావృక్షం ఉంది. ఈ చెట్టు నీడన ఆంజనేయస్వామి ఆలయం.. ఆలయానికి ఎదురుగానే వృక్షం మొదలు ఉంది. ఈ ప్రాంతాన్ని కూడా పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేయాలని మండలవాసులు కోరుతున్నారు. గోసాయి మర్రిగా.. గతంలో ఈ వృక్షం కింద గోసాయిలుగా పిలవబడే సాధువులు చాలామంది తపస్సు చేస్తూ ఈ ప్రాంతవాసులకు కనిపించటంతో గోసాయి మర్రిగా పిలుస్తారు. నాటి ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ఆర్ల దృష్టికి ఈ మర్రి గురించి వివరించామని.. అప్పటి పరిస్థితుల్లో వెలుగులోకి రాలేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుత పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. అభివృద్ధి చేయాలి.. చరిత్ర గల మర్రి చెట్టు. ఇప్పటికే చాలావరకు అంతరించింది. ఆదరణ లేకపోతే మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. చెట్టు నీడన పురాతన ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. పర్యాటక మంత్రి చొరవ చూపితే అభివృద్ధి చెందుతుందని మా ఆకాంక్ష. – నీరజారెడ్డి, సర్పంచ్, కొత్తపల్లి -
పిల్లలమర్రిలో ఆకట్టుకునే శిల్పసంపద
సాక్షి, మహబూబ్‌నగర్: పిల్లలమర్రి ఆవరణలోని జిల్లా పురావస్తుశాల పర్యాటకులను విశేషంగా ఆకర్శిస్తోంది. ఇటీవలే కొత్త భవనంలోకి శిల్పాలు, శిలలను తరలించారు. ఈ పురావస్తు ప్రదర్శనశాల నూతన శోభతో ఉట్టిపడుతోంది. ఇక్కడ అద్భుతమైన శిల్ప సంపదను భద్రపరిచారు. ఇందులో పూర్వపు రాజులు, రాణులు వాడిన వస్తువులతో పాటు పలు రకాల చారిత్రక ఆనవాళ్లుగా చెప్పబడే రాతి విగ్రహాలను భద్రపర్చారు. పది వేల ఏళ్ల కిందటి రాతివిగ్రహాలు ఉన్నాయి. బౌద్ధ, జైన మతాలకు చెందిన బుద్ధుడు, వర్తమాన మహావీరుడి వంటి ఎన్నో విగ్రహాలు సందర్శకుల కోసం ఉంచారు. శాతవాహనుల కాలంలో వాడుకల్లో ఉన్న నాణేలను మ్యూజియంలో ఉంచారు. క్రీస్తుశకం 7వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దంలో రాష్ట్రకూటాలు, కల్యాణి చౌకాస్, కాకతీయ, కందూరి చోళుల కాలంలో నాటి శిల్పాలు అందుబాటులో ఉంచారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు ముంపులో బయటపడిన శిలాలను ఇక్కడే భద్రపరిచారు. ప్రత్యేకంగా విద్యుత్ వెలుగులో శిల్ప సంపద అద్భుతంగా కనిపిస్తోంది. జిల్లా పురావస్తు ప్రదర్శనశాల రూపురేఖలు మారడంతో పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. -
ఊడలమర్రికి ఊపిరి!
ఉమ్మడి పాలమూరు జిల్లా చరిత్రకు తలమానికంగా నిలిచిన పిల్లలమర్రి సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. 750 ఏళ్ల చరిత్ర కలిగిన ఊడలమర్రి శాఖోపశాఖలుగా రూపాంతరం చెంది మొదలు చిక్కని చెట్టుగా ఎదిగింది. విశాలంగా ఎదిగిన ఈ మహావృక్షం పర్యాటకులకు ఎంతగానో ఆహ్లాదం పంచిం ది. చెదల కారణంగా శాఖలన్నీ విరిగిపోయే దశకు చేరుకున్నాయి. కలెక్టర్ ప్రత్యేక చొరవతో ట్రిట్మెంట్ ఇప్పిస్తున్నారు. మరోవారం రోజుల్లో సందర్శకులకు విడిదికేంద్రంగా మారనుంది. – స్టేషన్ మహబూబ్‌నగర్ పిల్లలమర్రికి సంబంధించిన ఓ ప్రధాన భారీ కొమ్మ గతేడాది డిసెంబర్ 16న విరిగిపడింది. చెట్టు ఆవరణలోని మరికొన్ని కొమ్మలు విరిగిపడే దశకు చేరుకున్నాయి. వెంటనే అధికారులు స్పందించి చెట్టుకు ట్రీట్మెంట్ను ప్రారంభించారు. విరిగిన కొమ్మవద్ద గోడ కట్టి ఎర్రమట్టితో కప్పారు. చెట్టుకు పూర్తిస్థాయిలో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పిల్లలమర్రిలో పర్యాటకులకు అనుమతించాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆదేశించారు. దీంతో డిసెంబర్ 20న పిల్లలమర్రిని మూసివేశారు. పిల్లలమర్రి ట్రీట్మెంట్ బాధ్యతను అటవీశాఖకు అప్పగించారు. పిల్లలమర్రి పరిరక్షణకు అటవీశాఖ అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. కొమ్మలు విరుగుతున్న చోట సహాయంగా పిల్లర్లు కట్టారు. చెట్టుకు ప్రత్యేక ట్రీట్మెంట్ నిర్వహిస్తున్నారు. సెలైన్లతో క్లోరోపైరిపస్ మందును అందిస్తున్నారు. చెట్టు వేళ్లలో ఇదే మందును వాడుతున్నారు. చెదలు పట్టిన భాగాన్ని తీసివేసి సల్ఫర్ఫాస్పెట్ను చల్లుతున్నారు. స్టేషన్ మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికే తలమానికంగా నిలిచిన పిల్లలమర్రి(ఊడలమర్రి) 750ఏళ్ల క్రితం మొలకెత్తిన మర్రి మొలక శాఖోపశాఖలుగా రూపాంతరం చెంది అంతుచిక్కని మహా వృక్షంగా ఎదిగింది. నాలుగెకరాల్లో విస్తరించిన మహా(మర్రి)వృక్షం పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ప్రజలకు చల్లటి నీడనిస్తూ వారిని తన నీడలో సేద తీరేందుకు పిల్లలమర్రి తన ఒడిలో చేర్చుకుంటోంది. జిల్లా కేంద్రం నుంచి 5కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి పిక్నిక్ స్పాట్‌గా అందరిని అలరిస్తుంది. అతిపెద్ద ఆకుపచ్చ గొడు గులాంటి ఈ భారీ మర్రివక్షం వయస్సు సుమారు 750ఏళ్లు ఉంటుందని చెబుతారు. ఈ చెట్టు కింద ఒకేసారి వెయ్యిమంది హాయిగా సేద తీరొచ్చు. వారంరోజుల్లో పర్యాటకులకు అనుమతి చెట్టుకు అందిస్తున్న ట్రీట్మెంట్ చివరిదశకు చేరింది. మరో వారం రోజుల్లో ట్రీట్మెంట్ను పూర్తిచేసి పర్యాటకులను అనుమతించడానికి అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పిల్లలమర్రికి పూర్వవైభవం వస్తుండడంతో పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
‘పిల్లలమర్రి’కి ఎంత కష్టం
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలో రెండో అతిపెద్ద మర్రి చెట్టు ‘పిల్లలమర్రి’కి సెలైన్స్ ఎక్కిస్తున్నారు. చెట్లను తొలిచే పురుగుబారిన పడిన పిల్లలమర్రి భారీ కొమ్మలను కోల్పోయింది. దీంతో గతేడాది డిసెంబర్ నుంచి పిల్లలమర్రి సందర్శనను నిలిపివేశారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన పిల్లల మర్రిలోని ఒక భాగం పురుగు బారిన పడి కిందకు పడిపోయింది కూడా. ప్రమాదకరంగా పరిణమిస్తున్న పురుగును అంతం చేసేందుకు చెట్టు మొదలుకు ఎక్కించిన రసాయనం ప్రభావం చూపలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా పిల్లలమర్రికి సైలైన్ల ద్వారా కీటక సంహార మందును ఎక్కిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో గల పిల్లలమర్రి వయసు దాదాపు 700 ఏళ్లు. మర్రిచెట్టు ప్రతి రెండు మీటర్లకు ఒక సెలైన్‌ను అధికారులు ఎక్కిస్తున్నారు. దీంతో వందల కొద్దీ సెలైన్ బాటిళ్లు చెట్టుకు వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. కాగా, సైలెన్ల ద్వారా ఇస్తున్న చికిత్స ప్రభావం చూపుతోందని అధికారులు చెబుతున్నారు. -
'మూడు నెలలు అనుమతి ఇవ్వొద్దు'
సాక్షి, స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాకే తలమానికమైన పిల్లలమర్రి చెట్టు ప్రాభవం రోజురోజుకు తగ్గిపోతోంది. ఒకప్పుడు పచ్చని గొడుగులా ఉండి పర్యాటకులను అహ్లదాన్ని పంచిన మర్రిచెట్టు ప్రస్తుతం కళాహీనంగా మారింది. గతంలో ప్రతిరోజు వందల్లో వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రస్తుతం పదుల సంఖ్యలో కూడా కనిపించడం లేదు. నిర్వహణ లోపంతో పిల్లలమర్రి చెట్టు ఆవరణ అంతా చెత్తాచెదారంతో నిండగా.. ఆవరణలో పచ్చని చెట్ల జాడే కనిపించడం లేదు. కొన్ని కొమ్మలు గతంలోనే కిందపడి ఎండిపోగా.. తాజాగా ఆదివారం భారీ ఊడ నేలకూలింది. దీంతో పిల్లలమర్రి నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. జిల్లా పర్యాటకశాఖ నిర్లక్ష్యం... పిల్లలమర్రి చెట్టు నిర్వహణ బాధ్యతలను కొన్నేళ్ల నుంచి జిల్లా పర్యాటకశాఖ చూసుకుంటోంది. అయితే, పర్యాటకశాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో ఉమ్మడి జిల్లాకే తలమానికంగా ఉన్న పిల్లలమర్రి ఆదరణ కోల్పోతోంది. గత ఏడాది నుంచి పిల్లలమర్రిలోని ఊడలు, కొమ్మలకు చెదలు పట్టినా పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అవి విరిగిపడే దశకు చేరుకుంటున్నాయని పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల నుంచే.. పిల్లలమర్రి సంరక్షణపై పర్యాటకశాఖ అధికారులు ఆలస్యంగా స్పందించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరు నెలల నుంచే ట్రీట్మెంట్ ప్రారంభించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని పర్యాటకులు భావిస్తున్నారు. రెండు నెలల నుంచి ట్రీట్మెంట్ నిర్వహిస్తున్నా భారీసైజు కొమ్మలు విరుగుతుండడపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో మయూరి నర్సరీ అభివృద్ధిపై దృష్టి పెట్టిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఏళ్ల నుంచి జిల్లాకు ‘ల్యాండ్‌మార్క్’గా ఉన్న పిల్లలమర్రిని నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లా వాసుల కోసం మయూరి నర్సరీలో ఈవెంట్లు ఏర్పాటుచేయడం మంచిదే అయినా.. పిల్లలమర్రిని సైతం పట్టించుకోవాలని సూచిస్తున్నారు. తగిన చర్యలు చేపడుతాం : కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పిల్లలమర్రిలో విరిగిపడిన కొమ్మను కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సోమవారం పరిశీలించారు. కొమ్మ పడిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలమర్రి ఆవరణను పరిశీలించి చెట్టుకు అందిస్తున్న ట్రీట్మెంట్ వివరాలపై ఆరాతీశారు. పిల్లలమర్రిలో ట్రీట్మెంట్ చర్యలు చేపట్టి మూడు నెలల్లో పూర్తి చేయాలని.. అప్పటివరకు సందర్శకులను చెట్టు వద్దకు అనుమతించకుండా పర్యాటక కేంద్రంలోని మిగిలిన ప్రదేశాలకు అనుమతించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 700 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యాటకులు కొమ్మలపై కూర్చోవడం, నిలబడడం వల్ల చెట్టు కొమ్మలు పడిపోవడానికి కారణమంగా ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా పడిపోయిన కొమ్మ వద్ద మట్టిని నింపి ట్రీట్మెంట్ చేపట్టడంతో పాటు మిగతా ఏ కొమ్మ కూడా విరగకుండా చూస్తామని వెల్లడించారు. -
చరిత్ర సాక్ష్యానికి చెదలు
స్టేషన్ మహబూబ్‌నగర్ : పాలమూరు.. ఆ పేరు వినగానే ఠక్కున గుర్తుకొచ్చేది ఆ మహావృక్షమే (పిల్లలమర్రి). ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తలమానికం. పర్యాటకులకు చల్లటి నీడనిస్తూ.. ఆహ్లాదం పంచుతూ వారిని తన ఒడిలో చేర్చుకుని సేద తీర్చుతోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ మర్రిచెట్టుకు నిర్లక్ష్యపు చెదలు ఆవహించింది. ఊడలు ఒక్కొక్కటిగా కూకటివేళ్లతో కూలిపోతున్నాయి. సుమారు 750 ఏళ్ల క్రితం మొలకెత్తిన చిన్నపాటి మర్రి మొలక శాఖోపశాఖలుగా రూపాంతరం చెంది మొదలు ఎక్కడుందో తెలియని మహాధీశాలిగా ఎదిగింది. నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మహావృక్షం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి 5 కి.మీ. దూరంలో ఉన్న పిల్లలమర్రి పిక్నిక్ కేంద్రంగా అందరినీ అలరిస్తోంది. ఈ వృక్షం కింద ఒకేసారి వెయ్యి మంది వరకు సేదదీరొచ్చు. ఏడు తరాలకు సజీవసాక్ష్యంగా నిలిచిన పిల్లలమర్రిని సందర్శించేందుకు జిల్లా నలుమూలలు, హైదరాబాద్, కర్నూలు, కర్ణాటక, రాయిచూర్ జిల్లాల నుంచి పర్యాటకులు అనునిత్యం వందల సంఖ్యలో వస్తుంటారు. అయితే పిల్లలమర్రి వృక్ష సముదాయం నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఏడాది కాలంగా చెట్టు ఎండిపోతోంది. ప్రధానంగా నీటి సమస్యతో వేసవిలో కొమ్మలు ఎండిపోతుండడంతో పాటు మరికొన్ని కొమ్మలు నేలకూలుతున్నాయి. దీంతో 60 శాతం చెట్టు పూర్తిగా నీడలేకుండా పోయింది. పిల్లలమర్రి చెట్టు రక్షణ కోసం కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రత్యేక దృష్టి సారించారు. వరంగల్ ఫారెస్ట్‌శాఖ రీసెర్చ్ సైంటిస్ట్ కిరణ్ పర్యవేక్షణలో చెట్టుకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ప్రారంభించారు. నెల రోజులుగా ఆ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి పిల్లలమర్రిలోని దర్గా సమీపంలోగల ఓ భారీసైజుగల కొమ్మ ఒక్కసారిగా పెద్దశబ్ధంతో విరిగిపడి పోయింది. కొన్ని వేర్లతోపాటు కొమ్మ నిమిషాల్లోనే నేలకూలింది. ఆ సమయంలో అక్కడ జనసంచారం లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పినట్లయింది. పిల్లలమర్రిని పట్టించుకోకపోతే మరో ఐదేళ్లలో పూర్తిగా ఎండిపోయి కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని, చెట్టును కాపాడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. యథాస్థితికి తీసుకొస్తాం.. పిల్లలమర్రిలోని ఓ ఊడ ఒరిగింది. భూమిలోని వేళ్లకు ఏ ప్రమాదం లేదని తెలుస్తోంది. ఊడలోపలి మట్టిని నింపి ట్రీట్మెంట్ ప్రారంభిస్తాం. దీంతో ఊడ మళ్లీ యథాస్థితికి వచ్చే అవకాశం ఉంది. దానిచుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం. పిల్లలమర్రి సముదాయం పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. – పాండురంగారావు, జిల్లా పర్యాటక అధికారి -
పిల్లలమర్రి.. డోంట్ వర్రీ!
స్టేషన్ మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లాకు చిహ్నంగా ఉన్న పిల్లలమర్రికి పూర్వవైభవం రానుంది. కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రత్యేక శ్రద్ధతో మరమ్మతులు చేయిస్తున్నారు. వరంగల్ ఫారెస్ట్‌శాఖ రీసెర్చ్ సైంటిస్టు కిరణ్ పర్యవేక్షణలో చెట్టుకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. నేలకు తాకిన మర్రిచెట్టు కొమ్మల చుట్టూ గుంతను తవ్వి మట్టిని తీసి కొన్ని రకాల కెమికల్స్‌ను కలిపారు. అలాగే సున్నంలోనూ కెమికల్స్ కలిపి మొదళ్ల వద్ద వేశారు. నాలుగు రోజుల నుంచి ఈ ట్రీట్మెంట్ పనులు కొనసాగుతున్నాయి. కలెక్టర్ స్వయంగా పనులను పరిశీలిస్తున్నారు. అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. నిర్వహణ లేకపోవడమే సమస్య.. పిల్లలమర్రి చెట్టు నిర్వహణ గురించి పట్టించుకోకపోవడంతో గత ఏడాది నుంచి చెట్టు ఎండిపోతోంది. ప్రధానంగా నీటి సమస్య వల్ల వేసవిలో కొమ్మలు ఎండిపోయాయి. కొన్ని కొమ్మలు విరిగిపోతున్నాయి. దీంతో 60శాతం చెట్టు పూర్తిగా పాడైంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. ఫెన్సింగ్ ఏర్పాటు.. ట్రీట్మెంట్ అనంతరం పిల్లలమర్రిలోని చెట్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పర్యాటకులు చెట్టును తాకకుండా, కొమ్మలపై ఎక్కకుండా ఉండేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. పర్యాటకులు చెట్టు కింద సేదతీరడానికి పచ్చని గార్డెనింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇకపై ఒకే టికెట్... ఇక్కడ ఇప్పటివరకు పిల్లలమర్రి, సైన్స్ మ్యూజియం, మినీ జూపార్క్, ఆక్వేరియం, ఆర్కియాలజీ మ్యూజియంలకు వేర్వేరుగా టికెట్ తీసుకోవాల్సి ఉండేది. పర్యాటకుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇకపై అన్నింటికీ ఒకే టికెట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో దీన్ని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇదీ చరిత్ర.. పిల్లలమర్రికి 750ఏళ్ల చరిత్ర ఉంది. ఏడుతరాలకు సజీవసాక్ష్యంగా నిలుస్తోంది. మర్రి మొలక శాఖోపశాఖలుగా రూపాంతరం చెంది మహావృక్షంగా మారి నాలుగు ఎకరాలకు విస్తరించింది. రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. దీని నీడన ఏళ్లుగా ఎంతోమంది పర్యాటకులు సేదతీరుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి, పిక్నిక్ స్పాట్‌గా మారింది. దీంతో ఈ ప్రాంతానికి సాధారణ రోజుల్లో కన్నా సెలవుదినాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. పురావస్తు మ్యూజియం కూడా ఉండడంతో రోజంతా ఇక్కడ ఉల్లాసంగా గడుపుతారు. ఒకేసారి వెయ్యిమంది వరకు సేదతీరే అవకాశం ఉంది. చెట్టు వద్ద జరుగుతున్న ట్రీట్మెంట్ పనులు -
శివరాత్రికి పిల్లలమర్రి ముస్తాబు
సూర్యాపేట రూరల్ : సూర్యాపేట మండలంలోని పిల్లలమర్రి గ్రామంలోని శివాలయాలు శివరాత్రికి ముస్తాబవుతున్నాయి. గ్రామంలో ఈ నెల 26 నుంచి ఉత్సవాలు ప్రారంభమై ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ నిర్వాహకులు నామేశ్వర, త్రికుఠేశ్వర, ఎరుకేశ్వర ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దేవాలయ కమిటీ చైర్మన్ రాపర్తి సైదులుగౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని పిల్లలమర్రి గ్రామంలో ఐదు రోజుల పాటు శివరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. 26న ఆలయ ప్రవేశం, ఘంటానాధం, గణపతిపూజ, స్వస్తివాచనం, రక్షాబంధనబూత్విగ్వరణం, అంకురారోపణ, దేవతాహ్వానం, కలశస్థాపన, మంటప ఆరాధన, 27న మహాశివరాత్రి అభిషేకం, యాగశాలప్రవేశం, ధ్వజారోహణం, రాత్రి 3 గంటలకు స్వామి కల్యాణం, 28న రుద్రాభిషేకం, నవగ్రహహోమం, రాత్రి 3 గంటలకు రథోత్సవం, మార్చి1న పూర్ణాహుతి, రాత్రి అగ్నిగుండాలు, 2న అభిషేకం, త్రిశూల స్నానం, స్వామి వారి ఏకాంతసేవతో ఉత్సవాలు ముగియనున్నాయి.