పడిపోయిన ఊడను పరిశీలిస్తున్న కలెక్టర్ రొనాల్డ్‌రోస్
సాక్షి, స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాకే తలమానికమైన పిల్లలమర్రి చెట్టు ప్రాభవం రోజురోజుకు తగ్గిపోతోంది. ఒకప్పుడు పచ్చని గొడుగులా ఉండి పర్యాటకులను అహ్లదాన్ని పంచిన మర్రిచెట్టు ప్రస్తుతం కళాహీనంగా మారింది. గతంలో ప్రతిరోజు వందల్లో వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రస్తుతం పదుల సంఖ్యలో కూడా కనిపించడం లేదు. నిర్వహణ లోపంతో పిల్లలమర్రి చెట్టు ఆవరణ అంతా చెత్తాచెదారంతో నిండగా.. ఆవరణలో పచ్చని చెట్ల జాడే కనిపించడం లేదు. కొన్ని కొమ్మలు గతంలోనే కిందపడి ఎండిపోగా.. తాజాగా ఆదివారం భారీ ఊడ నేలకూలింది. దీంతో పిల్లలమర్రి నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.
జిల్లా పర్యాటకశాఖ నిర్లక్ష్యం...
పిల్లలమర్రి చెట్టు నిర్వహణ బాధ్యతలను కొన్నేళ్ల నుంచి జిల్లా పర్యాటకశాఖ చూసుకుంటోంది. అయితే, పర్యాటకశాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో ఉమ్మడి జిల్లాకే తలమానికంగా ఉన్న పిల్లలమర్రి ఆదరణ కోల్పోతోంది. గత ఏడాది నుంచి పిల్లలమర్రిలోని ఊడలు, కొమ్మలకు చెదలు పట్టినా పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అవి విరిగిపడే దశకు చేరుకుంటున్నాయని పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలల నుంచే..
పిల్లలమర్రి సంరక్షణపై పర్యాటకశాఖ అధికారులు ఆలస్యంగా స్పందించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరు నెలల నుంచే ట్రీట్‌మెంట్ ప్రారంభించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని పర్యాటకులు భావిస్తున్నారు. రెండు నెలల నుంచి ట్రీట్‌మెంట్ నిర్వహిస్తున్నా భారీసైజు కొమ్మలు విరుగుతుండడపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో మయూరి నర్సరీ అభివృద్ధిపై దృష్టి పెట్టిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఏళ్ల నుంచి జిల్లాకు ‘ల్యాండ్‌మార్క్’గా ఉన్న పిల్లలమర్రిని నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లా వాసుల కోసం మయూరి నర్సరీలో ఈవెంట్లు ఏర్పాటుచేయడం మంచిదే అయినా.. పిల్లలమర్రిని సైతం పట్టించుకోవాలని సూచిస్తున్నారు.
తగిన చర్యలు చేపడుతాం : కలెక్టర్ రోనాల్డ్‌రోస్
పిల్లలమర్రిలో విరిగిపడిన కొమ్మను కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సోమవారం పరిశీలించారు. కొమ్మ పడిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలమర్రి ఆవరణను పరిశీలించి చెట్టుకు అందిస్తున్న ట్రీట్‌మెంట్ వివరాలపై ఆరాతీశారు. పిల్లలమర్రిలో ట్రీట్‌మెంట్ చర్యలు చేపట్టి మూడు నెలల్లో పూర్తి చేయాలని.. అప్పటివరకు సందర్శకులను చెట్టు వద్దకు అనుమతించకుండా పర్యాటక కేంద్రంలోని మిగిలిన ప్రదేశాలకు అనుమతించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 700 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యాటకులు కొమ్మలపై కూర్చోవడం, నిలబడడం వల్ల చెట్టు కొమ్మలు పడిపోవడానికి కారణమంగా ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా పడిపోయిన కొమ్మ వద్ద మట్టిని నింపి ట్రీట్‌మెంట్ చేపట్టడంతో పాటు మిగతా ఏ కొమ్మ కూడా విరగకుండా చూస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment