స్టేషన్ మహబూబ్‌నగర్ : పాలమూరు.. ఆ పేరు వినగానే ఠక్కున గుర్తుకొచ్చేది ఆ మహావృక్షమే (పిల్లలమర్రి). ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తలమానికం. పర్యాటకులకు చల్లటి నీడనిస్తూ.. ఆహ్లాదం పంచుతూ వారిని తన ఒడిలో చేర్చుకుని సేద తీర్చుతోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ మర్రిచెట్టుకు నిర్లక్ష్యపు చెదలు ఆవహించింది. ఊడలు ఒక్కొక్కటిగా కూకటివేళ్లతో కూలిపోతున్నాయి. సుమారు 750 ఏళ్ల క్రితం మొలకెత్తిన చిన్నపాటి మర్రి మొలక శాఖోపశాఖలుగా రూపాంతరం చెంది మొదలు ఎక్కడుందో తెలియని మహాధీశాలిగా ఎదిగింది. నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మహావృక్షం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి 5 కి.మీ. దూరంలో ఉన్న పిల్లలమర్రి పిక్‌నిక్ కేంద్రంగా అందరినీ అలరిస్తోంది.
ఈ వృక్షం కింద ఒకేసారి వెయ్యి మంది వరకు సేదదీరొచ్చు. ఏడు తరాలకు సజీవసాక్ష్యంగా నిలిచిన పిల్లలమర్రిని సందర్శించేందుకు జిల్లా నలుమూలలు, హైదరాబాద్, కర్నూలు, కర్ణాటక, రాయిచూర్ జిల్లాల నుంచి పర్యాటకులు అనునిత్యం వందల సంఖ్యలో వస్తుంటారు. అయితే పిల్లలమర్రి వృక్ష సముదాయం నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఏడాది కాలంగా చెట్టు ఎండిపోతోంది. ప్రధానంగా నీటి సమస్యతో వేసవిలో కొమ్మలు ఎండిపోతుండడంతో పాటు మరికొన్ని కొమ్మలు నేలకూలుతున్నాయి. దీంతో 60 శాతం చెట్టు పూర్తిగా నీడలేకుండా పోయింది.
పిల్లలమర్రి చెట్టు రక్షణ కోసం కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రత్యేక దృష్టి సారించారు. వరంగల్ ఫారెస్ట్‌శాఖ రీసెర్చ్ సైంటిస్ట్ కిరణ్ పర్యవేక్షణలో చెట్టుకు ప్రత్యేకమైన ట్రీట్‌మెంట్ ప్రారంభించారు. నెల రోజులుగా ఆ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి పిల్లలమర్రిలోని దర్గా సమీపంలోగల ఓ భారీసైజుగల కొమ్మ ఒక్కసారిగా పెద్దశబ్ధంతో విరిగిపడి పోయింది. కొన్ని వేర్లతోపాటు కొమ్మ నిమిషాల్లోనే నేలకూలింది. ఆ సమయంలో అక్కడ జనసంచారం లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పినట్లయింది. పిల్లలమర్రిని పట్టించుకోకపోతే మరో ఐదేళ్లలో పూర్తిగా ఎండిపోయి కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని, చెట్టును కాపాడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.
యథాస్థితికి తీసుకొస్తాం..
పిల్లలమర్రిలోని ఓ ఊడ ఒరిగింది. భూమిలోని వేళ్లకు ఏ ప్రమాదం లేదని తెలుస్తోంది. ఊడలోపలి మట్టిని నింపి ట్రీట్‌మెంట్ ప్రారంభిస్తాం. దీంతో ఊడ మళ్లీ యథాస్థితికి వచ్చే అవకాశం ఉంది. దానిచుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం. పిల్లలమర్రి సముదాయం పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. – పాండురంగారావు, జిల్లా పర్యాటక అధికారి
Comments
Please login to add a commentAdd a comment