శివరాత్రికి పిల్లలమర్రి ముస్తాబు
సూర్యాపేట రూరల్ : సూర్యాపేట మండలంలోని పిల్లలమర్రి గ్రామంలోని శివాలయాలు శివరాత్రికి ముస్తాబవుతున్నాయి. గ్రామంలో ఈ నెల 26 నుంచి ఉత్సవాలు ప్రారంభమై ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ నిర్వాహకులు నామేశ్వర, త్రికుఠేశ్వర, ఎరుకేశ్వర ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దేవాలయ కమిటీ చైర్మన్ రాపర్తి సైదులుగౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని పిల్లలమర్రి గ్రామంలో ఐదు రోజుల పాటు శివరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు.
26న ఆలయ ప్రవేశం, ఘంటానాధం, గణపతిపూజ, స్వస్తివాచనం, రక్షాబంధనబూత్విగ్వరణం, అంకురారోపణ, దేవతాహ్వానం, కలశస్థాపన, మంటప ఆరాధన, 27న మహాశివరాత్రి అభిషేకం, యాగశాలప్రవేశం, ధ్వజారోహణం, రాత్రి 3 గంటలకు స్వామి కల్యాణం, 28న రుద్రాభిషేకం, నవగ్రహహోమం, రాత్రి 3 గంటలకు రథోత్సవం, మార్చి1న పూర్ణాహుతి, రాత్రి అగ్నిగుండాలు, 2న అభిషేకం, త్రిశూల స్నానం, స్వామి వారి ఏకాంతసేవతో ఉత్సవాలు ముగియనున్నాయి.