Mahakumbh: జన ప్రవాహమే కాదు.. ఇవి కూడా.. | Prayagraj Maha Kumbh Mela 2025 Review And Other Highlights Full Details | Sakshi
Sakshi News home page

Mahakumbh: జన ప్రవాహమే కాదు.. ఇవి కూడా..

Published Mon, Feb 24 2025 10:08 AM | Last Updated on Mon, Feb 24 2025 10:55 AM

Mahakumbh 2025 review and highlights full details

మహాకుంభమేళా.. ప్రపంచం యావత్తూ తరలివచ్చి, కనులారా వీక్షిస్తున్న మహాద్భుత ఉత్సవం. ప్రతీ 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా శివరాత్రి పర్వదినం అంటే ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ త్రివేణీ సంగమం వేదికగా ఈ మహోత్సవం జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు దేశవిదేశాల నుంచి తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ కుంభమేళా భారత్‌కు పలు కొత్త రికార్డులను కూడా అందించింది. మహాకుంభమేళా ముగుస్తున్న తరుణంలో ఈ ఉత్సవంలో మహోన్నతంగా నిలిచిన కొన్ని అంశాలివే..

విదేశీయుల భాగస్వామ్యం
మహాకుంభమేళా(Mahakumbh Mela)కు భారీగా జనం తరలివచ్చారు. 183 దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకూ కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించినవారి సంఖ్య 60 కోట్లను దాటింది. ఒక్క మౌని అమావాస్య నాడు ఏకంగా 10 కోట్లకుపైగా భక్తులు పవిత్ర స్నానం చేయడం విశేషం.

ఆధునిక సాంకేతికత
మహాకుంభమేళా డిజిటల్ మహా కుంభ్(Digital Maha Kumbh) దిశగా సాగింది. ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికతల సమ్మేళనంగా ఈ ఉత్సవం నిలిచింది. మహాకుంభమేళాలో  60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డిజిటల్‌ మోనిటరింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఏఐ, వీఆర్‌, ఏఆర్‌, లిడార్‌, ఎల్‌ఈడీ డిస్ప్లే, హోలోగ్రామ్‌ల వంటి అత్యాధునిక సాంకేతికతలు వినియోగించారు. భక్తులకు కట్టుదిట్టమైన భద్రతను అందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగించారు.

ఆకాశంలో అరుదైన దృశ్యం
మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. ఆ రోజున మహాశివరాత్రి(Mahashivratri) పర్వదినం కావడం విశేషం. ఆనాడు కుంభమేళాలో చివరి రాజ స్నానం ఆచరిస్తారు. మహా కుంభమేళా ముగింపు రోజున ఆకాశంలో  అరుదైన దృశ్యం కనిపించనుంది. సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలు ఒకేసారి కనిపించనున్నాయి. మహా కుంభమేళా ముగింపు రోజున బుధుడు, శుక్రుడు, శని, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్  మొదలైన ఏడు గ్రహాలు సూర్యునికి ఒక వైపున ఒకే వరుసలో కనిపించనున్నాయి. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం సౌర వ్యవస్థలో ఇటువంటి అరుదైన దృశ్యం  అత్యంత అరుదుగా కనిపిస్తుంది.

ఆర్థిక భాగస్వామ్యం
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభమేళాను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసి, అందుకు అనుగుణంగా ముందుకు సాగింది. యూపీ సర్కారు కుంభమేళా బడ్జెట్‌కు రూ. 6,382 కోట్లు కేటాయించింది. దీనిలో రూ. 5,600 కోట్లు ఈవెంట్‌ల నిర్వహణ , మౌలిక సదుపాయాల అభివృద్ధికి  వెచ్చించింది. మహాకుంభమేళా పూర్తయ్యేనాటికి యూపీ ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందనే అంచనాలున్నాయి. మహా కుంభమేళా కారణంగా స్థానికంగా ఉన్న చిన్న, పెద్ద వ్యాపారులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. 
 

ఇది కూడా చదవండి: Mahakumbh: మహాశివరాత్రికి చివరి పవిత్ర స్నానం.. సన్నాహాలివే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement