ప్రణాళిక సిద్ధం
గజ్వేల్: రెండున్నరేళ్ల క్రితం నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయినా... మౌలిక సదుపాయాలు లేక అల్లాడుతున్న గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ అభివృద్ధికి కార్యాచరణ మొదలైంది. ఈ నియోజకవర్గానికి ప్రాతి నిథ్యం వహిస్తున్న కేసీఆర్ ఈ పట్టణాన్ని దేశంలోనే ‘బంగారుతునక’గా మారుస్తానని బహిరంగ సభల్లో హామీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే తొలి దశగా గజ్వేల్ అభివృద్ధికి రూ.423 కోట్లతో ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు అందజేశారు. ఇందులో నగర పంచాయతీలో కల్పించాల్సిన మౌలిక వసతులతోపాటు రింగ్ రోడ్డు ప్రతిపాదనలున్నాయి.
సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్న సమీక్షకు తెలంగాణ మొత్తంలోని మున్సిపాలిటీల్లో గజ్వేల్ నగర పంచాయతీ కమిషనర్ సంతోష్‌కుమార్‌తోపాటు సిద్దిపేట కమిషనర్‌కు కూడా ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని గజ్వేల్ కమిషనర్ ధ్రువీకరిచారు. ఈ సందర్భంగా గజ్వేల్ అభివృద్ధి కోసం అందించిన ప్రణాళికలపై సమీక్షలో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. తొలి దశ ప్రణాళికలో రింగ్ రోడ్డు నిర్మాణానికి దాదాపుగా మార్గం సుగమం కాగా, మిగతా పనులకు నిధులు నిధుల మంజూరైతే గజ్వేల్‌కు మహర్దశ పట్టనుంది.