
ఇంకా అందని కేంద్ర సాయం
► 11 సాగు నీటి ప్రాజెక్టులకు రూ. 647 కోట్ల నిధుల కోసం నిరీక్షణ
► నిధుల అంశంపై త్వరలో కేంద్రంతో రాష్ట్ర అధికారుల చర్చలు
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద రాష్ట్రం నుంచి ఎంపికైన 11 పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అందాల్సిన సాయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రస్తుత ఏడాదిలో ఈ ప్రాజెక్టులకు మరో రూ. 647 కోట్లు అందాల్సి ఉన్నా అతీగతీ లేదు. మెజారిటీ ప్రాజెక్టులను ఈ ఏడాది చివరి నాటికి సిద్ధం చేయాల్సి ఉన్నా కేంద్ర సాయం అందకపోవడం, నాబార్డు ద్వారా అందాల్సిన రూ.5,810 కోట్ల రుణంపై స్పష్టత లేకపోవడం ప్రాజెక్టుల పనులకు ప్రతిబంధకంగా మారుతోంది.
సాయంపై ఎదురుచూపులే..
పీఎంకేఎస్‌వై కింద రాష్ట్రంలోని కొమరం భీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను కేంద్రం గుర్తించింది. వాటి నిర్మాణానికి రూ. 25,027 కోట్లు అవసరంకాగా ఇందులో రూ. 15,720.42 కోట్లను రాష్ట్రం ఇప్పటికే ఖర్చు చేసింది. మరో రూ. 9,306.75 కోట్ల నిధులను ఏఐబీపీ కింద సమకూర్చి ఆదుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ... కేంద్ర సాయం కింద రూ. 1108 కోట్లు, నాబార్డు రుణం ద్వారా రూ. 7,955 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించింది. ఇందులో 2016–17, 17–18లో కలిపి మొత్తంగా కేంద్ర సాయం కింద రూ. 1194.63 కోట్ల మేర ఇవ్వాల్సి ఉండగా గతేడాది రూ. 547.63 కోట్ల సాయం అందించింది. ఇందులో అత్యధికంగా దేవాదులకు రూ. 470 కోట్లు, భీమాకు రూ. 54 కోట్లు, ఎస్సారెస్పీ–2కు రూ. 17 కోట్ల మేర సాయం అందించింది.
అయితే ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ దేవాదులకు రూ. 496 కోట్లు, భీమాకు రూ. 107.49 కోట్లు, ఎస్సారెస్పీ–2కు రూ.31.34 కోట్లు, పెద్దవాగుకు రూ. 3.89 కోట్లు, గొల్లవాగుకు రూ. 8.23 కోట్లు కలిపి మొత్తంగా రూ. 647 కోట్ల మేర నిధులు ఇవ్వాల్సి ఉన్నా స్పందించడంలేదు. దీంతోపాటు నాబార్డు కింద రూ. 7,955 కోట్లను రుణంగా ఇచ్చేందుకు గతంలోనే ఆమోదం తెలిపిన కేంద్రం...ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,810 కోట్లు, తర్వాతి ఏడాది రూ. 1,463 కోట్లు, మరుసటి ఏడాది రూ. 681 కోట్ల మేర రుణం అందించేందుకు ఓకే చేసింది. అయితే ఇప్పటివరకు ఎంత రుణం ఇస్తుందనే అంశంపై స్పష్టత లేదు. నాలుగు రోజుల కిందట జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పీఎంకేఎస్‌వై పరిధిలో దేశవ్యాప్తంగా గుర్తించిన 99 ప్రాజెక్టులకు రూ. 9,020 కోట్ల నిధులను నాబార్డు ద్వారా 6 శాతం వడ్డీతో ఇవ్వడానికి మోదీ సర్కారు ఆమోదం తెలిపినా ఇందులో రాష్ట్ర ప్రాజెక్టులకు ఎంత మేర నిధులు అందుతాయనేది ఇంకా తెలియరాలేదు. దీనిపై త్వరలోనే రాష్ట్ర అధికారులు ఢిల్లీ వెళ్లి కేంద్రంతో చర్చలు జరుపనున్నారు.