ఎరువులే కాదు విత్తనాలూ కొనుక్కోవచ్చు
♦ రూ.4 వేల సాయంపై మంత్రి పోచారం స్పష్టీకరణ
♦ కౌలు రైతులకూ న్యాయం చేస్తామని వెల్లడి
♦ గ్రామ సభల ద్వారా రైతుల జాబితా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు రూ. 4 వేల సాయం కేవలం ఎరువుల కోసమే కాదనీ, ఆ సొమ్మును సీజన్ ప్రారంభంలో విత్తనాలు, ఇతరత్రా అవసరాలకు పెట్టుబడి ఖర్చుగా రైతులు ఉపయోగించుకోవచ్చని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఆధ్వర్యంలో డీసీసీబీ అధ్యక్షులు, సహకార బ్యాంకుల సీఈవోలతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, రైతులకు ఎన్ని ఎకరాలు ఉందో, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారో గ్రామ సభల్లో గుర్తించి జాబితా తయారుచేస్తామన్నారు.
ఆ ప్రకారం వారికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. కౌలు రైతులకు ఎలా సాయం చేయాలన్న దానిపై కసరత్తు చేస్తున్నామన్నారు. కౌలు రైతులను అధికారికంగా గుర్తించేలా డాక్యుమెంటు ఉండాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా నేరుగా ఇవ్వడం సాధ్యంకాదని తెలిపారు. ఒకవైపు రుణమాఫీ పూర్తిగా చేసి, ఇప్పుడు పెట్టుబడి ఖర్చు కింద డబ్బులు ఇవ్వడం చరిత్రాత్మకమన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రైతు యూనిట్‌గా మార్పు చేయాలని తాము కేంద్రానికి సూచించామన్నారు. ఈ విషయంపై ప్రధానమంత్రి మోదీతోనూ సీఎం చర్చించారని వెల్లడించారు.
ఏఈవో యూనిట్‌గా కొనుగోలు కేంద్రం
ఇక నుంచి వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) యూనిట్‌గా కొనుగోలు కేంద్రాలు నడుస్తాయని పోచారం తెలిపారు. అంతేగాక ఏఈవోనే విత్తనాలు, ఎరువులను కూడా రైతులకు అందజేస్తారన్నారు. వచ్చే నెల మొదటి వారంలో ‘మన తెలంగాణ, మన వ్యవసాయం’కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఎండీ మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ భూములను
పంట కాలనీలుగా మార్చాలి
రాష్ట్ర జనాభాకు అనుగుణంగా వ్యవసాయ భూములను పంట కాలనీలుగా మార్చి రైతులకు లాభాలు, వినియోగదారులకు నాణ్యమై న ఆహార ఉత్పత్తులు అందే విధంగా ప్రణాళి కలు రూపొందించాలని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఏదైనా పంటకు మంచి ధర రాగానే తదుపరి ఏడాది రైతులు ఎక్కువ మొత్తంలో సాగు చేయడంతో ధరలు పడిపోయి నష్టపోతున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించి.. రైతులకు, వినియోగదారులకు లాభం చేకూర్చడానికి ఈ పంట కాలనీలు ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు.