
సాక్షి, హైదరాబాద్: గతంలో ఏదైనా సంఘటన జరిగినా లేదా అత్యవసర పరిస్థితుల్లో.. డయల్ 100కు ఫోన్ చేసినా పోలీసులు ఘటనా స్థలికి చేరుకోడానికి గంటకుపైగా సమయం పట్టేది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీస్ శాఖ టెక్నాలజీ పరంగా మంచి ఫలితాలు సాధిస్తోంది. దీంతో డయల్ 100 నాలుగేళ్ల నుంచి ప్రజలకు విశేషంగా చేరువైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలోని కమిషనరేట్లలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. గతంలో ఘటనా స్థలికి చేరుకోవడానికి సరైన వాహనాలు ఉండేవి కాదు.. మరోవైపు ఘటన జరిగిన స్థలం గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టేది. టెక్నాలజీ వినియోగం పెరగడంతో డయల్ 100 ద్వారా నేరుగా లొకేషన్‌కు పోలీసులు చేరిపోతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలోనే కాక రాష్ట్రంలోని మిగతా కమిషనరేట్లలోనూ డయల్ 100 రెస్పాన్స్ టైం గంటల నుంచి నిమిషాలకు తగ్గింది.
గ్రామీణ ప్రాంతాలపై నజర్..
హైదరాబాద్ కమిషనరేట్ మినహా మిగతా కమిషనరేట్లలోని అర్బన్ ప్రాంతాల్లో 10 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంటున్న పోలీసులు.. రూరల్ ప్రాంతాలకు చేరడానికి మాత్రం కాస్త సమయం పడుతోంది. ఎందుకంటే అర్బన్ పోలీస్‌స్టేషన్ల పరిధి తక్కువగా ఉండటం, పైగా పెట్రోలింగ్ గస్తీలో ఎప్పటికప్పుడు రౌండ్లు వేస్తుండటం వల్ల సులభంగా బాధితులు తెలిపిన ప్రాంతాలకు చేరుతున్నారు. రూరల్ ప్రాంతాలకు వచ్చేసరికి పోలీస్‌స్టేషన్‌కు రెండు గస్తీ వాహనాలు, నాలుగు బ్లూకోట్స్ వాహనాలు ఉండటంతో అనేక గ్రామాలకు తిరగడం కష్టమవుతోంది. సిబ్బందిలోటు కూడా కొంత ఇబ్బంది పెడుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ పెట్రోలింగ్ వాహనాలను పెంచడం, సిబ్బంది కూడా అందుబాటులోకి రావడంతో మరిన్ని గస్తీ వాహనాలను పెంచాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అర గంటకు పైగా సమయం పడుతున్న డయల్ 100 రెస్పాన్స్ టైంను 10 నుంచి 15 నిమిషాల్లోపు తీసుకురావాలని భావిస్తోంది.
కమిషనరేట్లలో పరిస్థితి ఇదీ..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2014 ఆగస్టులో డయల్ 100 రెస్పాన్స్ టైం 30 నుంచి 40 నిమిషాలు ఉండేది. ఇది ఒక్క ఏడాదిలో అంటే 2015–16 నాటికి 8 నుంచి 10 నిమిషాలకు తగ్గింది. ఈ మార్చి నాటికి డయల్ 100 రెస్పాన్స్ టైం 3.4 నిమిషాలకు తగ్గడం గమనార్హం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసర సహాయాలకు సంబంధించిన రెస్పాన్స్ టైంలో హైదరాబాద్ కమిషనరేట్ రికార్డు సృష్టించింది. బెంగళూర్, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా తదితర కమిషనరేట్లలో అత్యవసర రెస్పాన్స్ టైం 10 నుంచి 20 నిమిషాల మధ్య ఉన్నట్టు పోలీస్ శాఖ అంచనా వేసింది.
ప్రత్యేకంగా ఐటీ బృందాలు
ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం తగ్గించేందుకు టెక్నాలజీ వినియోగంలో సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఉదాహరణకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో జనవరిలో డయల్ 100 రెస్పాన్స్ టైం 2 గంటలపైన ఉండేది. అయితే కమిషనర్ మహేష్‌భగవత్ ప్రత్యేకంగా ఐటీ బృందాన్ని రంగంలోకి దించి పెట్రోలింగ్ సిబ్బంది, స్టేషన్ల అధికారులకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఫిబ్రవరిలో డయల్ 100 రెస్పాన్స్ టైం 39.02 నిమిషాలకు తగ్గింది. ఇలా నిరంతరం మానిటరింగ్ చేస్తూ రెస్పాన్స్ టైంను నిమిషాలకు తెచ్చేందుకు ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. సైబరాబాద్‌లో కమిషనర్ సజ్జనార్ రెస్పాన్స్ టైంను గ్రామీణ ప్రాంతాల్లో తగ్గించేందుకు ఐటీ బృందాన్ని విస్తృతం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతీ స్టేషన్‌కు పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోట్స్ వాహనాలు పెంచడంతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేసేందుకు ఐటీ బృందాన్ని రంగంలోకి దించారు. దీంతో రూరల్ ప్రాంతాల్లోనూ రెస్పాన్స్ టైం తగ్గనుంది.
కింది స్థాయి సిబ్బంది గొప్పతనమే..
హైదరాబాద్ దేశంలో బెస్ట్ లివింగ్ సిటీగా పేరు సాధించడానికి నేరాల నియంత్రణ ఓ ప్రధాన కారణం. నేర నియంత్రణలో డయల్ 100 కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిధులు, సీఎం కేసీఆర్ తోడ్పాటుతో టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైంను నిమిషాల్లోకి తీసుకొచ్చాం. ఇదంతా కిందిస్థాయి సిబ్బంది గొప్పతనమే. అంకితభావం, సేవలతో వారు రాష్ట్ర పోలీస్ శాఖను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు. ఇతర కమిషనరేట్లు, జిల్లాల్లోనూ రెస్పాన్స్ టైంను నిమిషాల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. – డీజీపీ మహేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment