సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా నలుగుతున్న డీఎస్పీ సీనియారిటీపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓ మధ్యేమార్గానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీనియారిటీపై పట్టువిడవకుండా వ్యవహరిస్తున్న ప్రమోటీ, డైరెక్ట్ రిక్రూట్ అధికారులకు సమన్యాయం చేసేందుకు ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసు శాఖ వర్గాలు తెలిపాయి. విభజన సమస్యలపై ఇటీవల జరిగిన భేటీలో డీఎస్పీల పంపకాలు, ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ సమస్య, పరిష్కారాలపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లు చర్చించినట్లు తెలిసింది.
తుది కేటాయింపులు జరిగితేనే..
ప్రస్తుతం ఏ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులను ఆ రాష్ట్రంలోనే కొనసాగించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని డీఎస్పీలు ఇక్కడే పనిచేసేలా, ఏపీలోని అధికారులు అక్కడే ఉండేలా ఇరు ప్రభుత్వాలు ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. అలాగే కమలనాథన్ కమిటీ చేసిన తాత్కాలిక కేటాయింపులను తుది కేటాయింపులుగా పరిగణిస్తూ ఆదేశాలిచ్చేలా చూడాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లు కేంద్రానికి విన్నవించబోతున్నారు. తాత్కాలిక అలాట్‌మెంట్ కింద ఇప్పటికే 95 శాతం అధికారులు వారి వారి రాష్ట్రాలకు పరస్పర ఒప్పందంతో వెళ్లారు. దీంతో తుది కేటాయింపులు జరిగితేనే పూర్తి స్థాయి, కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతులు, సీనియారిటీ సమస్యలు తీరనున్నట్లు పోలీసు శాఖ భావిస్తోంది.
ఎక్కడికక్కడే సీనియారిటీ
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సీనియారిటీ జాబితా పొరపాట్లపై ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ జాబితా రూపొందించాలని హైకోర్టు గతంలోనే ఆదేశించింది. దీనిపై రెండు రాష్ట్రాల పోలీసు అధికారులు మూడేళ్లు కసరత్తు చేసినా కొలిక్కి రాలేదు. దీంతో తెలంగాణ, ఏపీకి వేర్వేరుగా ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ జాబితా రూపొందించుకోవాలని ఇరు రాష్ట్రాల పోలీసు పెద్దలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అభిప్రాయపడినట్లు తెలిసింది.
ఎక్కడి డీఎస్పీలు అక్కడే!
Published Sun, May 20 2018 3:04 AM | Last Updated on Fri, May 25 2018 5:59 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment