
వసూళ్ల దందా..!
- సివిల్ కేసులపైనే పోలీసుల కన్ను
- ఫిర్యాదుకు జంకుతున్న బాధితులు
- యల్ ఎస్టేట్ నుంచి ఇసుక దాకా అంతా వారి కనుసన్నల్లోనే...
- టార్గెట్లు పెడుతున్న ఉన్నతాధికారులు?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో పోలీసులు నింది తులు, ఫిర్యాదులదారుల నుంచి వసూళ్లు చేస్తూ తమ ప్రత్యేక శైలిని చాటుకుంటున్నారు. ఏఎస్‌ఐలు, సీనియర్ పోలీసు సిబ్బందిని సెటిల్‌మెంట్లు, వసూళ్ల కోసం పురమాయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. చాలాచోట్ల ఇటీవలే పోలీసు ఉద్యోగంలోకి వచ్చిన ఎస్‌ఐలను పక్కన పెట్టి కొందరు సిబ్బంది వసూళ్లకు, సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారులతో చెలరేగుతున్న ఇసుక మాఫియాకు పోలీసులు కూడా పూర్తిస్థాయిలో అండగా నిలుస్తున్నారు. ఉన్నతాధికారులకు కూడా రెగ్యులర్ మామూళ్లు ఇస్తూ బుట్టలో వేసుకుని కిందిస్థాయి పోలీసు సిబ్బంది చెలరేగి పోతున్నారు. సర్కిల్, డివిజన్ స్థాయి అధికారులు కిందిస్థాయి అధికారులకు నెల మామూళ్ల కోసం టార్గెట్లు విధిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
చిల్లర కేసులు మొదలు..
చిన్నా చితకా కేసులు మొదలకుని రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్ల దాకా ఏ ఒక్క అవకాశాన్నీ వదిలి పెట్టడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా సాగే షాద్‌నగర్, మహబూబ్‌నగర్ ప్రాంతంలో కొందరు అధికారులు ఏకంగా వ్యాపారంలో భాగస్వాములుగా చేరి చక్రం తిప్పుతున్నారు. రియల్ వ్యాపారంలో ఎదురయ్యే చిన్నా చితక సమస్యల్లో జోక్యం చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. ఇసుక వ్యాపారం జోరుగా సాగే మండలాల్లో పోస్టింగులు తెచ్చుకుంటున్న కొందరు అధికారులు అడ్డు తగిలే స్థానికులపై కేసుల నమోదు పేరిట బెదిరింపులకు గురి చేస్తున్నారు. మహిళపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు, వ్యక్తుల అదృశ్యం, దోపిడీ ఘటనలు నిత్యం జిల్లాలో ఏదో మూలన చోటు చేసుకుంటున్నాయి. వీటిని అరికట్టాల్సిన పోలీసుల దృష్టి సొంత దందాలపైనే ఎక్కువగా ఉంటోందనే విమర్శలు వస్తున్నాయి.