బాస్ రాకపై గుబులు
సంగారెడ్డి క్రైం: కొత్త ఎస్పీ సుమతి బాధ్యతలు చేపట్టకముందే కొందరు ఖాకీల్లో గుబులు పుడుతోంది. విధుల్లో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించని అధికారిగా సుమతికి పేరుండడంతో పనిదొంగలంతా సర్దుకునే పనిలో పడ్డారు. ఆమె 3వ తేదీన బాధ్యతలు చేపట్టనుండడంతో అంతకు ముందే సెలవులో వెళ్లిపోవాలని భావిస్తున్న కొందరు సెలవు చీటీతో ఎస్పీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
ఎవరినీ ఉపేక్షించరట!
జిల్లా ఎస్పీగా ఉన్న డా.శెముషీ బాజ్‌పాయ్ హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి బదిలీ కాగా, ఆమె స్థానంలో కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న బి.సుమతిని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. నవంబర్ 3వ తేదీన ఏకాదశ మంచి రోజు ఉన్న కారణంగా ఆరోజే ఎస్పీగా బాధ్యతలు చేపట్టాలని కొత్త ఎస్పీ సుమతి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. విధులను నిర్లక్ష్యం చేసే పోలీసులు ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే వారి పట్ల సుమతి కఠినంగా వ్యవహరిస్తారన్న ప్రచారం పోలీసు శాఖలో జోరుగా సాగుతోంది. సుమతి వరంగల్ డీఎస్పీగా, మల్కాజ్‌గిరి ఏసీపీగా, సీఐడీ ఎస్పీగా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేశారు.
పని విషయంలో ఆమె చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని శాఖలో చర్చించుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ఆమె పనిచేసిన సమయంలో విధులను సక్రమంగా నిర్వర్తించని పోలీసుల పట్ల ఉపేక్షించకపోవడం, శాఖాపరంగా చర్యలు తీసుకోవడం వల్ల ప్రస్తుతం జిల్లాలో కొందరు పోలీసులకు భయం పుట్టుకుంది. ఆమె రాకముందే సెలవులు పెట్టి విధులకు కొన్ని రోజులు దూరంగా ఉంటే మేలన్న యోచనలో కొందరు పోలీసులున్నారు. దీంతో తమకు దీర్ఘకాలిక సెలవులు కావాలంటూ ఎస్పీ శెముషీ వద్దకు లెటర్లు పట్టుకొని ప్రతిరోజు చక్కర్లు కొడుతున్నారు. కానీ ఆమె ససేమిరా అనడంతో ఆందోళన చెందుతున్నారని ఖాకీలు చర్చించుకుంటున్నారు.