బీటెక్ విద్యార్థి అదృశ్యమా.. డ్రామాలా!
వలిగొండ: గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన ఇంజనీరింగ్ విద్యార్థి గణేష్ కేసులో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు బీటెక్ స్టూడెంట్ కిడ్నాప్ అయ్యాడా.. అదృశ్యమయ్యాడా.. లేక ఎక్కడో తలదాచుకుంటూ కావాలనే డ్రామాలు ఆడుతున్నాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఏరియాలో గణేష్ ఉన్నట్లు ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించినట్లు ఎస్ఐ ప్రకాశ్ తెలిపారు. నేటి సాయంత్రంలోగా అతడిని వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పచెబుతామని చెప్పారు. ఓ వైపు ఈ నెల 6వ తేదీ నుంచి తమ కుమారుడు గణేష్ కనిపించడం లేదని విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేయగా, మరోవైపు గణేష్ మాత్రం తరచుగా బంధువులతో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే వారు కేసును పక్కదోవ పట్టిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏం జరిగిందంటే...
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన గణేష్ ఘట్‌కేసర్ లోని వీబీఐటీ బీటెక్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గణేష్ అదే కాలేజీకి చెందిన తన ప్రియురాలితో కలసి భద్రాచలం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 6వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మణుగూరు రైలు ఎక్కి మధ్యలో దిగారు. తాము తీసుకున్న లాడ్జి రూములోనే ఆత్మహత్య చేసుకుందామని సూచించాడు. ప్రియురాలు వద్దని చెప్పినా సూసైడ్ చేసుకునేందు క్రిమిసంహారక మందు తెచ్చేందుకు వెళ్లాడు. చెప్పా పెట్టకుండ ఆ యువతి హైదరాబాద్‌కు చేరుకుని అనంతరం కాలేజీకి వెళ్లి విషయాన్ని చెప్పింది. గణేష్ మాత్రం ఇంటికి తిరిగిరాలేదని, అదృశ్యమయ్యాడని అతడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.