దుకాణంలో సోదాలు చేస్తున్న పోలీసులు
బొంరాస్‌పేట : కుయ్ కుయ్‌మంటూ ఒకటి తర్వాత ఒకటి బుగ్గ వాహనాలు.. ఎవరో వీఐపీలు వస్తున్నారని అనుకున్నారు ఊరంతా. ఆగిన వాహనాల నుంచి పోలీసు బలగాలు దిగాయి. కొద్ది సేపటికి.. ఊరి సమీపంలో తవ్వకాల్లో గుప్త నిధులు బయటపడ్డాయని అందుకే పోలీసులు మోహరించారని పుకార్లు షికార్లు చేశాయి. పోలీసుల హల్‌చల్ చూసి ప్రజలు బెంబేలెత్తారు. కాస్త తేరుకున్నాక మూకుమ్మడి సోదాలు చేసేందుకు వచ్చారనే విషయం అర్థమైంది. మండల పరిధిలోని తుంకిమెట్లలో గురువారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏఎస్పీ పరమాల నర్సింహులు, డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామంలోని పలు దుకాణాలు, ఇళ్లల్లో సోదాలు చేశారు.
బైకులు స్వాధీనం..
కార్డన్ సెర్చ్‌లో భాగంగా సరైన పత్రాలు లేని 19 బైకులు, 4 ఆటోలతో పాటు పలు దుకాణాల్లో దొరికిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. పరిగి, కొడంగల్ సీఐలు రంగా, శంకర్, పరిగి డివిజన్ పరిధిలోని ఎస్సైలు ఇందులో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న దొం గతనంకేసు, వాహనాల్లో డీజిల్ చోరీ అంశాలపై సాక్షిలో ప్రచురితమైన కథనాలకు స్పందించిన పోలీసులు తుంకిమెట్లలో కార్డర్ సెర్చ్ నిర్వహించారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment