అర్ధరాత్రి అలజడి | Policeman, gangster killed in gunfight near Hyderabad | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి అలజడి

Published Sun, Aug 3 2014 1:32 AM | Last Updated on Sun, Sep 2 2018 3:44 PM

అర్ధరాత్రి అలజడి - Sakshi

అర్ధరాత్రి అలజడి

- పోలీసులపై దొంగనోట్ల ముఠా దాడితో ఉలిక్కిపడ్డ స్థానికులు
- శామీర్‌పేట్ మండలం మజీద్‌పూర్ శివారులో ఘటన

శామీర్‌పేట్: అర్ధరాత్రి కలకలం రేగింది. దొంగనోట్ల ముఠా రెచ్చిపోయింది. మఫ్టీలో ఉన్న పోలీసులపై కత్తులతో దాడికి తెగబడింది. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా ఎస్‌ఐ ప్రాణాపాయస్థితికి చేరి చికిత్స పొందుతున్నాడు. ఆత్మరక్షణ కోసం ఎస్‌ఐ జరిపిన కాల్పుల్లో ఓ దుండగుడు కూడా మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి శామీర్‌పేట్ మండలం మజీద్‌పూర్ శివారులో చోటుచేసుకోగా ఉదయానికి విషయం సమీప గ్రామాలకు పాకింది. దీంతో శామీర్‌పేట మండల ప్రజలు వణికిపోయారు. శనివారం ఉదయం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మేడ్చల్, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కనకారెడ్డిలు గ్రామానికి చేరుకుని ఘటన గురించి తెలుసుకున్నారు.
 
నకిలీ నోట్ల తయారీ ముఠా నాయకుడు, మెదక్ జిల్లాకు చెందిన ఎల్లంగౌడ్ కోసం సైబరాబాద్  పోలీసులతో పాటు మరో రెండు జిల్లాల పోలీసులు గాలిస్తున్నారు. కానిస్టేబుల్ ఈశ్వర్‌రావు మృతికి  కారకులైన ముఠాను ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని పోలీసులు పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ఈ ముఠాలోని సభ్యులు రఘు, నరేష్, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  ఎల్లంగౌడ్ కోసం సైబరాబాద్, రంగారె డ్డి, మెదక్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగలోకి దింపారు.
 
పారిపోతూ చిక్కిన శ్రీకాంత్...
ఘటనా స్థలంలో ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి జరిపిన కాల్పుల్లో తన అనుచరుడు ముస్తఫా అక్కడికక్కడే మృతి చెందడంతో, షిఫ్టు కారును అక్కడే వదిలిన శ్రీకాంత్ మజీద్‌పురాకుపరుగుతీశాడు. అతన్ని అనుమానించిన గ్రామస్తులు పట్టుకున్నారు. తాను కారు డ్రైవర్‌నని.. రాజీవ్ రహదారిపై యాక్సిడెంట్ జరిగిందని.. అందరూ కొడుతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చానని గ్రామస్తులను నమ్మించాడు. తిరిగి రాజీవ్ రహదారికి ఎలా చేరుకోవాలో చెప్పాలని వారినే కోరాడు. గ్రామస్తుడి నుంచి రూ.10 తీసుకుని, లారీ కోసం రహదారిపై వేచి చూస్తుండగా, శామీర్‌పేట ఠాణా పెట్రోలింగ్ సిబ్బంది హైజలీ, హెచ్.కె.రవిలు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని అధికారులకు అప్పగించారు.

ప్రతి పోలీసుకూ ఆయుధం: హోంమంత్రి
ఈ సంఘటన నేపథ్యంలో హోంమంత్రి నాయిని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దొంగల ముఠాలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి పోలీసుకు ఆయుధం ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. జనసమ్మర్ధ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తామని హోంమంత్రి పేర్కొన్నారు. కానిస్టేబుల్ ఈశ్వర్‌రావు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈశ్వర్‌రావు మతదేహాన్ని స్వస్థలం వైజాగ్‌కు ప్రత్యేక హెలికాప్టర్‌లో పంపుతామన్నారు. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డికి ప్రభుత్వ ఖర్చుతో మంచి వైద్యం అందిస్తామన్నారు.
 ప్రాణాలకు తెగించి పోరాడారు:

సీవీ ఆనంద్
దుండగులు మారణాయుధాలతో దాడులు చేశారని, పోలీసులు ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడారని సీపీ సీవీ ఆనంద్ కొనియాడారు. కానిస్టేబుల్ ఈశ్వర్‌రావు మృతికి సంతాపం తెలిపారు. గాయపడిన ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎస్‌ఐ ఎడమ ఊపిరితిత్తిలో రక్తస్రావం కావడంతో ఆపరేషన్ అవసరమని డాక్టర్లు తెలిపారన్నారు.

అలా కలిశారు...
ముస్తఫా (22) మెదక్ జిల్లా సిద్దిపేట వాసి. ఎల్లంగౌడ్ సిద్దిపేట మండలం ఇమాంబాద్ గ్రామవాసి. సిద్దిపేట సమీపంలోని కాల్లకుంట కాలనీలో రాజు అలియాస్ చిన్నా అనే యువకుడు సుమారు మూడు నెలల క్రితం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  చిన్నా కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపేందుకు ముస్తఫా, ఎల్లంగౌడ్‌లు వచ్చారు. అక్కడే వారిద్దరికి పరిచయం ఏర్పడింది.    పంచాయతీలు, సెటిల్‌మెంట్లు, దాడులు, చోరీలు, దోపిడీలు, అరాచకాలలో ఆరితేరిన ఎల్లంగౌడ్‌కు ముస్తఫా ఆయుధమయ్యాడు.

నేరాలకు మారుపేరు ఎల్లంగౌడ్
దాదాపు ఎనిమిదేళ్లుగా సిద్దిపేట, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, జహీరాబాద్, మహారాష్ర్ట, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతాల్లో ఎల్లంగౌడ్‌పై 12 కేసులు నమోదయ్యాయి. వివిధ కేసుల్లో పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. బెయిల్‌పై విడుదలై మళ్లీ తన అరాచకాలను కొనసాగించాడు. భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఎల్లంగౌడ్ తండ్రి అంజాగౌడ్, తల్లి లచ్చవ్వ, భార్య భాగ్యలు స్వగ్రామం ఇమాంబాద్‌లో హోటల్, కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నారు.  

కాసులు ఇస్తే దాడులకు సై...
సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్‌లోని పేద కుటుంబంలో జన్మించిన ముస్తఫా విద్యార్థి దశలోనే విలాసాలకు అలవాటు పడ్డాడు. సుమారు మూడేళ్ల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన ముస్తఫా డబ్బు ఇస్తే ఎంతటి నేరామైనా చేసేవాడు. ఎల్లంగౌడ్‌తో పరిచయం ముస్తఫాను పెద్ద నేరస్తుడిగా మార్చేసింది. ఈ నేపథ్యంలో ఆయనపై ఐదు కేసులు నమోదయ్యాయి. అతడి తండ్రి జహంగీర్  హైదరాబాద్‌లో వాచ్‌మన్‌గా, తల్లి సలీమ బీడీ కార్మికురాలిగా, సోదరుడు గౌస్ ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇంటికి వెళ్లేవాడని, ఏం చేస్తున్నావని ప్రశ్నిస్తే... ‘అడగవద్ద’ని ఎదురు సమాధానం చెప్పేవాడని సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement