
కేసీఆర్, కడియం శ్రీహరి
హైదరాబాద్: అభివృద్ధే లక్ష్యంగా విధానాల రూపకల్పన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ముఖ్య కార్యదర్శులకు చెప్పారు. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో ఈ రోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతాబ్ధ కాలంగా తెలంగాణ ప్రజలు పడుతున్న గోసకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో విముక్తి కలిగిందన్నారు. తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలు, భవిష్యత్ ప్రణాళికలపై మనకు స్పష్టత ఉండాలని చెప్పారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత అధికార యంత్రాంగపైనే ఉందన్నారు.అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధే లక్ష్యంగా విధానాలను రూపొందిస్తారని చెప్పారు.
వాస్తవాల ఆధారంగా ఎలాంటి దాపరికంలేని బడ్జెట్ను ప్రవేశపెట్టాలన్నారు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధుల విధానంలో సమూల మార్పులు రానున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రిగా పని చేసిన నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండటం సానుకూల అంశమన్నారు. భౌగోళికంగా తెలంగాణకు, హైదరాబాద్కు అనేక అనుకూల అంశాలు ఉన్నాయన్నారు. విద్యుత్ విషయంలో కొంత ఇబ్బంది ఉందని అంగీకరించారు. దానిని అధిగమించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. తెలంగాణలో పనిచేసే అధికారులకు గొప్ప పని సంస్కృతి ఉందని పొగిడారు.శాఖల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడపాలన్నారు.
అనంతరం అన్ని శాఖల ముఖ్య కార్యదర్శలతో కలసి కేసీఆర్ భోజనం చేశారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర హాజరయ్యారు.